ఇన్​స్పిరేషన్ : అమెరికాలో మొదలై ప్రపంచమంతా

నైకీ.. ఇది బ్రాండ్‌‌‌‌ మాత్రమే కాదు చాలామందికి ఎమోషన్‌‌. అందుకే మార్కెట్‌‌లో నైకీ కాపీ ప్రొడక్ట్స్‌‌ కూడా హాట్‌‌ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. ఒకప్పుడు జపాన్‌‌ నుంచి షూలు దిగుమతి చేసుకుని అమెరికాలో అమ్ముకున్న ఈ కంపెనీ ఇప్పుడు టాప్ బ్రాండ్స్‌‌లో ఒకటి. అమెరికాలో మొదలైన దీని ప్రయాణం.. ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించింది.

నైకీ సామ్రాజ్యాన్ని బిల్ బోవర్‌‌‌‌మెన్‌‌, ఫిల్​నైట్ అనే ఇద్దరు గురు, శిష్యులు కలిసి స్థాపించారు. కానీ.. దీనికి పునాదులు వేసింది మాత్రం ఫిల్​నైట్‌‌. ఫిల్​కి చిన్నప్పటి నుంచి బిజినెస్ ఏదైనా పెట్టి సక్సెస్‌‌ కావాలనే కోరిక ఉండేది. కానీ.. అందుకు కావాల్సిన డబ్బు, ఎక్స్‌‌పీరియెన్స్ అతని దగ్గర లేవు. ఎలాగైనా సాధించాలనే పట్టుదల మాత్రం ఉండేది. దానివల్లే ఫిల్‌‌నైట్‌‌ బిలియనీర్ల లిస్ట్‌‌లో తన పేరు చేర్చుకోగలిగాడు. కోట్లమందికి ఆదర్శంగా నిలిచాడు. 

నైట్1957లో ఒరెగాన్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే బిజినెస్‌‌ ప్లాన్లు వేసేవాడు. అయితే.. అక్కడే బోవెర్‌‌మాన్ అనే ట్రైనర్‌‌‌‌ స్కూల్ ట్రాక్ అండ్‌‌ ఫీల్డ్ క్లబ్‌‌కు శిక్షణ ఇచ్చాడు. నైట్ కూడా ఆయన దగ్గర ట్రైనింగ్‌‌లో చేరాడు. ఆ టైంలో వాళ్లిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. కొన్నాళ్లకు నైట్ చదువు పూర్తి చేసుకుని యూనివర్సిటీ నుంచి వెళ్లిపోయాడు. అదే టైంలో నైట్‌‌ ఒక మారథాన్​లో పాల్గొని ఓడిపోయాడు. దానికి కారణం.. సరైన షూ లేకపోవడమే. అథ్లెట్ల కోసం మంచి రన్నింగ్‌‌ షూస్​ తీసుకొస్తే బాగుంటుంది అనుకున్నాడు. అప్పట్లో ప్యుమా, అడిడాస్‌‌ చాలా ఫేమస్‌‌ బ్రాండ్స్‌‌. అదే టైంలో జపాన్‌‌ కంపెనీలు తయారు చేసే కెమెరాలు అమెరికాలో ఎక్కువగా అమ్ముడు కావడం చూశాడు నైట్‌‌. అలా జపాన్ బ్రాండ్‌‌ షూస్​ అమెరికాలో అమ్మాలనే ఆలోచన వచ్చింది. 

టూర్‌‌‌‌ కోసమని వెళ్లి... 

అప్పట్లో జపాన్‌‌ కంపెనీలు తయారు చేసే రన్నింగ్‌‌ షూలు చాలా క్వాలిటీతో వచ్చేవి. కానీ.. అవి అమెరికాలో దొరికేవి కాదు. అదే టైంలో 1962లో జపాన్‌‌కి టూరిస్ట్‌‌గా వెళ్లాడు నైట్‌‌. అక్కడ ‘టైగర్‌‌’‌‌ అనే బ్రాండ్‌‌ షూస్​ చూశాడు. అవి అతనికి చాలా బాగా నచ్చాయి. వాటిని అమెరికాలో అమ్మాలనే ఆలోచన మొదలైంది. కానీ.. అప్పటికే అమెరికాలో ఉన్న బ్రాండ్స్‌‌ నుంచి పోటీ తట్టుకుని నిలబడడం చాలా కష్టం. అయినా.. ముందడుగు వేశాడు. 

