ఆ రెండు రాష్ట్రాలూ ట్రంప్ ఖాతాలోకే..

వాషింగ్టన్:  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చివరి రెండు రాష్ట్రాలు కూడా రిపబ్లికన్ నేత, కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో పడ్డాయి. ఇప్పటికే ఏడు స్వింగ్ స్టేట్స్ లో ఐదు రాష్ట్రాలను ట్రంప్ కైవసం చేసుకోగా.. తాజాగా మిగిలిన రెండు (అరిజోనా, నెవడా) రాష్ట్రాలూ ఆయనకే దక్కాయి. దీంతో ఈసారి స్వింగ్ స్టేట్స్ అన్నీ రిపబ్లికన్ల వశం అయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. తాజాగా అరిజోనాలో 11, నెవడాలో 6 ఎలక్టోరల్ ఓట్లు కలిపి మొత్తం 312 ఓట్లను ట్రంప్ కైవసం చేసుకున్నారు. 

మ్యాజిక్ ఫిగర్ (270) కంటే 42 సీట్లను అధికంగా గెలుచుకున్నారు. ఇక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ 226 ఓట్లకు పరిమితం అయ్యారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ మొత్తంగా 7,46,50,754 (50.5%) పాపులర్ ఓట్లు, కమలా హారిస్ 7,09,16,946 (48.0%) పాపులర్ ఓట్లు సాధించారు. అయితే, అరిజోనాను గత 2020 ఎన్నికల్లో బైడెన్ కైవసం చేసుకున్నారు. ఈసారి ట్రంప్ గెలవడంతో మళ్లీ ఈ స్టేట్ రిపబ్లికన్ల వశం అయినట్లయింది. కాగా, అధికార మార్పిడిపై చర్చించేందుకు వైట్ హౌస్​కు రావాలని ట్రంప్​ను బైడెన్​ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు ట్రంప్ వైట్ హౌస్ కు వెళ్లి బైడెన్ తో భేటీ కానున్నారు.

ఈసారి నిక్కీ, పాంపియోకు నో చాన్స్.. 

ఇండియన్ అమెరికన్ లీడర్ నిక్కీ హేలీ, విదేశాంగ శాఖ మాజీ మంత్రి మైక్ పాంపియోకు ఈసారి కూడా ట్రంప్ తన కేబినెట్ లో చాన్స్ ఇవ్వనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని, వారిని ఈసారి కేబినెట్ లోకి తీసుకోవడం లేదని ట్రంప్ శనివారం ‘ట్రూత్ సోషల్’ వేదికగా తేల్చిచెప్పారు. అయితే, తన ఫస్ట్ టర్మ్ లో వాళ్లిద్దరూ దేశానికి అద్భుతమైన సేవ చేశారని, అందుకుగాను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ట్రంప్ 2016లో మొదటిసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన కేబినెట్ లో మైక్ పాంపియో విదేశాంగ మంత్రిగా పని చేశారు. 

నిక్కీ హేలీ కేబినెట్ హోదా ఉన్న ‘ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారి’గా విధులు నిర్వర్తించారు. అయితే, ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎలక్షన్స్​లో ట్రంప్​పై నిక్కీ హేలీ పోటీ చేశారు. తర్వాత తప్పుకుని ట్రంప్​కు మద్దతిచ్చినా.. ఆయనపై విమర్శలు చేశారు. ఇక మైక్ పాంపియో కూడా గత జులైలో ఉక్రెయిన్​కు ఆయుధ సరఫరా పెంచాల్సిన అవసరం ఉందని ట్రంప్ క్యాంపెయిన్ ప్రకటనలకు విరుద్ధంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరినీ ట్రంప్ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.

సెనేట్, హౌస్​లో రెండుచోట్లా ఆధిక్యం.. 

తాజా ఎన్నికలతో సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ రెండింటిలోనూ రిపబ్లికన్లు ఆధిక్యంలోకి వచ్చారు. ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలకు ఎన్నికలు జరగగా.. రిపబ్లికన్ పార్టీ 213 సీట్లను, డెమోక్రటిక్ పార్టీ 202 సీట్లను గెలుచుకున్నాయి. ఇంకా 20 సీట్లలో కౌంటింగ్ కొనసాగుతుండగా.. చెరో పది సీట్లలో లీడింగ్ లో ఉన్నాయి. ఇక సెనేట్ లో 100 స్థానాలు ఉండగా, 34 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రిపబ్లికన్ పార్టీ 15 సీట్లను గెలుచుకోవడంతో ఇదివరకు ఉన్న సీట్లతో సెనేట్​లో మెజార్టీ మార్క్ (50)ను దాటింది.