- నిజామాబాద్ లో మీ సేవా సెంటర్ ఓనర్ దందా
- నిందితుడి వద్ద స్టాంపులు.. పట్టాలు స్వాధీనం
- కార్పొరేటర్ భర్తతో సహా మరో పది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
నిజామాబాద్, వెలుగు: సిటీలో బొందెం చెరువు శిఖంలో ఇండ్ల కూల్చివేత ఘటన తర్వాత అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సర్వే నంబర్2099లోని 23.02 ఎకరాల చెరువును ఆనుకొని1.33 ఎకరాల ప్రైవేట్ల్యాండ్ పేరుతో శిఖంలోకి ఎంటరై ఫేక్ పట్టాలతో స్థలాల అమ్మినట్టు క్లారిటీ వచ్చింది. 100, 120, 150, 180 గజాల ప్లాట్లు చేసి సుమారు 73 మందికి విక్రయించినట్టు రెవెన్యూ శాఖతో కలిసి పోలీసులు లెక్క తేల్చారు. ఒక ముఠా ఏర్పడి నకిలీ పట్టాల దందా చేసే మీ-సేవా సెంటర్ నిర్వాహకుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆఫీసర్ల పేర్లతో తయారు చేసిన రబ్బర్‌స్టాంపులు, నకిలీ పట్టా పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. మరో పది మందిపై నిజామాబాద్ 5వ టౌన్లో పీఎస్ లో ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 10 నుంచి 14 డివిజన్ల పరిధిలో ప్రభుత్వ భూములు వందల ఎకరాల్లో ఉన్నాయి. ఇందులో కొంత భూమిని సుమారు 2 వేల మంది పేదలకు ఇండ్ల స్థలాలకు సర్కార్ ఇచ్చింది. మిగిలిన భూమిని కొట్టేసేందుకు ముఠాగా ఏర్పడి ఏండ్లుగా నకిలీ పట్టాలతో అమ్మకాలు చేస్తున్నారు. బొందెం చెరువు శిఖాన్ని కూడా అన్యాక్రాంతం చేయాలని ప్లాన్‌చేసి.. టీం బ్రోకర్వ్యవస్థను క్రియేట్‌చేశారు. చిరు వ్యాపారులను నమ్మించి అమ్మకాలు చేశారు. చెరువు పక్కన సర్వే నంబర్ 2,124లోని 1.33 ఎకరాల ప్రైవేట్ భూమి పేరిట బిజినెస్చేసి రూ.కోట్లు గడించారు.
దీన్ని ఆలస్యంగా గుర్తించిన రెవెన్యూ అధికారులు గత శనివారం 35 ఇండ్లను కూల్చివేశారు. దీంతో బాధిత కుటుంబాల సమస్య పై మజ్లిస్అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ఒవైసీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో కదలిక వచ్చి విచారణలో స్పీడ్పెరిగింది. ఎల్లమ్మగుట్ట కాలనీలోని మీ-సేవ సెంటర్ నిర్వాహకుడు నకిలీ పట్టాలు తయారు చేసినట్లు గుర్తించారు. ఒక్కోదానికి రూ.50 వేలు తీసుకొని అమ్ముతున్నట్లు తేల్చి అరెస్ట్ చేశారు.
ఇప్పటిదాకా సుమారు 500 పట్టాలు తయారు చేసినట్టు అనుమానిస్తున్నారు. నిందితులుగా కమల, మహ్మద్, మక్కల గోపాల్,10వ డివిజన్ కార్పొరేటర్కోమల్ భర్త నరేశ్, మస్తాన్, జావీద్, అనురాధ, ఉబేర్, అంజద్, మంజులతపై కేసులు నమోదు చేశారు. మేయర్ దండు నీతూ కిరణ్ భర్త దండు శేఖర్పైన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేయలేదు. అదేవిధంగా నకిలీ పట్టాలను ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్ చేసిన సబ్రిజిస్ట్రార్లను విచారించాలని బాధితులు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతును కోరారు.