ఏటా సర్కార్ బడుల్లోతగ్గుతున్న విద్యార్థులు : 1,803 బడుల్లో స్టూడెంట్లు నిల్

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో ప్రతిఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది. దీనికి తోడు ఎక్కువ మంది పిల్లలు చదువుకుంటున్న బడులు కూడా తగ్గిపోతున్నాయి. బడ్జెట్ టైమ్​లో స్టూడెంట్ల డేటాను ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్ల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 26,845 సర్కారు స్కూళ్లు, కేజీబీవీ, సొసైటీ గురుకులాలు, యూఆర్ఎస్, మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 1,803 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా చదువుకోవడం లేదు. 

మిగిలిన వాటిల్లో 20 లక్షల మంది వరకు చదువుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14 బడుల్లోనే వెయ్యి మంది విద్యార్థులకు పైగా చదువుకుంటున్నారు. వీటిలో హైస్కూళ్లు 13 ఉంటే, ఒక ప్రైమరీ స్కూల్ ఉన్నది. 30 వరకు స్టూడెంట్లున్న స్కూళ్లు 9,043 ఉండగా, వీటిలో హైస్కూళ్లు కూడా వందకు పైగా ఉన్నాయి. 31 నుంచి వంద మంది స్టూడెంట్ల వరకు ఉన్నవి 10,562 బడులు. 101 నుంచి 250 వరకు విద్యార్థులున్న స్కూళ్లు 5,393 ఉన్నాయి. 251 నుంచి వెయ్యి మంది స్టూడెంట్లు ఉన్న స్కూళ్లు 1,375 వరకు ఉన్నాయి. వీటిలో 277 ప్రైమరీ స్కూళ్లు కాగా, 1,098 హైస్కూళ్లు. రాష్ట్రవ్యాప్తంగా 750కి పైగా విద్యార్థులు చదువుతున్న స్కూళ్లు కేవలం 43 ఉన్నాయి. వారం కింద విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం రూ.36.43 కోట్లు స్కూల్ గ్రాంట్ విడుదల చేసింది.

జీరో స్కూళ్లు తగ్గట్లే..

విద్యార్థుల్లేని స్కూళ్ల సంఖ్య మాత్రం మారడం లేదు. ఈ విద్యాసంవత్సరం జీరో ఎన్​రోల్ మెంట్ స్కూళ్లు మొత్తంగా 1,803 ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటిలో అత్యధికంగా లోకల్ బాడీ, సర్కారు స్కూళ్లు 1,791 ఉన్నాయి. అయితే, ప్రతి ఏడాది కొన్ని ఏరియాల్లో విద్యార్థులు  వస్తే.. జీరో ఎన్ రోల్ మెంట్ స్కూళ్లను తెరుస్తుండగా, మరో ఏరియాలో పిల్లలు లేకపోవడంతో మూతపడుతున్నాయి. ఇలా ఏటా 1,500పైగా జీరో ఎన్ రోల్ మెంట్ స్కూళ్లు ఉంటున్నాయి.