అమ్మ పూలు అమ్మి తిండి పెడుతుంటే.. అన్నం మానేసి ఐ ఫోన్ కొనిపించుకుంటాడా..!

చేతులు, కాళ్లు బాగానే ఉన్నాయి.. నిక్షేపంగా ఉన్నాడు.. అలాంటి కుర్రోడికి ఓ కోరిక పుట్టింది.. ఐఫోన్ కొనాలని.. అది కూడా ఉద్యోగం చేసి.. కష్టపడి పని చేసి సంపాదించిన సొమ్ముతో కాదు.. ఇంట్లో వాళ్లు ఇచ్చే డబ్బుతో జల్సాగా ఐఫోన్ తో తిరగాలని.. ఇదే విషయాన్ని ఇంట్లో తల్లికి చెబితే.. ఐఫోన్ లేదు ఏమీ లేదు అని చెప్పింది.. ఎందుకో తెలుసా.. ఆ తల్లి కష్టపడితేనే ఈ కుర్రోడి కడుపు నిండేది.. అవును.. ఆ తల్లి ఊరిలోని ఓ గుడి బయట పూల అమ్ముతూ ఉంటుంది.

అలాంటి తల్లి పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఐఫోన్ కొనివ్వాలని రాచిరంపాన పెట్టాడు ఆ కొడుకు. ఐ ఫోన్ కోసం.. మూడు రోజులు అన్నం తినలేదు.. పచ్చి మంచినీళ్లు ముట్టలేదంట.. కొడుకు నిరాహార దీక్షతో.. అప్పు చేసి మరీ ఆ తల్లి.. ఐ ఫోన్ కొనిచ్చింది.. చేతిలో డబ్బులతో మొబైల్ షోరూంలో కనిపించిన ఆ కుర్రాడిని ఓ యూట్యూబర్ చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయినట్లు.. ఈ వీడియోపై విపరీతమైన ఆగ్రహంతో కూడిన తిట్లను తిడుతున్నారు నెటిజన్లు.

 

నిక్షేపంగా ఉన్న ఆ కుర్రోడు చదువు కోసం.. ఉద్యోగం కోసం.. కోచింగ్ కోసం.. వ్యాపారం కోసం ఇలా దీక్ష చేసి డబ్బులు తీసుకుంటే పర్వాలేదు కానీ.. ఐ ఫోన్ కోసం అన్నం మానేసి సాధించుకుంటావా అంటూ తిట్టిపోస్తున్నారు.. ఈ వయస్సులో పూలు అమ్మి వచ్చిన డబ్బులతో తల్లి పోషిస్తుంటే.. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఐ ఫోన్ కోసం వేధించి.. సాధించిన ఆ కుర్రోడి ఆలోచన క్రూరంగా ఉందంటూ మరికొంత మంది నెటిజన్లు తిట్టిపోశారు.

కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రులు పడే కష్టం.. చేస్తున్న పని.. వచ్చే సంపాదనపై ఏ మాత్రం అవగాహన లేకుండా పెరుగుతున్న ఇలాంటి కొడుకు భవిష్యత్లో ఏం బాగుపడతాడు అంటూ మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వీడియో తీసిన ఆ యూట్యూబర్నూ వదల్లేదు.. ఇలాంటి వీడియో వల్ల ఈ సమాజానికి వచ్చే ప్రయోజనం ఏంటీ.. ఇలాంటి పనికిమాలిన వీడియో చూసి.. మరికొంత మంది ఇలా తయారు అవుతారు కదా.. ఇలాంటి వాటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటూ యూట్యూబర్ను సైతం ఆడేసుకున్నారు నెటిజన్లు.