మైనారిటీలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి ఇండియా సూచన

న్యూఢిల్లీ, ఢాకా: బంగ్లాదేశ్​లోని మైనారిటీలు అందరినీ తప్పకుండా కాపాడాల్సిన బాధ్యత అక్కడి మధ్యంతర ప్రభుత్వానికి ఉందని భారత ప్రభుత్వం పేర్కొంది. బంగ్లాలో పెరుగుతున్న హింసాత్మక ఘటనలు, మతపరమైన తీవ్రవాద కార్యకలాపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. శుక్రవారం ఢిల్లీలో ఇండియా విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్​ జైస్వాల్​మీడియాతో మాట్లాడుతూ హిందువులు, ఇతర మైనారిటీలు టార్గెట్​గా బంగ్లాదేశ్​లో జరుగుతున్న దాడులను ప్రస్తావించారు. ‘‘మైనారిటీలందరిని రక్షించే బాధ్యతను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నిర్వర్తించాలి. ఈ విషయంలో మా వైఖరి చాలా క్లియర్​గా ఉంది. మతపరమైన టెర్రరిజం విజృంభించడం, పెరుగుతున్న హింస, రెచ్చగొట్టే ఘటనలపై మేం ఆందోళన చెందుతునం. 

ఈ పరిణామాలను మీడియాలో జరిగే ప్రచారంగా ఎంత మాత్రం కొట్టిపారేయలేం. మైనారిటీల రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్​కు పిలుపునిస్తున్నం” అని అన్నారు. ఇస్కాన్ ప్రచారకుడు చిన్మయ కృష్ణ దాస్‌‌ అరెస్టు వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నామని, లీగల్ ప్రాసెస్ పారదర్శకంగా జరుగుతుందని భావిస్తున్నట్లు జైస్వాల్ చెప్పారు. కాగా, ఇటీవల అరెస్టు చేసిన చిన్మయ కృష్ణ దాస్‌‌ సహా 17 మంది హిందూ మత పెద్దల బ్యాంకు ఖాతాలను 30 రోజుల పాటు ఫ్రీజ్ చేయాలంటూ బంగ్లా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.