కంపెనీ ఉందనీ.. 

‘టైగర్’ బ్రాండ్‌‌ సీఈవోతో మాట్లాడడానికి అపాయింట్‌‌మెంట్‌‌ తీసుకున్నాడు నైట్‌‌. కంపెనీ బోర్డ్‌‌ మెంబర్స్‌‌కి తన మార్కెటింగ్‌‌ ఐడియాలు, ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పాడు. వాటికి ఫిదా అయిన బోర్డ్ మెంబర్స్ అమెరికాలో టైగర్ బ్రాండ్ షూస్​ అమ్మడానికి ఒప్పుకున్నారు. కానీ.. కంపెనీ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలంటే ముందు నైట్‌‌కి ఒక కంపెనీ ఉండాలి. కానీ.. అప్పటివరకు అతనికి ఎలాంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లేదు. అయినా.. ఉందని అబద్ధం చెప్పి అమెరికా వచ్చేశాడు. కంపెనీ పేరు అడిగితే నోటికి వచ్చిన పేరు ‘బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్‌‌’  అని కూడా చెప్పాడు. 

శాంపిల్స్‌‌  

నైట్ జపాన్ నుంచి వచ్చేటప్పుడు టైగర్‌‌‌‌ కంపెనీ తయారు చేసిన కొన్ని స్నీకర్స్‌‌ శాంపిల్స్‌‌ తెచ్చాడు. వాటిలో రెండింటిని తను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ట్రైనర్‌‌‌‌గా ఉన్న బోవెర్‌‌మాన్‌‌కు పంపాడు. వాటి క్వాలిటీ, డిజైన్లపై అభిప్రాయం చెప్పమని అడిగాడు. ‘క్వాలిటీ చాలా బాగుంది.  అమెరికాలో కచ్చితంగా అమ్ముడవుతాయ’ని చెప్పాడు బోవెర్. అంతేకాదు.. తను కూడా బిజినెస్‌‌లో పార్ట్‌‌నర్‌‌‌‌గా ఉంటానని అడిగాడు. నైట్ అందుకు వెంటనే ఒప్పుకున్నాడు. అలా ఇద్దరూ కలిసి 1964లో కంపెనీ పేరు రిజిస్టర్ చేయించారు. తర్వాత జపాన్‌‌ నుంచి షూస్​ తెప్పించుకుని అమ్మడం మొదలుపెట్టారు. 

అమ్మకాలు

అమెరికా వాళ్లకు టైగర్ బ్రాండ్ గురించి తెలియకపోయినా.. వాటి క్వాలిటీ చూసి చాలామంది కొన్నారు. పైగా బోవెర్ తన స్టూడెంట్స్‌‌ అందరికీ ఈ షూస్​ కొనాలని చెప్పేవాడు. మొదట్లో నైట్‌‌ తన కారు డిక్కీలో కూడా కొన్ని షూస్​ తీసుకెళ్లి అమ్మేవాడు. కొన్నాళ్లకు అమెరికాలో టైగర్‌‌‌‌ షూస్​కు మంచి పేరొచ్చింది. మొదటి ఏడాదిలోనే 8,000 డాలర్ల బిజినెస్‌‌ జరిగింది. మరుసటి ఏడాది సేల్స్‌‌మెన్స్‌‌ని రిక్రూట్‌‌ చేసుకుని, సొంత స్టోర్ పెట్టారు. నైట్‌‌ సేల్స్‌‌, మార్కెటింగ్ మీద పనిచేసేవాడు. మరోవైపు బోవెర్‌‌‌‌ దిగుమతి చేసుకున్న షూ క్వాలిటీ చెక్‌‌ చేసుకోవడం, కొత్త షూ డిజైన్‌‌ చేయడం లాంటివి చేసేవాడు. ఆయన తయారు చేసిన డిజైన్‌‌ మోడల్స్‌‌ని కంపెనీకి పంపి తయారుచేయించేవాడు. 

