వీడు మామూలోడు కాదు.. కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులనే బురిడి కొట్టించాడు

రాజన్న సిరిసిల్లా జిల్లాలో గంగరాజు అనే యువకుడి కిడ్నాప్  మిస్టరీ వీడింది. కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులనే బురిడి కొట్టించాలనుకున్న మనోడి డ్రామా పోలీసుల ముందు పండలేకపోయింది.  రెండు రోజుల పాటు కిడ్నాప్ అంటూ హైడ్రామా నడిపిన యువకుడు చెప్పిన కథను పోలీసులు ఉత్తదేనని తేల్చారు.    తమదైన స్టైల్ లో విచారించిన పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. భూ తగాదాలతో తన బాబాయ్ ను కేసులో ఇరికించడానికే..యువకుడు కిడ్నాప్ డ్రామా ఆడినట్టు విచారణలో తేల్చారు పోలీసులు.  

 చందుర్తి మండలం ఆసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎక్కల గంగారాజు అనే యువకుడు ( 28)  రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు.  పొలం  దగ్గర ద్విచక్ర వాహనం,  చెప్పులు, సెల్ ఫోన్, చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.  ఎవరైనా హత్య చేసి ఉంటార లేక ఆత్మహత్య అనే కోణంలో బావిలో గాలించారు పోలీసులు. కరీంనగర్ కి చెందిన గజ ఈత గాళ్ళతో కూడా వెతకించారు. జాగిలాలతో పరిసర ప్రాంతాలలో గాలింపు చేశారు పోలీసులు. అయితే ఇవాళ తెల్లవారు జామున తన పొలం దగ్గర గంగరాజు కాళ్ళు, చేతులు కట్టేసుకొని, కొంత గాయాలతో బురద ఉన్న గడ్డిలో ప్రత్యక్షం అయ్యాడు.  గుర్తుతెలియనీ వ్యక్తులు కాళ్ళను చేతులను కట్టేసి అడవిలో వదిలి వెళ్ళిపోయారని పోలీసులకు చెప్పాడు. 

 గంగరాజుపై అనుమానం వచ్చిన పోలీసులు  లోతుగా విచారణ చేయడంతో అతడి డ్రామా బయటపడింది.  తన బాబాయ్  ఎక్కల దేవి రాజయ్యతో భూ వివాదాలు ఉండడంతో అతడిని క్రిమినల్ కేసుల్లో ఇరికించేందుకు ప్లాన్ వేసి కట్టుకథ అల్లినట్లు విచారణలో తేలింది.  పోలీసులనే  బురిడీ కొట్టించిన గంగరాజుపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు  తెలిపారు..