నూతన విద్యా కమిషన్ భవిష్యత్తుకు బాటలు వేయాలి

విద్యా రంగంలో మార్పులు,  విద్యా వ్యవస్థ బలోపేతానికి, పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి సాంకేతిక విద్యతో పాటు విశ్వవిద్యాలయ విద్య వరకు.. ఒక సమగ్రమైన విద్యా విధానాన్ని రూపొందించడానికి తెలంగాణ విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  కొంత కాలంగా స్వయంప్రతిపత్తి గల  విద్యా కమిషన్​ను వేయాలని  డిమాండు చేస్తున్న పౌర సమాజం  ప్రభుత్వ  నిర్ణయాన్ని హర్షిస్తున్నది. 

అయితే, గత కొన్ని ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురి అయిన పాఠశాల విద్యలో జరగవలసిన మార్పులను చర్చించి వాటిని కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాలి.  పిల్లల సంఖ్య ఆధారంగా విద్యా విధానం ఉండాలి.  ముందుగా పిల్లల లెక్కలను తీయాలి.  పిల్లల జనాభాను బట్టి పాఠశాలలను ఏర్పాటు చేయాలి.  ప్రస్తుతం బడిలో నమోదు అయిన పిల్లలను బట్టి టీచర్ల నియామకాల విధానం లోపభూయిష్టంగా ఉంది.  ఈ విధానం అనుసరించడం వల్లనే  ప్రభుత్వ బడులలో పిల్లలు తగ్గుతూ రావడం,  పిల్లలు తగ్గారు కాబట్టి టీచర్లను తక్కువ చేయడం,  పర్యవసానంగా నాణ్యత  లోపించడం  ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి.  

పూర్వ ప్రాథమిక విద్య: మన రాష్ట్రంలో మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు 20 లక్షల మంది ఉంటారు. ఈ పిల్లలందరికి పూర్వ ప్రాథమిక విద్య అందించాలి. శిక్షణ పొందిన టీచర్లను నియమించాలి.  ప్రతి బడిలో పూర్వ ప్రాథమిక సెక్షన్లను ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో 4 లక్షల మంది పిల్లలు మాత్రమే అంగన్వాడి సెంటర్లలో నమోదై ఉన్నారు. 

పాఠశాల విద్య:  6 నుంచి 14 సంవత్సరాలు పిల్లలు ఒకటి నుంచి పదవ తరగతులలో చేరతారు. ఈ వయసు పిల్లలు దాదాపు 63  లక్షల మంది ఉన్నారు. ఈ పిల్లలు ప్రభుత్వంలో చదువుతున్నా,  ప్రైవేటులో చదువుతున్నా కూడా వీళ్ళంతా  విద్యా హక్కు చట్టం పరిధిలోకి వస్తారు.  ప్రణాళిక  రూపొందించేటప్పుడు రాష్ట్రంలోని 63  లక్షల మంది పిల్లలను  గమనంలోకి తీసుకోవాలి.  

ఇంటర్ విద్య: 15 నుండి 18 సంవత్సరాల పిల్లలు ఇంటర్ విద్యలో చదువుతుంటారు. దాదాపు 9 లక్షల మంది ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరంలో నమోదు అయ్యారు. కానీ, ఈ వయసు పిల్లలు దాదాపు 15 లక్షల జనాభా కలిగి ఉంటారని అంచనా.  అన్ని రాష్ట్రాల్లోవలెనే  సీనియర్ సెకండరీ విద్యను సిఫారసు చేయాలి. ఈ పద్ధతి వలన ప్రతి హైస్కూల్​లో 11, 12వ తరగతులు అందుబాటులోకి వస్తాయి. లక్షలాది మంది పిల్లలకు ప్రభుత్వ విద్య ఉచితంగా అందుతుంది.  మొత్తంగా చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్న 3 నుంచి 18 సంవత్సరాల కోటి మంది బాలలకు పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి పన్నెండవ తరగతి వరకు  విద్యా హక్కును అందించ డానికి కొత్త చట్టాన్ని విద్యా కమిషన్  ప్రతిపాదించాలి. అది దేశంలోనే విప్లవాత్మక నిర్ణయం అవుతుంది.  

వ్యవస్థీకృత మార్పులు: పాఠశాల విద్య పలు మంత్రిత్వ శాఖలలో వివిధ యాజమాన్యాల కింద పది, పన్నెండు రకాల బడులను నడుపుతున్నారు. వీటితో పాటు, పూర్వ ప్రాథమిక విద్య, ఇంటర్ విద్య అన్నిటిని ఒకే గొడుగు కిందికి తేవాలి. వాటికి స్వయం ప్రతిపత్తిని ఇస్తూనే ఈ సంస్థలలో విద్యా పర్యవేక్షణ,  నిర్వహణ విద్యాశాఖ గొడుగు కిందికి తీసుకురావాలి. అప్పుడే పిల్లలందరికి సమాన విద్య అందించడానికి వీలవుతుంది.

Also Read :- విపత్తులోనూ.. వికృత రాజకీయ క్రీడేనా?

