కామారెడ్డి జిల్లాలో ప్రాజెక్టులకు జలకళ

  • దంచి కొడుతున్న వానలు 
  • పొంగి పోర్లుతున్న సింగీతం రిజర్వాయర్​
  • పోచారం ప్రాజెక్టులోకి పెరిగిన వరద 

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో వారం పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లో ఇన్ ప్లో పెరిగింది. కాగా మంగళవారం రాత్రి కూడా జిల్లాలోని పలు ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. సీజన్ ఆరంభం నుంచి ఆశించిన వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందగా.. వారం పదిరోజులుగా కురుస్తున్న వానలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో జిల్లాలో వరినాట్లు జోరందుకున్నాయి. పోచారం ప్రాజెక్టుతో పాటు, నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ప్లో పెరిగింది. సింగీతం రిజర్వాయర్ తో పాటు లింగంపేట మండలాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. 

నిండుకుండలా సింగీతం రిజర్వాయర్

నిజాంసాగర్​ మండలంలోని సింగీతం రిజర్వాయర్​నిండుకుండలా కనిపిస్తుంది. అలుగు పొంగి ప్రవహిస్తోంది. వాటర్​ లెవల్ 416.550‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటర్లు కాగా పూర్తిగా నిండింది. ఎగువ నుంచి 2700  క్యూసెక్కుల ఇన్​ప్లో వస్తుంది. రిజర్వాయర్​ కంప్లీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిండటంతో  2 వేల క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్​ ప్రాజెక్టు మెయిన్ కెనాల్ కు మళ్లించారు. 700 క్యూసెక్కుల వరద నీరు అలుగు పారుతోంది. కళ్యాణి ప్రాజెక్టు (నిజాంసాగర్ ప్రాజెక్టు మెయిన్ కెనాల్ డైవర్షన్​స్కీమ్)  కంప్లీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిండింది. వాటర్​లెవల్ 409.50 మీటర్లకు గాను 407.00 మీటర్లు ఉంది. 

పోచారం ప్రాజెక్టుకు పెరిగిన వరద 

నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టుకు వరద పెరిగింది.  మంగళవారం రాత్రి గాంధారి, లింగంపేట మండలాల్లో కురిసిన పెద్ద వానలకు వాగులు ప్రవహిస్తున్నాయి. ఈ రెండు మండలాల నుంచి వచ్చే పెద్ద వాగు నీళ్లు పోచారం ప్రాజెక్టులోకి చేరతాయి. బుధవారం ప్రాజెక్టు ఇన్​ఫ్లో  1,881 క్యూసెక్కులు ఉంది.   కెఫాసిటీ  1.820 టీఎంసీలకు గాను ప్రస్తుతం   0.840 టీఎంసీలకు చేరింది.  నీటి మట్టం 1,464 పీట్లకు గాను 1,457కు చేరింది.  నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 17.802  టీఎంసీలకు గాను ప్రస్తుతం 3.847 టీఎంసీలకు చేరింది.  వారం రోజుల క్రితం 3.205 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 3.847 టీఎంసీలకు పెరిగింది. 

దంచికొట్టిన వాన

జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి వాన దంచికొట్టింది.  భారీగా కురిసన వానతో పలు చోట్ల వాగుల్లో నీరు ప్రవహిస్తోంది.  నస్రుల్లాబాద్​ మండలంలో  77.6 మి.మీ., గాంధారిలో 63.3 మి.మీ., సదాశివనగర్​లో 61.8 మి.మీ., రామారెడ్డిలో  50.8 మి.మీ., బాన్సువాడలో  42.7 మి.మీ, బీర్కుర్​లో 39.6 మి.మీ.,  మద్నూర్​లో 20.3 మి.మీ. బిచ్కుందలో 19.7 మి.మీ,  కామారెడ్డిలో 19.4 మి.మీ,  పాల్వంచలో 1 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మి.మీ, వర్షపాతం నమోదైంది.