రెండేండ్ల బాలుడి కిడ్నాప్ 16 గంటల్లో కాపాడిన పోలీసులు

  • పిల్లలు లేని దంపతులకు అమ్మేందుకే అపహరణ
  • మధ్యవర్తితో రూ.1.50 లక్షల 
  • డీల్ కుదుర్చుకున్న నిందితుడు  
  • సీసీ కెమెరాల ఆధారంగా పట్టివేత 

మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మంగళవారం రాత్రి రెండేండ్ల బాలుడు కిడ్నాప్​కాగా, పోలీసులు16 గంటల్లోనే పిల్లాడిని కిడ్నాపర్ ​చెర నుంచి విడిపించారు. ఎస్పీ అశోక్‌కుమార్‌‌ బుధవారం ఆ వివరాలు తెలియజేశారు. కోరుట్లకు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత కోసం బాలుడు కావాలని చూస్తున్నారు. ఈక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటకు చెందిన మహిళను సంప్రదించారు. ఆమె అదే గ్రామానికి చెందిన ఇస్లావత్‌ నగేశ్‌(34)కు చెప్పింది. ఎవరైనా బాబును తీసుకువస్తే రూ.1.50 లక్షలు ఇస్తానని చెప్పింది. దీంతో నగేశ్‌ నెల రోజులుగా పిల్లల కోసం వెతుకుతున్నాడు.

మెట్‌పల్లిలోని దుబ్బవాడలో భిక్షాటన చేస్తున్న రాజు, లక్ష్మి దంపతులకు అమ్ములు(6), శివప్రసాద్‌(2) పిల్లలు. నగేశ్‌ వారం రోజులుగా పిల్లల కదలికలపై నిఘా పెట్టాడు. మంగళవారం సాయంత్రం అమ్ములు తమ్ముడితో ఆడుకునేందుకు బయటకు వెళ్లగా నగేశ్‌ ముఖానికి మాస్క్‌ పెట్టుకొని బైక్‌పై వచ్చాడు. అమ్ములుకు రూ.20 ఇచ్చి చాక్లెట్‌ కొనుక్కోమని చెప్పి షాపుకు పంపించాడు. తర్వాత శివప్రసాద్‌ను బైక్‌పై ఎక్కించుకొని వెళ్లిపోయాడు.

ఇది చూసిన అమ్ములు బైక్‌ వెనకాల కొంతదూరం పరుగెత్తింది. బైక్‌ ఆగకపోవడంతో ఏడుచుకుంటూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పింది. వారు డయల్ 100కు ఫోన్​ చేసి పోలీసులు సమాచారమిచ్చారు. డీఎస్పీ ఉమామహేశ్వర్ రావు పర్యవేక్షణలో మెట్‌పల్లి సీఐ నిరంజన్ రెడ్డి, సీసీఎస్ సీఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఎస్సైలు చిరంజీవి, కిరణ్ కుమార్, అనిల్  ఆరు బృందాలుగా ఏర్పడి బాబు కోసం గాలించారు. సీసీ కెమెరాల ఆధారంగా మొదట నిందితుడిని గుర్తించారు. అతడి ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. 

ఆచూకీ చెప్తే పారితోషకం ఇస్తామని ప్రకటించడంతో అమక్కపేటకు చెందిన కొందరు నగేశ్​గా గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో నిందితుడు కదలికలను పసిగట్టారు. మంగళవారం రాత్రి అర్బన్ కాలనీలోని ఓ ఇంట్లో బాబును నగేశ్​ దాచిపెట్టాడు. బుధవారం ఉదయం 10 గంటలకు అమ్మక్కపేటలో బాబును మహిళకు అప్పగించేందుకు తీసుకువెళ్తుండగా వెంకట్రావుపేట శివారులో పట్టుకున్నారు. తర్వాత  బాలుడిని రక్షించారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించి తల్లికి అప్పగించారు. కిడ్నాప్ కేసును 16 గంటల్లో ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. నిందితుడు ఇస్లావత్‌ నగేశ్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడిపై గతంలో కేసులు ఉన్నట్లు తెలిపారు.