రోజూ ఇంటి ముందు వేసే ముగ్గులకు సంక్రాంతి ముగ్గులకు తేడా ఉంటుంది. పాత రోజుల్లో మట్టి ఇళ్లు ఎక్కువగా ఉండేవి. ఆ ఇళ్లను శుభ్రంగా ఊడ్చి, పేడతో అలికేవాళ్లు. ఆ తర్వాత మెలికలు, గీతలు, చుక్కలతో తెల్లటి ముగ్గులు వేసేవాళ్లు. తరువాత వాటికి ఒక పద్ధతిలో రంగులు దిద్దితే అందంగా మెరిసిపోయేవి వాకిళ్లు. రకరకాలుగా మారిన పరిస్థితుల్లో ఆనాటి ముగ్గులు ఇప్పుడు ఏ రూపంలో అలరిస్తున్నాయంటే...
పూర్వంలా ఇప్పుడు మట్టి ఇళ్లు అంత ఎక్కువగా లేవనే చెప్పొచ్చు. కొన్ని బిల్డింగ్‌ల ముందు వాకిట్లో ఉన్న కొద్ది నేలలోనే పేడతో అలికి ముగ్గులు పెడుతున్నారు. ఆ నేల కూడా లేక సిమెంట్ రోడ్ల మీదే ముగ్గులు వేసి, రంగులు అద్దుతున్నారు. ఇక అదే సిటీలో అయితే ఎటు చూసినా అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి. ఆ అపార్ట్మెంట్ గుమ్మాల ముందు రంగుల చాక్‌పీస్‌తో లేదా ముగ్గుతో రంగోలి డిజైన్స్ వేస్తున్నారు.
వాటిలో చుక్కలు కనిపించవు, మెలికలు ఉండవు. ప్రజెంట్ ట్రెండ్‌ని బట్టి మార్కెట్లో రకరకాల ప్రొడక్ట్స్ తయారుచేసి అమ్మే కంపెనీలు ఈ ముగ్గుల పని ఈజీ చేసేందుకు రంగోలి స్టిక్కర్స్ తెచ్చాయి. నగరాల్లో దాదాపు ప్రతి ఇంట్లో ఇప్పుడు ఇవే కనిపిస్తున్నాయనేది వాస్తవం. సంక్రాంతి సీజన్లో ముగ్గు కంటే ముగ్గు స్టిక్కర్లకే క్రేజ్ పెరిగింది అనేది వాస్తవం. వీటిని ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు.
హరిదాసు.. గంగిరెద్దు
సంక్రాంతికి పశువులను ఆరాధిస్తారు. అందులో భాగంగానే గంగిరెద్దుపై రంగురంగుల చీరలు కప్పి, కాళ్లకు గజ్జెలు కట్టి, కొమ్ములకు పూలు చుట్టి అందంగా అలంకరిస్తారు. బసవన్నను వెంటపెట్టుకుని సన్నాయి ఊదుతూ, డోలు కొడుతూ ‘అమ్మ వారికి దండం పెట్టు. అయ్య వారికి దండం పెట్టు’ అంటూ గంగిరెద్దును ఆడిస్తూ సందడి చేస్తారు. అంతేనా ‘హరి హరి నారాయణ...
ఆది నారాయణ’ అంటూ హరిదాసులు కీర్తనలు పాడుతూ ప్రతీ గుమ్మం ముందుకి వస్తారు. ఆ ఇంటి వాళ్లు ధాన్యం, బట్టలు, డబ్బులు... ఏవి ఇచ్చినా మహా ప్రసాదంగా తీసుకుని వెళ్తారు. ఇప్పుడు పల్లెల్లో అక్కడక్కడా మాత్రమే ఇలాంటివి కనిపిస్తున్నాయి. రోజులు మారుతున్న కొద్దీ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. అలాగే పద్ధతులు కూడా మారిపోతున్నాయి.
భోగి పండ్లు
భోగి రోజున పన్నెండేండ్ల వయసులోపు పిల్లలకు కొత్త బట్టలు వేసి, ముద్దుగా ముస్తాబు చేసి ఒక పీట మీద కూర్చోపెడతారు. తలపై భోగి(రేగు) పండ్లు పోస్తారు. దానికి కారణం ఏంటంటే... సంక్రాంతి సీజన్లోనే రేగు పండ్లు వస్తాయి. వీటిని పోషకాల గనిగా చెప్తారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, విటమిన్ –సి ఉంటాయి. రేగుపండ్లను వడియాలు
పచ్చడి అంటూ రకరకాల పద్ధతుల్లో వండుకుని తింటారు. ఆరోగ్యానికి మంచిది కాబట్టి పిల్లలు వీటిని తినేలా ఎంకరేజ్ చేయడానికి భోగి పండ్లు పోస్తారు. నిజానికి ఈ సీజన్లో వచ్చే ఈ పండ్లను చిన్నా, పెద్దా అందరూ తినాలి. అలా తింటేనే వాటినుంచి వచ్చే పోషకాలు అందుతాయి.
పసందైన రుచులు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ టైంలో స్పెషల్ వంటలు ఘుమఘుమలాడతాయి. వాటిలో బొబ్బట్లు, బెల్లం గవ్వలు, అరిసెలు, కజ్జికాయలు, సున్నుండలు, సకినాలు, మురుకులు, చెక్కలు, బూరెలు, నువ్వుల లడ్డు.. ఇలా బోలెడు రకాలు ఉంటాయి. వీటిలో బియ్యప్పిండి, బెల్లంతో చేసినవే ఎక్కువగా ఉంటాయి. అలాగే పండుగ నాడు కలగూర, చక్కెర పొంగలి దాదాపు ప్రతి ఇంట్లో వండుతారు. అప్పుడే కోత కోసిన బియ్యం, చెరకుతో చేసే వంటలు కొత్తదనానికి స్వాగతం చెప్తాయన్నమాట.
కనుమ
సంక్రాంతి పండుగలో చివరి రోజు కనుమ. ఒక రకంగా ఇది పశువుల పండుగ రోజు అని చెప్పొచ్చు. ఇప్పుడంటే ట్రాక్టర్స్ వచ్చాయి. కానీ, ఒకప్పుడు పొలం దున్నేందుకు ఎద్దుల్నే వాడేవాళ్లు. అందుకే వాటికి ‘థ్యాంక్స్’ చెప్తూ కనుమ పండుగను సెలబ్రేట్ చేస్తారు. ఎద్దుల్ని చక్కగా అలంకరిస్తారు. ఇదే రోజు తమిళనాడులో ‘జల్లికట్టు’ పేరుతో ఎద్దుల పందాలు జరుగుతాయి. మన దగ్గర కోడి పందాల్లాగానే అక్కడ ఇదొక స్పోర్ట్!