హుజూర్ నగర్, వెలుగు: చనిపోయేందుకు కొడుకుతో వెళ్లి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. బాలుడు చనిపోగా, తల్లిని రక్షించిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన ప్రకారం.. హుజూర్ నగర్ మండలం లక్కవరం గ్రామానికి చెందిన రణపంగు నవీన్, మమత దంపతులకు కూతురు సాన్వి, కొడుకు అయాన్(11నెలలు) ఉన్నారు. బుధవారం రాత్రి మమత తన కొడుకును తీసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది.
మొదట కొడుకును బావిలో పడేసింది. ఆ తర్వాత తాను దూకింది. ఇంటికి భర్త నవీన్ ఫోన్ చేయగా ఎత్తలేదు. వెంటనే వచ్చి చూడగా భార్య కనిపించలేదు. వారికోసం వెతుకుతూ సమీపంలోని బావి వద్దకు వెళ్లాడు. భార్య అందులో కనిపించడంతో గ్రామస్తుల సాయంతో ఆమెను బయటకు తీసి రక్షించారు. కొడుకు గురించి అడిగితే ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది.
గురువారం ఉదయం బావిలో కొడుకును వేసినట్టు చెప్పడంతో వెళ్లి చిన్నారి డెడ్ బాడీని వెలికి తీశారు. బాలుడి మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. మమత మానసిక స్థితి సరిగా లేదని తెలిపారు. పోలీసులు బాలుడు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. నవీన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చరమందరాజు తెలిపారు.