సర్కారు కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగినయ్ : జూనియర్ కాలేజీల్లో83 వేల ప్రవేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు కాలేజీల్లో స్టూడెంట్ల సంఖ్య పెరుగుతున్నది. గతేడాదితో పోలిస్తే ఇటు జూనియర్ కాలేజీలు, అటు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. ఈ మధ్యనే కాంట్రాక్టు లెక్చరర్లు రెగ్యులరైజ్ అయ్యారు. దీనికితోడు ఈ ఏడాది కొత్తగా టీజీపీఎస్సీ ద్వారా లెక్చరర్లు రానున్నారు. దీంతో సర్కారు కాలేజీలపై పేరెంట్స్ లో కొంత మంచి అభిప్రాయం నెలకొన్నట్టు స్పష్టమవుతున్నది. 

రాష్ట్రంలో 2024–25 విద్యాసంవత్సరంలో సర్కారు కాలేజీలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది 422 సర్కారు జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్లు జరిగాయి. ఆయా కాలేజీల్లో ఇప్పటివరకు మొత్తం 83,113 మంది స్టూడెంట్లు చేరారు. దీనిలో రెగ్యులర్ కోర్సులో 60,862 మంది ఉండగా, 22,251 మంది ఒకేషనల్ విద్యార్థులున్నారు. అయితే, ముందుగా మరో 541 మంది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరినా.. వివిధ కారణాలతో అడ్మిషన్లు క్యాన్సిల్ చేసుకున్నారు. వీరంతా గురుకులాల్లో చేరినట్టు అధికారులు చెప్తున్నారు. 

గతేడాది 70,730 అడ్మిషన్లు

గతేడాది 2023–24 విద్యా సంవత్సరం ఫస్టియర్ లో 70,730 మంది మాత్రమే చేరారు. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే 12,383 మంది స్టూడెంట్ల అడ్మిషన్లు పెరిగాయి. రాష్ట్రంలో అత్యధికంగా జీజేసీ గర్ల్స్ మహబూబ్ నగర్, జీజేసీ ఫలక్​నుమా, జీజేసీ ఎంఏఎం, జీజేసీ వెస్ట్ మారేడుపల్లి, జీజేసీ హుస్సేని ఆలం తదితర కాలేజీల్లో 2 వేలకు పైగా అడ్మిషన్లు అయినట్టు అధికారులు చెప్తున్నారు. జిల్లా కేంద్రాల్లోని సర్కారు కాలేజీలతో పాటు హైదరాబాద్ సిటీలోని కాలేజీల్లోనూ భారీగానే అడ్మిషన్లు అవుతున్నాయని పేర్కొంటున్నారు. మరోపక్క ఈ ఏడాది కొత్తగా సుమారు 15 కాలేజీలు వచ్చాయి. 

డిగ్రీలోనూ స్వల్పంగా పెరిగినయ్..

రాష్ట్రంలో జూనియర్ కాలేజీలతో పాటు డిగ్రీ కాలేజీల్లోనూ అడ్మిషన్లు పెరిగాయి. ఇప్పటికీ సర్కారీ అటానమన్, వర్సిటీ కాలేజీలకు ఫుల్ డిమాండ్ కొనసాగుతున్నది. 2024–25 విద్యా సంవత్సరంలో 160 సర్కారు డిగ్రీ కాలేజీల్లో 55,361 మంది చేరారు. గతేడాది 53,860 మంది మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే 1,501 అడ్మిషన్లు పెరిగాయి. అయితే, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో మాత్రం ఏకంగా 10 వేల అడ్మిషన్లు తగ్గాయి. గతేడాది 1,42,618 మంది చేరితే.. ఈ ఏడాది 1,32,388 మందికి తగ్గింది. హైదరాబాద్​తో పాటు జిల్లా కేంద్రాల్లోని డిగ్రీ కాలేజీల్లోని సీట్లకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాలేజీల్లో మిడ్డే మీల్స్ ప్రారంభిస్తే.. అడ్మిషన్లు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అత్యధికంగా హైదరాబాద్ 2, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో 4 వేలకు పైగా అడ్మిషన్లు కాగా, అత్యల్పంగా ములుగు జిల్లాలో 835 మంది మాత్రమే చేరారు. 

రెండేండ్లలో ఇంటర్ ఫస్టియర్​లో అడ్మిషన్లు

కోర్సు     2023    2024 
జనరల్    53,668    60,862
ఒకేషనల్     17,062    22,251  
మొత్తం     70,730    83,113 

ఇంటర్ అడ్మిషన్లలో టాప్ జిల్లాలు

జిల్లా     కాలేజీలు     అడ్మిషన్లు

హైదరాబాద్– 2    10     4,783 
రంగారెడ్డి      18    4,565 
మహబూబ్ నగర్    ​15     4,477 
సంగారెడ్డి     20     4,096