వందల ఏండ్లైనా... తుప్పు పట్టని ఇనుప స్తంభం?

ఏ ఇనుప వస్తువైనా కొన్నాళ్లకు తుప్పు పట్టడం సహజం. కానీ.. ఈ ఇనుప స్తంభం మాత్రం కొన్ని వందల ఏండ్ల నుంచి గాలి, తేమని తట్టుకుని చెక్కుచెదరలేదు. పైగా ఇది తీవ్రమైన ఉష్ణోగ్రతలు, కాలుష్యంతో సతమతమయ్యే ఢిల్లీలో ఉంది. అయినా.. దాని వయసు, పర్యావరణ ప్రతికూలతలను తట్టుకుని ఇప్పటికీ టూరిస్ట్ ఎట్రాక్షన్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తోంది. 

న్యూఢిల్లీలో యునెస్కో గుర్తింపు పొందిన కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లోపల13వ శతాబ్దం నాటి ఎన్నో కట్టడాలు ఉన్నాయి. వాటిలో ఈ స్తంభం ఒకటి. సిటీకి దక్షిణాన ఉన్న మెహ్రౌలీ జిల్లాలో ఉంది. కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌లోని క్వాత్–ఉల్–ఇస్లాం మసీదు ప్రాంగణంలోకి సందర్శకులు ఎంటర్ అవుతుంటే కాంప్లెక్స్ కంటే పాతదిగా కనిపించే 7.2 మీటర్ల ఎత్తు, ఆరు టన్నుల బరువున్న ఇనుప స్తంభం పలకరిస్తుంది. దీన్ని ఎప్పుడు తయారు చేశారు? ఎందుకు తుప్పు పట్టడం లేదు? అనే ప్రశ్నలకు సమాధానాలు రకరకాలుగా వినిపిస్తాయి. 

ఎందుకు తుప్పు పట్టలేదు

సాధారణంగా గాలి, తేమ తగిలిన ఇనుము లేదా ఇనుము కలిసిన లోహాలు కాలక్రమేణా ఆక్సీకరణం చెందుతాయి. లేదంటే ఈఫిల్ టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాగా ప్రత్యేకంగా పెయింట్స్ లాంటివి వేస్తూ... కాపాడుకుంటే ఏండ్ల పాటు తుప్పు పట్టకుండా ఉంటాయి. కానీ.. ఈ ఇనుప స్తంభం మాత్రం అలాంటి జాగ్రత్తలు ఏవీ తీసుకోకపోయినా ఏండ్ల నుంచి తప్పుపట్టడం లేదు. అందుకే ఈ స్తంభం ఎందుకు తుప్పు పట్టడంలేదో తెలుసుకునేందుకు 1912లో మనదేశంతోపాటు విదేశాల్లోని సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌లు దీనిపై రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ చేయడం మొదలుపెట్టారు. చాలామంది అందుకు కారణాలను తెలుసుకోలేకపోయారు. 2003లో కాన్పూర్‌‌‌‌‌‌‌‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్ ఈ మిస్టరీని ఛేదించారు. దీన్ని మామూలు ఇనుముతో కాకుండా రాట్‌‌‌‌‌‌‌‌ ఐరన్‌‌‌‌‌‌‌‌(ఇందులో కార్బన్ ఎక్కువగా ఉంటుంది)తో తయారుచేశారని తేల్చారు. ఈ ఇనుములో భాస్వరం చాలా ఎక్కువగా(సుమారు1శాతం) ఉంది. ఇప్పుడు తయారుచేస్తున్న ఇనుములా సల్ఫర్, మెగ్నీషియం అందులో లేవు. అంతేకాకుండా అప్పటి హస్తకళాకారులు దీన్ని తయారుచేయడానికి ‘ఫోర్జ్–వెల్డింగ్’ అనే టెక్నాలజీ వాడారు. అంటే ఇనుమును వేడి చేసి సుత్తితో కొట్టడం ఆ పద్ధతి. ఇప్పుడున్న ఆధునిక పద్ధతులతో ఇలాంటి ఇనుము తయారుచేయడం చాలా కష్టం. ఇన్ని ప్రత్యేకతలు ఉండడం వల్లే ఈ స్తంభానికి  శాశ్వత బలం వచ్చిందని ఆర్కియో–మెటలర్జిస్ట్ ఆర్.బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. ఈ స్తంభం మీద ‘మిసావైట్’ అనే ఒక లేయర్ ఉంది. ఇది ఇనుము, ఆక్సిజన్, హైడ్రోజన్ సమ్మేళనం. ఈ పలుచని పొర కూడా స్తంభాన్ని తుప్పు పట్టకుండా కాపాడుతోందని అంటారు. అందుకే ఈ స్తంభాన్ని ‘భారతదేశపు ప్రాచీన లోహశాస్త్ర గొప్పదనానికి సజీవ నిదర్శనం’ అని చెప్తుంటారు. 

ఫిరంగి గుండుని తట్టుకుని 

ఈ స్తంభాన్ని 18వ శతాబ్దంలో ఫిరంగులతో విచ్ఛిన్నం చేయాలని చూశారు. ఫిరంగి గుండు తాకినా అది చెక్కు చెదరలేదు. అందుకే ఈ స్తంభాన్ని నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ లాంటి సంస్థలు ఎంబ్లమ్‌‌‌‌‌‌‌‌గా వాడుతున్నాయి. 

