చదువుతోపాటు ఆటల్లో రాణించాలి

  • ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం        
  • వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు

నెట్​ వర్క్, వెలుగు : హాకీ లెజెండ్​ మేజర్​ ధ్యాన్​చంద్​ జయంతిని పురస్కరించుకొని గురువారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. జోరుగా క్రీడా పోటీలు నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మల్​పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీలకు కలెక్టర్ అభిలాష అభినవ్ హాజరయ్యారు. గెలుపొందిన విద్యార్థులకు సాయంత్రం కలెక్టరేట్​లో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. 

ప్రతి విద్యార్థి తమకు ఇష్టమైన ఆటను ఎంచుకొని అందులో ప్రతిభ చూపాలన్నారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్​జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు. ధ్యాన్ చంద్ విగ్రహానికి నివాళులర్పించారు. క్రీడాజ్యోతి వెలిగించి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడా ప్రాంగణంలో 400 మీటర్ల సింథటిక్ ట్రాక్, హాకీ కోసం ఆస్ట్రో టర్ఫ్, అంతర్జాతీయ ప్రమాణాలతో 

50 మీటర్ల స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. జాతీయస్థాయిలో మెడల్స్ సాధించిన వారికి క్రీడా దుస్తులు అందజేసి సన్మానించారు. డీవైఎస్​ఓ వెంకటేశ్వర్లు, నాయకులు గోవర్ధన్ రెడ్డి, క్రీడా సంఘాల నాయకులు రాష్ట్ర పాల్, కాంతారావు, హరిచరణ్ తదితరులు పాల్గొన్నారు.

గేమ్స్​తో ఫిజికల్ ఫిట్​నెస్

క్రీడలతో ఫిజికల్​ ఫిట్​నెస్, మానసిక ప్రశాంతత లభిస్తాయని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్​లో నిర్వహించిన క్రికెట్ పోటీలకు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు, డీఎఫ్ఓ  నీరజ్ కుమార్ టిబ్రేవాల్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారితో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ  ప్రభుత్వం క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో 

నిర్వహించిన క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయిలో నిలవాలన్నారు. మందమర్రి సింగరేణి హైస్కూల్​ గ్రౌండ్​లో యువజన కాంగ్రెస్​మాజీ రాష్ట్ర కార్యదర్శి మహంత్​అర్జున్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోలిండియా హాకీ ప్లేయర్, నేషనల్​ గోల్డ్​ మెడలిస్ట్ శనిగరపు క్రాంతిని సన్మానించారు. సేవాదళ్ మంచిర్యాల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎండి పాషా, లీడర్లు  పాల్గొన్నారు.