బోవెర్‌‌మెన్‌‌ 1965లో టైగర్ షూ కంపెనీకి ఒక డిజైన్‌‌ పంపాడు. ఇది ప్యాడెడ్ ఇన్నర్‌‌సోల్‌‌, మడమ ముందు, పైభాగంలో స్పాంజ్ నియోప్రేన్, మధ్యలో గట్టి స్పాంజ్ రబ్బర్‌‌తో వస్తుంది. టైగర్ కంపెనీ కోర్టెజ్ పేరుతో దీన్ని 1967లో విడుదల చేసింది. కంఫర్ట్‌‌, క్వాలిటీ,  స్టైలిష్ డిజైన్ వల్ల ఇది ఫుల్‌‌ సక్సెస్‌‌ అయ్యింది. ముఖ్యంగా అమెరికాలో దీని సేల్స్ విపరీతంగా పెరిగాయి. అయితే.. ఈ షూని బ్లూ రిబ్బన్ కంపెనీ కాపీ చేసి అమ్ముతుందని టైగర్ కోర్టెజ్ ఆరోపించింది. ఆ తర్వాత రెండు కంపెనీల మధ్య సంబంధాలు చెడిపోయాయి. 

సొంత బ్రాండ్‌‌ 

జపాన్‌‌ కంపెనీతో కాంట్రాక్ట్‌‌ పూర్తయ్యాక సొంతంగా కంపెనీ పెట్టాలని నైట్‌‌, బోవెన్ డిసైడ్ అయ్యారు. వెంటనే బ్రాండ్‌‌కి ఏ పేరు పెట్టాలి? అని ఆలోచించారు. అప్పుడు వాళ్ల దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తి ‘నైక్’ పేరుని సూచించాడు. ఇది గ్రీకు మైథాలజీలో ‘విక్టరీ’ని రిప్రజెంట్‌‌ చేస్తుంది. దీని లోగోని కూడా అక్కడినుంచే ఇన్‌‌స్పైర్‌‌‌‌ అయ్యి తీసుకున్నారు. మొత్తానికి 1971లో నైకీ కంపెనీ మొదలైంది. 

అథ్లెటిక్ షూస్

నైకీ జర్నీ మొదలైనప్పటి నుంచి కొత్త కొత్త వ్యూహాలతో మార్కెటింగ్‌‌ చేస్తోంది. వరల్డ్‌‌లో టాప్‌‌ బ్రాండ్లలో ఒకటిగా నిలవడానికి క్వాలిటీతో పాటు మార్కెటింగ్‌‌ కూడా కారణమే. కంపెనీ పెట్టిన మరుసటి ఏడాది 1972 ఒలింపిక్ మారథాన్‌‌లో టాప్ సెవెన్ ఫినిషర్లలో నలుగురు నైకీ స్నీకర్లను వేసుకున్నారు. ఇది నైకీకి చాలా ప్లస్ అయ్యింది. నైకీ షూలు రన్నింగ్‌‌కి చాలా కంఫర్ట్‌‌గా ఉంటాయని అందరూ నమ్మారు. దాంతో అమ్మకాలు ఊపందుకున్నాయి. అప్పటినుంచి దీనికి అథ్లెటిక్ షూస్ అని పేరొచ్చింది. ఆ తర్వాత నైకీ అన్ని రకాల షూస్​, స్పోర్ట్స్‌‌ వేర్‌‌‌‌ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. రన్నింగ్‌‌ షూ కంపెనీగా మొదలై అనేక రకాల ప్రొడక్ట్స్‌‌ని మార్కెట్‌‌లోకి తీసుకొచ్చింది. 

