ఇజ్రాయెల్ ప్రధాని.. నెతన్యాహుకి ఐసీసీ అరెస్టు వారంట్

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్  ప్రధాని బెంజమిన్  నెతన్యాహుకు ఇంటర్నేషనల్  క్రిమినల్  కోర్టు (ఐసీసీ) గురువారం అరెస్టు వారంట్  జారీ చేసింది. నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్  రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్  గాల్లాంట్, హమాస్  లీడర్  ఇబ్రహీం అల్ మస్రీకీ అరెస్టు వారంట్  జారీ చేసింది. ఆ ముగ్గురూ యుద్ధ నేరాలకు పాల్పడి అమాయకుల ప్రాణాలను బలిగొన్నారని పేర్కొంటూ ఐసీసీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘​నెతన్యాహు, గాల్లాంట్, ఇబ్రహీం అల్  మస్రీ నిరుడు అక్టోబరు 8 నుంచి ఈ ఏడాది  మే వరకు యుద్ధ నేరాలకు పాల్పడ్డారు. 

వాస్తవానికి అరెస్టు వారంట్ ను రహస్యంగా ఉంచాలనుకున్నాం. కానీ, యుద్ధ బాధితులకు ఈ విషయం తెలిసేందుకు వారంట్  ప్రకటనను బహిర్గతం చేశాం” అని ఐసీసీ పేర్కొంది. కాగా.. తమ దేశ నేతలకు ఐసీసీ జారీచేసిన అరెస్టు వారంట్​లను ఇజ్రాయెల్  ఖండించింది. ఆ వారంట్లు అసంబద్ధం, సిగ్గుచేటని మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ మండిపడ్డారు. మరోవైపు, అల్ మస్రీని అలియాస్  మొహమ్మద్  డీఫ్​ను ఇటీవలే ఎయిర్ స్ట్రైక్ లో చంపేశామని ఇజ్రాయెల్  తెలిపింది. అయితే, మస్రీ మరణాన్ని హమాస్  ఖండించనూ లేదు, ధ్రువపరచనూ లేదు.

గాజా స్ట్రిప్ లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కారణంగా ఇప్పటివరకు 44 వేల మందికిపైగా చనిపోయారని గాజా వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. అలాగే, 1,04,268 మంది గాయపడ్డారని తెలిపారు. వాస్తవానికి మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని, నేలమట్టమైన బిల్డింగ్ ల కింద చాలా మృతదేహాలు ఉండిపోయాయని చెప్పారు. ఇలా చనిపోయిన వారు వేల సంఖ్యలో ఉండవచ్చన్నారు. అయితే, తాము 17 వేల మంది మిలిటెంట్లను చంపామని ఇజ్రాయెల్ పేర్కొంది. కాగా, గాజాలో సత్వరమే బేషరతుగా కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ఐక్యరాజ్య సమితి 

భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. ఇప్పటివరకూ హమాస్ చెరలో ఉన్నవారిని విడుదల చేయలేదని, ఈ నేపథ్యంలో మండలి తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని అమెరికా పేర్కొంది.