పాలమూరులో పోలింగ్​ ప్రశాంతం

  • అక్కడక్కడ మొరాయించిన ఈవీఎంలు
  • ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

మహబూబ్​నగర్, వెలుగు : లోక్​సభ​ ఎన్నికలు సోమవారం  ప్రశాంతంగా ముగిశాయి. మహబూబ్​నగర్​ పార్లమెంట్​ పరిధిలోని పాలమూరు, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్​, కొడంగల్, షాద్​నగర్​ అసెంబ్లీ సెగ్మెంట్లలో 16,82,470 మంది ఓటర్లు ఉండగా, 70 శాతానికి పైగా ఓట్లు పోల్​ అయ్యాయి. పలు సెంటర్లలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్​ ఆలస్యంగా ప్రారంభమైంది. 

సతాయించిన ఈవీఎంలు..

మద్దూరు మండల కేంద్రంలోని పోలింగ్​ స్టేషన్​ 67లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు టెక్నికల్​ ప్రాబ్లం వల్ల ఈవీఎం మొరాయించింది. ఓటు వేయడానికి వచ్చిన వాళ్లు అసహనంతో తిరిగి వెళ్లిపోయారు. మరో ఈవీఎంను ఏర్పాటు చేయడంతో 12 గంటల తర్వాత తిరిగి పోలింగ్​ ప్రారంభమైంది. ఇదే మండలం కొత్తపల్లి పోలింగ్​ స్టేషన్​ 101లో, 83లో కూడా ఈవీఎంలు సతాయించాయి. బాలానగర్​లోని పోలింగ్​ స్టేషన్​ 81లో ఉదయం 11:30 గంటలకు ఈవీఎం మొరాయించింది. వెంటనే ఆఫీసర్లు అందుబాటులో ఉన్న మరో ఈవీఎంను ఏర్పాటు చేశారు.

షాద్​నగర్​లోని 247లో పోలింగ్​ స్టేషన్​లో 7.40 గంటలకు ఈవీఎం ఆన్​ కాలేదు. అర గంట తర్వాత ఆన్​ కావడంతో తిరిగి ఓటింగ్​ ప్రారంభమైంది. కొత్తకోట మండలం కానాయపల్లిలోని పోలింగ్​ స్టేషన్​ 260లో ఉదయం 7 గంటల నుంచి ఈవీఎం ఆన్​ కాలేదు. గంట తర్వాత ఆన్​ కావడంతో పోలింగ్​ కొనసాగింది. కృష్ణా మండలం కున్సి గ్రామంలోని పోలింగ్​ స్టేషన్ 74లో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈవీఎం మొరాయించింది. గంట తరువాత ఆన్  కావడంతో పోలింగ్​ కొంత ఆలస్యమైంది.

మిడ్జిల్​ మండలం వేముల గ్రామంలోని 255 పోలింగ్​ సెంటర్​లో వీవీ ప్యాట్​ మొరాయించింది. ఐదు నిమషాల్లో ఆఫీసర్లు సరి చేశారు. కాగా, నవాబ్​పేట మండలంలోని పోలింగ్​ స్టేషన్​ 15లో ఉదయం 7.15 గంటలకు కరెంట్​ పోయింది. దాదాపు 20 నిమిషాల తర్వాత కరెంటు రాగా, అప్పటి వరకు పోలింగ్​ సిబ్బంది టార్చ్​ లైట్ల వెలుతురులో పోలింగ్​ను కొనసాగించారు. 

ఓటు తీసేశారని వృద్ధురాలి ఆందోళన

మరికల్​ మండలం రాకొండ గ్రామంలో లక్ష్మమ్మ అనే వృద్ధురాలు తన ఓటును డిలీట్​ చేశారని పోలింగ్​ స్టేషన్​ వద్ద ఆందోళనకు దిగింది. తాను ఓటు వేసేందుకు సెంటర్​ వద్దకు రాగా, ఓటరు లిస్టులో పేరు లేకపోవడంతో పోలింగ్​ సిబ్బందితో వాదనకు దిగింది. తాను బతికే ఉన్నా ఎందుకు ఓటును తీసేశారని, సెంటర్​ నుంచి బయటకు వచ్చి గేటుకు తాళం వేసింది. ఓటర్లంతా బయటే ఉండిపోవడంతో వెంటనే పోలీసులు సెంటర్​ వద్దకు వచ్చిన ఆమెను సముదాయించారు. అనంతరం సెంటర్​ గేటును ఓపెన్​ చేశారు.

కాంగ్రెస్, బీజేపీ లీడర్ల మధ్య తోపులాటలు

పోలింగ్​ సందర్భంగా పలు సెంటర్ల వద్ద కాంగ్రెస్​, బీజేపీ లీడర్ల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. వెంటనే పోలీసులు అలర్ట్​ కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఊట్కూరు మండలం మల్లెపల్లి గ్రామంలో, ఫరూక్​నగర్​ మండలం వెలిజాలలో, కోయిల్​కొండ మండలంలోని మల్కాపూర్​, పెర్కివీడు గ్రామాల్లో రెండు పార్టీల లీడర్ల మధ్య స్వల్ప ఉద్రిక్తలలు చోటు చేసుకున్నాయి. పోలీసులు వెంటనే వారిని చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

సైలెంట్​ ఓటింగ్..​

మహబూబ్​నగర్​ పార్లమెంట్​ స్థానంలో సైలెంట్​ ఓటింగ్​ నడిచింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైనా మందకొడిగా సాగింది. 9 గంటల నుంచి 12 గంటల వరకు కొంత పుంజుకోగా, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు పోలింగ్​ శాతం కొంత తగ్గింది. చివరి రెండు గంటల్లో ఓటర్లు పెద్ద మొత్తంలో సెంటర్లకు వచ్చి ఓట్లు వేశారు. అయితే పార్లమెంట్​ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో సైలెంట్​ ఓటింగ్ నడవడంతో ప్రధాన పార్టీల క్యాండిడేట్లు డైలమాలో పడ్డారు. ఓటర్ల నాడి అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఎవరు ఎవరికి ఓట్లు వేశారనే కన్​ఫ్యూజన్​లో ఉన్నారు.

స్ట్రాంగ్​ రూమ్​లను చేరిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లు

పార్లమెంట్​ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ను ఆఫీసర్లు పూర్తి చేశారు. కొందరు ఓటర్లు 6 గంటల తర్వాత పోలింగ్​ సెంటర్​కు రాగా, టైం అయిపోవడంతో వారిని తిప్పి పంపించారు. పోలింగ్​ పూర్తి కావడంతో ఆయా సెంటర్లలోని వీవీ ప్యాట్లు, ఈవీఎంలను ఎన్నికల సిబ్బంది సీల్​ వేశారు. అనంతరం వాటిని పోలీసుల బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనాల్లో పోలింగ్​ సెంటర్ల నుంచి మహబూబ్​నగర్​లోని పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్​ రూమ్​కు తరలించారు.

అమెరికా నుంచి వచ్చి ఓటేశారు

ఉప్పునుంతల, వెలుగు : లోక్‌‌సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రవాస భారతీయులు తరలివచ్చారు. ఉప్పునుంతల మండలం ఉప్పరిపల్లి గ్రామానికి చెందిన బొజ్జ అమరేందర్‌‌రెడ్డి, ఆయన భార్య అమెరికా నుంచి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. లక్షలు ఖర్చు చేసి, ఉద్యోగానికి సెలవు పెట్టి ఒక్క ఓటు కోసం వేల కిలోమీటర్లు వచ్చిన ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పలువురు పేర్కొన్నారు.