జాగింగ్‌‌పై అవగాహన

బిల్ బోవర్‌‌మాన్ 1970వ దశకంలో రకరకాల ప్రయోగాలు చేసి, షూస్​ కోసం కొత్త రకం ట్రెడ్ (సోల్) తయారు చేశాడు. ఆ ట్రెడ్‌‌తో  ‘నైకీ మూన్ షూ’ ని మార్కెట్‌‌లోకి తెచ్చారు. ఇది నైకీ సక్సెస్‌‌లో కీలకం అయింది. అయితే.. దీన్ని ప్రమోట్‌‌ చేయడం కూడా కొత్తగా చేశారు. ఏ కంపెనీ అయినా  తయారుచేసిన వస్తువును మాత్రమే ప్రమోట్‌‌ చేస్తుంది. కానీ.. నైకీ మాత్రం తయారుచేసిన ప్రొడక్ట్ ​సేల్స్‌‌ పెరగడానికి ప్రజలకు ఆరోగ్యం మీద అవగాహన పెంచింది. అప్పట్లో జాగింగ్‌‌ అంటే ఎవరికీ అంతగా తెలియదు. కానీ.. బోవర్‌‌మాన్ జాగింగ్‌‌ గురించి ప్రచారం చేశాడు. దానివల్ల కలిగే హెల్త్​ బెనిఫిట్స్​ మీద ఒక పుస్తకం రాశాడు. జాగింగ్​ మీద రీసెర్చ్‌‌ చేసి మరీ కొన్ని స్టోరీలు రాశాడు. జాగింగ్‌‌ని ఫిట్‌‌నెస్ ప్రోగ్రామ్‌‌లో భాగంగా ఎలా మార్చుకోవాలో చెప్పాడు. మూడు పేజీల జాగర్స్ మాన్యువల్ పాంప్లెట్​ ప్రింట్ చేయించాడు. దీనివల్ల పబ్లిసిటీ జరిగి అమెరికాలో జాగింగ్‌‌కి విపరీతమైన క్రేజ్‌‌ వచ్చింది. జాగింగ్ చేసేవాళ్లంతా మార్కెట్‌‌లో బెస్ట్ జాగింగ్‌‌ షూ ఏదని వెతికారు. దాంతో ‘నైకీ మూన్‌‌ షూ’ సేల్స్‌‌ ఆకాశాన్నంటాయి. 

నష్టాలు 

నైకీ కంపెనీకి1970ల్లో బాగా లాభాలు వచ్చాయి. కానీ 1980ల మధ్యలో నష్టాలు మొదలయ్యాయి. సేల్స్​ తగ్గాయి. అందరూ ఇక కంపెనీ పని అయిపోయినట్టే అనుకున్నారు. కానీ.. మళ్లీ కొత్త స్ట్రాటజీతో ముందుకొచ్చింది కంపెనీ. అప్పటివరకు రన్నింగ్ షూ మీదే ఫోకస్‌‌ పెట్టిన కంపెనీ 80ల్లో ఒక్కో స్పోర్ట్​కి ఒక్కో రకం షూ తీసుకొచ్చింది.  ముఖ్యంగా ‘బాస్కెట్‌‌బాల్, టెన్నిస్, ఫుట్‌‌బాల్’ ప్లేయర్ల దగ్గరికి నైకీ కంపెనీ టీం వెళ్లి రీసెర్చ్‌‌ చేసి మరీ... క్వాలిటీ, కంఫర్ట్ ఉన్న షూస్​ తయారుచేసింది. దాంతో అతితక్కువ టైంలో కంపెనీకి పూర్వ వైభవం వచ్చేసింది.

స్పాన్సర్ కాకపోయినా.. 

సమ్మర్ ఒలింపిక్స్‌‌‌‌ 2012లో జరిగాయి. అప్పుడు అడిడాస్ టైటిల్ స్పాన్సర్. అందుకోసం 150 మిలియన్ల డాలర్లు చెల్లించింది ఆ కంపెనీ. దాంతో అందరూ అడిడాస్‌‌ సేల్స్‌‌ పెరుగుతాయి అనుకున్నారు. కానీ.. ఇక్కడ సీన్‌‌ రివర్స్ అయ్యింది. నైకీ రకరకాల మార్కెటింగ్ స్ట్రాటజీలు వాడి టీవీ అడ్వర్టైజ్​మెంట్స్​ చేసింది. దాంతో సమ్మర్‌‌‌‌ ఒలింపిక్స్‌‌కి నైకీ స్పాన్సర్‌‌‌‌గా ఉంది అనుకున్నారు. ఒలింపిక్స్‌‌తో నైకీని ట్యాగ్‌‌ చేస్తూ.. దాదాపు పదహారు వేల ట్వీట్లు చేస్తే అడిడాస్‌‌కు మాత్రం తొమ్మిది వేల ట్వీట్లు మాత్రమే వచ్చాయి. అంతేకాదు.. ఒలింపిక్స్ టైటిల్‌‌కు స్పాన్సర్ కంపెనీ ఏది అని సర్వే టీమ్‌‌లు ప్రజలను అడిగితే.. 21% మంది అడిడాస్ అని, 37% మంది నైకీ అని చెప్పారు.