- తర్వాతి స్థానాల్లో భద్రాచలం, యాదగిరిగుట్ట
- అన్ని ఆలయాల్లో 1,048 కిలోల బంగారం, 38,783 కిలోల సిల్వర్ ఆలయాల బంగారం
- లెక్క వెల్లడించిన ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఆలయాల బంగారం లెక్కతేలింది. ఆలయాలన్నింటిలో ఎములవాడ రాజన్న ఆలయానికి ఎక్కువ గోల్డ్ సమకూరింది. 97 కిలోల బంగారంతో రాజన్న ఆలయం టాప్‌లో ఉండగా.. తర్వాతి స్థానాల్లో భద్రాచలం (67 కిలోలు), యాదగిరిగుట్ట (61 కిలోలు) ఆలయాలు ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ఆలయాల వద్ద మొత్తంగా 1,048 కేజీల బంగారం ఉన్నట్టు ఎండోమెంట్ అధికారులు లెక్క తేల్చారు. కాగా, భక్తులు కానుకల రూపంలో సమర్పించే బంగారాన్ని మాత్రమే ప్రభుత్వ అనుమతి మేరకు కరిగించే అవకాశం ఉంది.
అది కూడా ఆలయాల అవసరాల మేరకు, త్రిసభ్య కమిటీ ఆమోదం ఉంటేనే కరిగించాలనే నిబంధన ఉన్నది. స్వామి, అమ్మవార్లకు సంబంధించిన నగలు, హారాలు, కిరీటాలు, చారిత్రాత్మక సంపద ఇలాంటి వాటిని ముట్టుకోవద్దు. ఇప్పటివరకు యాదగిరిగుట్ట ఆలయ స్వర్ణ గోపురానికి, మహంకాళి టెంపుల్లో బంగారు బోనానికి సంబంధించి కానుకల రూపంలో వచ్చిన బంగారాన్ని మాత్రమే కరిగించేందుకు త్రిసభ్య కమిటీ ఆమోదం తెలిపింది. మిగిలిన ఏ ఆలయానికి బంగారం కరిగించేందుకు అనుమతి ఇవ్వలేదని అధికారులు పేర్కొన్నారు.
ఆలయాల గోల్డ్, సిల్వర్ లెక్క ఇదే..
తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల్లో 704 ఆలయాలు ఉండగా.. ఆదాయాన్ని బట్టి ఆలయాలను రీజినల్ జాయింట్ కమిషనర్(ఆర్జేసీ), జిల్లా కమిషనర్(డీసీ), అసిస్టెంట్ కమిషనర్(ఏసీ)లకు బాధ్యతలు అప్పగించింది. ఆర్జేసీలు ఉన్న ఆలయాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేమువాలవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం, యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. డీసీ కేడర్‌లో బాసర సరస్వతీ ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి, కొమరవెల్లి మల్లికార్జునస్వామి, సికింద్రాబాద్ లోని గణేశ్ టెంపుల్స్ ఉండగా.. ఏసీ కేడర్‌లో 13 ఆలయాలు ఉన్నాయి. మిగిలిన టెంపుల్స్ 6(ఏ), (బీ), (సీ), (డీ) కేటగిరీ పరిధిలో ఉంటాయి. వీటన్నింటి కంటే వేములవాడ రాజన్నకు ఎక్కువ బంగారం సమకూరినట్టు అధికారులు వెల్లడించారు. 2023 మార్చి ఆర్థిక సంవత్సరంలో దేవాదాయ శాఖకు అందిన సమాచారం మేరకు.. రాజన్న ఆలయం వద్ద 97 కిలోల బంగారం, భద్రాచలం ఆలయం వద్ద 67 కిలోలు, యాదగిరి గుట్ట ఆలయం వద్ద 61 కిలోలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
కాగా, ఆర్జేసీ కేడర్ లోని 3 ఆలయాల్లో 226 కిలోల గోల్డ్, డీసీ కేడర్ లో ఉన్న 4 ఆలయాల్లో 53 కిలోలు, ఏసీ కేడర్ లోని 13 ఆలయాల్లో 91 కిలోలు, 6 (ఏ), (బీ), (సీ), (డీ) కేటగిరీ పరిధిలో 453 కిలోల బంగారం ఉన్నది. రాజన్న ఆలయం వద్ద వెండి 4,930 కిలోలు, యాదగిరి గుట్ట ఆలయం వద్ద 2,312 కిలోలు, భద్రాచలం ఆలయం వద్ద 980 కిలోలు ఉన్నది. ఆర్జేసీ కేడర్ లోని 3 ఆలయాల వద్ద 8,224 కిలోల వెండి, డీసీ కేడర్ లో ఉన్న 4 ఆలయాల్లో 3,331 కిలోలు, ఏసీ కేడర్ లో ఉన్న 13 ఆలయాల్లో 4,415 కిలోల సిల్వర్, 6(ఏ), (బీ), (సీ), (డీ) కేటగిరీ పరిధిలో 22,811 కిలోల వెండి ఉంది. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో కలిపి మొత్తంగా 38,783 కిలోల వెండి ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
త్రిసభ్య కమిటీ ఆమోదిస్తేనే..
ఆలయాల అవసరం మేరకే బంగారం కరిగించే చాన్స్ ఉన్నది. ఏ ఆలయానికి సంబంధించిన బంగారం ఆ ఆలయం పరిధిలో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆలయాలకు సంబంధించిన గోల్డ్, వెండిని ఎస్బీఐలో భద్రపరుస్తారన్నారు. ఆ గోల్డ్ కరిగించాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఆలయం అవసరాలకు గోల్డ్ కరిగిస్తామని త్రిసభ్య కమిటీకి ప్రతిపాదనలు పంపించాలి. ఆ కమిటీ అనుమతి ఇస్తేనే కరిగించాల్సి ఉంటుంది. ఇందులో భక్తులు సమర్పించే కానుకలను మాత్రమే కరిగిస్తారు. బంగారు ఆభరణాలు, కిరీటాలు, చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్నవాటి జోలికి వెళ్లరు. ఇప్పటి వరకూ ఏ ఆలయానికి సంబంధించిన గోల్డ్ ఆభరణాలు కరిగించలేదు. ఇటీవల యాదగిరి గుట్ట ఆలయ విమాన గోపురం తాపడం పనుల కోసం భక్తులు సమర్పించిన 61 కిలోల బంగారాన్ని కరిగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
బంగారు బోనం కోసం మహంకాళి టెంపుల్ ఆలయం వద్ద ఉన్న బంగారాన్ని ప్రభుత్వ అనుమతితో కరిగించారు. వేములవాడ ఆలయానికి సంబంధించిన గోల్డ్‌ను కరిగించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, ఇంకా అనుమతి రాలేదని సమాచారం. ఏడుపాయలలో ఉన్న దుర్గాదేవి అమ్మవారి ఆలయ బంగారాన్ని గతంలో ఆలయ ఈవో కరిగించడంతో వివాదం తలెత్తింది. దీంతో ఆలయానికి భక్తులు సమర్పించిన బంగారు కానుకలను కరిగించేందుకు త్రిసభ్య కమిటీ వేసి, వారి పర్యవేక్షణలో కరిగించేలా పకడ్బందీగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఆలయాల అభివృద్ధి సమయంలో దేవతామూర్తులకు ఆభరణాలు చేయించాలనుకున్నప్పుడు కమిటీ అనుమతితో మాత్రమే ముందుకు వెళ్తున్నారు.