రెండో దశ మెట్రోకు ఖర్చు తక్కువే!..చెన్నై, బెంగళూరుతో పోలిస్తే  అతి తక్కువ వ్యయం

  •     24 వేల కోట్ల అంచనా వ్యయంతో 76 కి.మీ.నిర్మాణం
  •     ఒక్క కిలోమీటర్​కు రూ. 318 కోట్లు మాత్రమే ఖర్చు 
  •     మిగతా నగరాల్లో  రూ.373 నుంచి 1492 కోట్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హైదరాబాద్​మెట్రో రైల్​ఫేజ్–2  తక్కువ ఖర్చుతోనే నిర్మాణం కానుంది. బెంగళూరు, చెన్నై, ముంబై సిటీల్లో కిలోమీటర్​నిర్మాణానికి రూ. 373 కోట్ల నుంచి 1492 కోట్ల వరకూ ఖర్చవుతుండగా, హైదరాబాద్ మెట్రోసెకండ్ ఫేజ్​మాత్రం కిలోమీటర్​కు రూ.318 కోట్లు మాత్రమే ఖర్చవుతోంది. పబ్లిక్​ట్రాన్స్​పోర్టులో మెట్రో అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సెకండ్​ఫేజ్​ను విస్తరించాలని నిర్ణయించి, ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది.

ప్రస్తుతం ఫేజ్–2లోని ఐదు కారిడార్లకు సంబంధించి డీపీఆర్​లను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపి, కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. అయితే, డీపీఆర్​ల ఆమోదంతో సంబంధం లేకుండా ఓల్డ్​సీటీ మెట్రోపనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే జనవరి నాటికి భూసేకరణ పూర్తి చేసి, నిర్మాణ పనులు ప్రారంభించేలా మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

ఫస్ట్ ఫేజ్​తో పోల్చినా.. తక్కువే 

పీపీపీ విధానంలో నిర్మించిన మెట్రో ఫేజ్–1తో పోలిస్తే మెట్రో ఫేజ్– 2  నిర్మాణ ఖర్చు కూడా చాలా తక్కువ. ఫేజ్–1 లో 69 కిలోమీటర్ల దూరాన్ని 57 మెట్రో స్టేషన్లతో నిర్మించారు. దీనికి గాను రూ. 22,148 కోట్లు ఖర్చు పెట్టారు. ఇదంతా కూడా ఎలివేటెడ్​కారిడార్​నిర్మాణమే. కిలోమీటర్​నిర్మాణానికి రూ.388 కోట్లు ఖర్చు చేశారు. రెండో ఫేజ్​లో 76.4 కిలోమీటర్ల దూరాన్ని 54 మెట్రో స్టేషన్లతో రూ. 24,267 కోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మించనున్నారు. కిలోమీటర్​కు రూ. 318 కోట్లు మాత్రమే ఖర్చు కానుంది. పీపీపీ పద్ధతిలో నిర్మించిన ఫేజ్–1 ప్రాజెక్టు కోసం ఇండియన్​బ్యాంకుల నుంచి పది శాతం వడ్డీకి రుణాలు తెచ్చారు.

దీంతో మెట్రోపై ఆర్థిక భారం పడింది. ఫేజ్–2 కోసం కేంద్ర ప్రభుత్వం 18 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం, పీపీపీ పద్ధతి ద్వారా 4 శాతం నిధులు సేకరించన్నారు. మరో 48 శాతాన్ని ఇంటర్నేషనల్ బ్యాంకుల నుంచి 2 శాతం వడ్డీకి కేంద్ర ప్రభుత్వ సావరిన్​గ్యారెంటీతో తీసుకురానున్నారు. ఫేజ్–1లో మియాపూర్, నాగోల్​లో మెట్రో డిపోలను నిర్మించగా, ఆ డిపోలనే వినియోగించాలని మెట్రో అధికారులు యోచిస్తున్నారు. విస్తరణ నేపథ్యంలో మరో రెండు డిపోలను ప్రభుత్వ భూముల్లోనే ఏర్పాటు చేసి, అర్థిక భారాన్ని తగ్గించుకునేలా కసరత్తు చేస్తున్నారు.

ఇతర సిటీల మెట్రోలతో పోలిస్తే తక్కువే..

ముంబై మెట్రోకు కిలోమీటర్​నిర్మాణానికి రూ. 543 కోట్ల నుంచి 1492 కోట్లు ఖర్చవుతుండగా, చెన్నై మెట్రోకు కిలోమీటర్​కు రూ. 619 నుంచి 750 కోట్లు, బెంగళూరు మెట్రోకు కిలోమీటర్​కు రూ. 373 నుంచి రూ. 569 కోట్లు ఖర్చవుతున్నది. ఆ సిటీల్లో మెట్రో ఎక్కువగా అండర్​గ్రౌండ్ నుంచి వెళ్లడం, భూసేకరణ ఇబ్బందులతో నిర్మాణ అంచనా వ్యయం పెరిగింది.

హైదరాబాద్ మెట్రోకు సంబంధించి శంషాబాద్ ఎయిర్ పోర్టు మార్గంలో 1.5 కిలోమీటర్​దూరం అండర్​ గ్రౌండ్ నుంచి వెళ్తోంది. మియాపూర్–పఠాన్​చెరు కారిడార్​లో 1.5 కిలోమీటర్​దూరం డబుల్​డెక్కర్​నిర్మాణం చేయనున్నారు. మిగిలినదంతా ఎలివేటెడ్​కారిడార్​నిర్మాణం కావడంతో నిర్మాణం వ్యయం తక్కువ కానున్నది.