కొత్త యూనివర్సిటీల ఆవశ్యకత

రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి నైపుణ్యాలతో విద్య, విజ్ఞానం అందించే విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం అవసరం.  గతంలో జిల్లాకో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. అవి పాతకోర్సులకు పరిమితం అయ్యాయి. వాటి విస్తరణకు నిధులు ఇవ్వకపోవడం వల్ల ఎండిపోతున్నాయి. తెలుగు యూనివర్సిటీ, ఉద్యానవన విశ్వవిద్యాలయం వంటి వాటిద్వారా ఎంతమందికి నూతన ఉపాధి లభించిందో లెక్కలు లేవు. 

ఇక నుంచి ప్రతి యూనివర్సిటీ తన విద్యార్థులకు ఎంతమందికి, ఏ ఉపాధి లభించిందో  రోస్టర్ రిజిస్టర్ నిర్వహించడం అవసరం. అప్పుడే, కేటాయించిన బడ్జెట్​కు మేధో శ్రమశక్తి  సమాజంలో నిత్య జీవితంలో వికాసానికి ఎంతమేరకు ఉపయోగపడుతున్నదనేది తెలుస్తుంది.

వాన నీరు ఒడిసి పట్టడానికి చెరువులు, కుంటలు ప్రాజెక్ట్​లు కట్టడం జరిగింది.  ఒకవైపు నీటి కొరత, మరోవైపు దేశంలో 70 వేల టీఎంసీలు, రాష్ట్రంలో4 వేల టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలుస్తున్నాయి. మానవ వనరుల సంగతి కూడా ఇలాగే ఉంది. ఒకవైపు నైపుణ్యాలు కొరత, మరోవైపు నిరుద్యోగం కొనసాగుతున్నది. వ్యక్తిగతంగా తీసుకున్న రుణాలు మాఫీ పేరిట రూ.30 వేల కోట్లు పంచి, వెయ్యి, రెండు వేల కోట్ల పెట్టుబడుల కోసం విదేశాలను ఆశ్రయించాల్సి వస్తున్నది.  ప్రయివేటు వైద్యంకోసం పెడుతున్న ఆరోగ్యం సొమ్ముతో ప్రభుత్వ హాస్పిటల్స్ ఎన్నో కట్టవచ్చు. 

గ్రామీణ ఆర్థికవ్యవస్థ శిథిలం

నిరుద్యోగాన్ని గ్రామాల నుంచి లెక్క వేయాలి. పారిశ్రామిక ఉత్పత్తులు మార్కెటింగ్​తో  గ్రామీణ స్వయంపోషక ఆర్థిక వ్యవస్థ శిథిలమైపోయింది. వ్యవసాయంలో యంత్రాలు, కూలీలను నిరుద్యోగులను చేశాయి. చేతివృత్తులను యంత్రాలు ఆక్రమించాయి. చేనేతవంటివి చితికిపోయాయి. గ్రామీణ జనాభా ప్రతి వెయ్యిమందిలో 550 మందికి పనిలేకుండా పోయింది.  కరెంటు, ఆటోలు,  బైకుల రిపేరు,  ట్రాక్టర్ డ్రైవర్, టీచర్లు భవన నిర్నాణం వంటి పనులతో వందమందికి ఉపాధి లభించగా మిగతా 450 మందికి పనిలేకుండా అయింది. 

వీరు ఇతరులమీద ఆధారపడి బతుకుతున్నారు. పట్టణాలకు వలసలు పోతున్నారు. జిల్లా పరిధి దాటి పోకుండా జిల్లాను ఉపాధి నైపుణ్యాలలో స్వయం సమృద్ధిగా అభివృద్ది చెందే ప్రణాళికలు అవసరం.  గతంలో ప్రతి గ్రామం స్వయంసమృద్ధిగా  ఉండేది. నేడు కనీసం జిల్లా పరిధిలోనైనా స్వయంపోషకంగా ఉపాధి నైపుణ్యాలు, సహజ వనరులు,  యువతరం వనరులు వినియోగంలోకి తేవాలి. అందుకనువైన నూతన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. 