పట్టణవిద్య: తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 శాతం జనాభా పట్టణాలలో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంత విద్యార్థుల అవసరాలు భిన్నంగా ఉంటున్నాయి. జీహెచ్​ఎంసీ పరిధిలోనే 21 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో 85% మంది  ప్రైవేట్లోనే చదువుతున్నారు.  గత రెండు దశాబ్దాలుగా  పట్టణ జనాభా రెండింతలు అయినా ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా తెరవలేదు. అందుకే పట్టణ ప్రాంతానికి వార్డు ఒక యూనిట్​గా  తీసుకొని అక్కడి పిల్లల జనాభాను బట్టి కేజీ నుంచి ఇంటర్ వరకు పాఠశాలలను అందుబాటులోకి తేవడానికి సిఫారసు చేయాలి. 

మండలం ఒక యూనిట్​గా విద్యాప్రణాళిక:  ప్రణాళికలు రూపొందించే సమయంలో మండలం ఒక యూనిట్​గా తీసుకుని ఆ మండలంలో ఉన్న3 నుంచి 18 సంవత్సరాల పిల్లలందరూ కేజీ నుంచి ఇంటర్​ విద్యను పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళికలు వేయాలి. కేంద్రీయ విద్యాలయాల నమూనాగా ఉన్నత పాఠశాలలను తీర్చిదిద్దాలి.  

రాష్ట్రంలో ఉన్న ఉన్నత పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాల నమూనాలో తీర్చిదిద్దడానికి సూచనలు చేయాలి.  ప్రైవేట్ విద్య నియంత్రణ:  రాష్ట్రంలో దాదాపు 34 లక్షల మంది విద్యార్థులు  ప్రైవేటు విద్యా సంస్థలలో చదువుకుంటున్నారు. ఒక అంచనా ప్రకారం తల్లిదండ్రులు దాదాపు 15 వేల కోట్ల రూపాయలు ఫీజులు ఇతర ఖర్చులు భరిస్తున్నారు. ఇది దాదాపు రాష్ట్ర విద్యా బడ్జెట్​తో సమానం. ఈ కుటుంబాలు డబ్బులు ఎక్కువ ఉండి  కాదు. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై విశ్వాసం కోల్పోవడమే ఈ దుస్థితికి కారణం.ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగు చేస్తే పేదరికాన్ని తొలగించినట్లేనని కమిషన్ ప్రభుత్వానికి నచ్చచెప్పాలి.  ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజు దోపిడీ విపరీతంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదనలో ఉన్నారు. ప్రైవేటు విద్యను నియంత్రించడానికి సూచనలు చేయాలి. 

ప్రత్యేక అవసరాల పిల్లలు:  రాష్ట్రంలో దాదాపు 80 వేల మంది ప్రత్యేక అవసరాల పిల్లలు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెపుతున్నాయి. ఈ పిల్లలందరికీ కావలసిన శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలి. ఇప్పటికే సమగ్ర శిక్ష అభియాన్ కింద కొంతమంది నిపుణులు పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో కమిషన్ ఒక సమీక్ష జరిపి నిపుణులతో సంప్రదింపులు జరిపి తగు సూచనలు చేయాలి.  ప్రతి గురుకులంలో బాలల సంరక్షణ విధానాన్ని తప్పక పాటించేవిధంగా కమిషన్  సిఫారసు చేయాలి.
 
బడ్జెట్: ప్రభుత్వ విద్యను గాడిలో పెట్టాలంటే విద్యకు రాష్ట్ర బడ్జెట్లో కనీసం 15 నుంచి  20 శాతం నిధులను కేటాయించాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతినెల పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా సిఫారసు చేయాలి.  వెంటనే పాఠశాల విద్యా కమిటీలను ఏర్పాటు చేయమని సూచించాలి. 

Also Read :- దేశాన్ని అభివృద్ధి చేసే వారిని అందించేది టీచర్లే.. ఆచార్య దేవోభవ

టీచర్ల భాగస్వామ్యం: విధాన నిర్ణయాలలో టీచర్లను భాగస్వామ్యం చేయాలి.  టీచర్లను బోధనేతర పనుల నుంచి విముక్తి  చేయాలి.  ఖాళీలను తాత్కాలికంగా నియమించుకునే అధికారం  ప్రధానోపాధ్యాయులకు  ఇవ్వాలి. కామన్ స్కూల్స్​కు  దారులు పడాలి.  పిల్లలందరూ ఒకటి లేదా రెండు కి.మీ. పరిధిలో ఉన్న బడికి మాత్రమే పోవాలనే చట్టం తేవడానికి  సిఫారసులు చేయాలి.

నాణ్యమైన విద్యా గ్యారంటీ ఇవ్వాలి

విద్యా కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వ ఉత్తర్వులలో నేషనల్ అచీవ్​మెంట్​ సర్వే 2021ని ఉదాహరిస్తూ .. రాష్ట్రం విద్యా సామర్థ్యాల సాధనలో వెనుకబాటులో ఉన్న స్థితిని మెరుగుపరచడానికి తగిన సూచనలు చేయడం కూడా కమిషన్ ఒక ప్రధాన అంశంగా పేర్కొన్నారు.  ప్రతి పాఠశాల తరగతి వారి  విద్యా సామర్థ్యాలు అందిస్తామని గ్యారంటీనివ్వాలి. 

ఆర్ వెంకట్ రెడ్డి