గుప్తుల నాటిదా? 

ఈ స్తంభం13వ శతాబ్దానికి చెందిందని అందరూ చెప్తుంటారు. కానీ.. కొందరు మాత్రం ఇది గుప్తుల కాలం నాటిది అంటున్నారు. ఈ థియరీ ప్రకారం.. దీన్ని 4వ లేదా 5వ శతాబ్దంలో  రెండో చంద్రగుప్తుడు (ఇతనినే విక్రమాదిత్య అని కూడా పిలుస్తారు) వేయించాడు. మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని విదిషాకు దగ్గర్లో ఉదయగిరి గుహల్లోని వరాహ ఆలయం ఉంది. అందులో విష్ణు మూర్తి కొలువై ఉన్నాడు. ఆ ఆలయంలో విజయ స్మారక చిహ్నంగా ఈ స్తంభాన్ని నిర్మించారు. ఈ స్తంభం మీద ఒకప్పుడు గరుడ విగ్రహం ఉండేదట. 

లెక్కలేసే స్తంభం 

ఈ స్తంభం గురించి.. హెరిటేజ్‌‌‌‌‌‌‌‌ యాక్టివిస్ట్‌‌‌‌‌‌‌‌ విక్రమ్‌‌‌‌‌‌‌‌జిత్ సింగ్ రూప్‌‌‌‌‌‌‌‌రాయ్ కూడా ఒక సిద్ధాంతం ప్రతిపాదించాడు. దాని ప్రకారం.. రాజు విక్రమాదిత్య ఆస్థానంలోని ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త వరాహమిహిరుడు ఈ స్తంభాన్ని తయారు చేయించాడు. అతను రాసిన పుస్తకాల్లో ఒకటైన ‘సూర్య సిద్ధాంతం’లో ఎన్నో ఖగోళ విషయాలు, గ్రహణాల గురించి చెప్పాడు. అనేక ఖగోళ విషయాలను లెక్కించే పద్ధతులు ఈ గ్రంథంలో ఉన్నాయి. అయితే.. ఈ గణనలు చేసేందుకు ఆయన అప్పట్లో ఒక పొడవైన స్తంభాన్ని ఉపయోగించాడని నమ్ముతారు. అదే ఈ ఇనుప స్తంభం! ఆయన విదిషా నుండి మిహిరాపురి (ఇప్పుడు మెహ్రౌలీ)కి వలస వెళ్ళినప్పుడు అక్కడ ఒక అబ్జర్వేటరీని స్థాపించాడు. అక్కడే తన పరిశోధనలకు ఉపయోగపడుతుందని ఈ స్తంభాన్ని ఏర్పాటు చేయించాడు.
అయితే.. కొన్ని చారిత్రక రికార్డులు స్తంభం కుతుబ్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌లో ఉండడం వల్ల తోమర్ రాజవంశానికి చెందిన రాజా అనంగ్‌‌‌‌‌‌‌‌పాల్, ఇల్‌‌‌‌‌‌‌‌టుట్‌‌‌‌‌‌‌‌మిష్‌‌‌‌‌‌‌‌, కుతుబుద్దీన్ ఐబెక్‌‌‌‌‌‌‌‌లలో ఒకరు ఈ స్తంభాన్ని ఏర్పాటు చేశారని చెప్తున్నాయి. 

పృథ్వీరాజ్ చౌహాన్ ఆస్థానంలోని చహమనా రాజవంశంలో ఒకరైన చాంద్ బర్దాయి రాసిన “పృథ్వీరాజ్ రాసో” అనే పురాణ కవితలో కూడా ఇనుప స్తంభం గురించి గొప్పగా చెప్పారు. హిందూ పురాణాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. ఇది శేషనాగు గోరు సాయంతో భూమిని పట్టుకున్నాడు. ఆ గోరే ఈ స్తంభం అని బర్దాయి రాసిన రాసోలో చెప్పారు. పండితులు హెచ్చరించినా రాజా అనంగ్‌‌‌‌‌‌‌‌పాల్ ఈ గోరును పెకిలించాడు. అప్పుడు శేషనాగు నుంచి ఎర్రటి ద్రవం బయటికి వచ్చిందని, అది శేషనాగు రక్తంగా భావించినట్టు ఈ రాసోలో చెప్పారు. భూమి నాశనం అవుతుందనే భయంతో అనంగ్‌‌‌‌‌‌‌‌పాల్ వెంటనే దాన్ని రీఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్ చేయించాడు. 

కోరిక తీరుతుంది!

ఒక పురాణం ప్రకారం.. స్తంభానికి వెనుకభాగంలో నిలబడి చేతులతో దాన్ని చుట్టుకుని పట్టుకున్నప్పుడు వేళ్లు ఒకదానికొకటి తాకితే.. కోరిక నెరవేరుతుందని కొందరు నమ్ముతుంటారు. కానీ.. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్తంభాన్ని కాపాడేందుకు చుట్టూ కంచెను ఏర్పాటు చేసింది.