మేధావులు ముందుచూపుతో ఆలోచించాలి

రాజకీయ నాయకులు వర్తమానం గురించి ఆలోచిస్తారు. మేధావులు వర్తమానంతోపాటు భవిష్యత్ గురించి ఆలోచించాలి. గురువులుగా సమాజాన్ని మలుపు తిప్పాలి.  మేధావులకు ఉద్యోగాలు, సౌకర్యాలు, జీత భత్యాలు , ఉద్యోగ లభించడంలేదు. గొప్ప గొప్ప క్వాలిఫికేషన్లు, హోదాలు,  స్థానాల్లో ఉన్నవారు ఇలా మిన్నకుండిపోతున్నారు. 

సమాజ గమనాన్ని నిర్దేశించే బదులు ప్రేక్షకులుగా మారుతున్నారు. గొప్ప గొప్ప పదవులు, విద్యార్హతలు, హోదాలు లేనివారు మాట్లాడితే వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. పేదరికం వల్ల వారు చదువుకోలేకపోయారు. అనుభవం, అధ్యయనం, అవసరం వారి మేధస్సును వికసింపజేస్తుంది. మేధావులు, సమాజం దీన్ని గమనించడానికి సిద్ధంగా లేరు. అందువల్ల ఎన్నికల ఫలితాల ముందస్తు అంచనాలన్ని మారిపోయే తీర్పులు చూసి ఆశ్చర్యపోతుంటారు. 

ఇటీవల స్కిల్ డెవలప్​మెంట్  కోసం ఒక యూనివర్సిటీ పెట్టాలని వందకోట్ల మూలధనంతోపాటు ముచ్చర్ల కందుకూరి మండలం మీర్​ఖాన్ పేటలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు భూమిపూజ చేశారు. 17 కోర్సులు  ప్రకటించినా, మూడు, నాలుగు నెలల కోర్సులతోపాటు డిగ్రీ కోర్సులుంటాయని ఏటా 20 వేల మందికి శిక్షణ ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. దాన్ని కార్యరూపంలోకి తెస్తున్న ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులుఅభినందనీయులు. 

ఐటీ సెక్టార్ ద్వారా విదేశీ మారక ద్రవ్యం

 విదేశీ మారక ద్రవ్యం ఐటీ సెక్టార్ ద్వారా 45 శాతం సమకూరుతున్నది.  కృత్రిమ మేధో సెక్టార్ తో ఉద్యోగాలు, ఉపాధి కోత పడతాయి. తద్వారా 80 శాతం మంది ఉపాధి కోల్పోతారు.  ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుంది.  7.5లక్షల మంది ప్రత్యక్షంగా ఐటీ నిపుణులు తెలంగాణలో పనిచేస్తున్నారు. 20 లక్షల మంది పరోక్షంగా వీరిద్వారా ఉపాధి పొందుతున్నారు. అందువల్ల సంక్షోభం ముంచుకురాకముందే  నూతన ప్రణాళికలు ఆలోచించాలి.  హైదరాబాద్​లో నాలుగో  మహా నగరంగా ముచ్చెర్ల ప్రణాళిక  ఒక గొప్ప ఆలోచన. 

అలాగే ఔటర్ రింగు రోడ్ ఆనుకొని 33 ప్రాంతాల్లో 33 జిల్లాల నుంచి హైదరాబాద్ నగర సౌకర్యాలు వసతులు పొందడానికి గృహ నిర్మాణ సంస్థ,  ప్రయివేటు కలయికతో లక్షలాది మందికి టౌన్​షిప్​లు నిర్మించాలి.  తద్వారా కొన్నేండ్లపాటు లక్షలాది మందికి ఉపాధి, వసతితోపాటు, కాలుష్యం నివారణ ఏకకాలంలో పరిష్కారమవుతాయి.

30 లక్షల మందిఉద్యోగాలకోసం  నిరీక్షణ

ఉద్యోగం కోసం 30లక్షల మంది నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారాలు చూపించాలి.  నేను తమిళనాడు స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్​లను అధ్యయనం చేశాను.  బీసీ, ఎస్సీ డిపార్టుమెంట్ల ద్వారా 75 రకాల నూతన ఉపాధికి శిక్షణ ఉంది.  భూదాన్ పోచంపల్లిలో 22 రకాల  కొత్త, పాత స్కిల్స్​శిక్షణ నడుస్తున్నది.  తమిళనాడువలె మిగతా స్కిల్స్​ కూడా కలిపి  33 జిల్లాల్లో  శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించాను. గురుకుల పాఠశాల విద్యను  పీజీ వరకు పెంచి ఆయా డిపార్టుమెంట్స్​ పద్దులకిందనే యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని సూచించాను. ఇప్పటికీ ఇది అవసరమే.  

 స్కిల్ డెవలప్​మెంట్.. యూనివర్సిటీ రూపంలోకి వచ్చింది వీటిలో  చేరినవారికి వసతి, భోజన సౌకర్యాలు కలిపించడం అవసరం.  విదేశాల నుంచి చివరకు చైనా నుంచి సైతం ఎన్నో దిగుమతి చేసుకుంటున్నాం. వాటన్నిటిని ఇక్కడే ఉత్పత్తి చేసుకుంటే ఉపాధి పెరుగుతుంది. సంపద పెరుగుతుంది.  ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది.  పరిశ్రమలు ప్రభుత్వ, ప్రయివేటు కలయికతో  ఏర్పాటు చేయడం అవసరం. 

గద్దర్ పేరిట విశ్వవిద్యాలయం

సామాజిక వికాసానికి విద్య ఎంతో అవసరం. విద్య భారత రాజ్యాంగం మౌలిక లక్ష్యాల సాధనకు ఉపయోగపడాలి. మూఢ విశ్వాసాలను, రాజ్యాంగ లక్ష్యాలకు భిన్నమైన వాటిని తొలగించాలి. సంఘ సంస్కరణకు ఉపయోగపడే  విద్య అవసరం.  ప్రజల కళలను అభివృద్ధిపరచాలి.  గద్దర్ పేరిట అలాంటి ఒక విశ్వ విద్యాలయం అవసరం.  సామాజిక తాత్విక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా నాటి బౌద్ద విశ్వ విద్యాలయాలవలె నేడు సమాజంలో మార్పుకు సన్నద్ధం చేయాలి.  చేతివృత్తుల అభివృద్ధికి పరిశోధనతో కూడిన విశ్వ విద్యాలయం అవసరం.

  భవన నిర్మాణంలో నైపుణ్యాలతో ఉపాధి కల్పన జరుగుతుంది. అందువల్ల భవన నిర్మాణ నైపుణ్యాల విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలి. ఆయా రంగాల నిపుణులు,  అనుభవజ్ఞులు,  మేధావులు,  ప్రజలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల ఆలోచనా విధానాలను మలుపుతిప్పాలి.  ప్రజలు మారడానికి, ఉద్యమాలు చేయడానికి, పార్టీలు ఎన్నికల ప్రణాళికలో చేర్చుకోవడానికి,  న్యాయమూర్తులు నూతన కోణాలతో తీర్పులివ్వడానికి, సైంటిస్టులు నూతన అన్వేషణలు చేయడానికి, మానవీయ సంస్కృతిలో నూతన సంస్కృతిగా స్థిరపడడానికి ఉపయోగపడాలి.

- బిఎస్ రాములు మాజీ  చైర్మన్,  తెలంగాణ బీసీ కమిషన్