బీఆర్ఎస్ ​హయాంలో సంక్షేమం పక్కదారి!..70వేల కోట్లు మళ్లింపు

  • 70వేల కోట్లు మళ్లింపు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు  భారీ మోసం
  • బడ్జెట్​ కేటాయింపుల్లో సగం  దాటని ఖర్చు
  • పదేండ్లలో రూ.1.50 లక్షల కోట్లు కేటాయించి..
  • ఖర్చు చేసింది 79 వేల కోట్లు మాత్రమే
  • అటకెక్కిన బీసీలకు సబ్సిడీ లోన్లు, దళితబంధు 
  • పేరుకే ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్.. 
  • క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రయోజనం లేదు
  • గత సర్కారు లెక్కలు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ హయాంలో సంక్షేమం దారి మళ్లింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించి, వారికి భారీ మోసం చేసింది. ఈ వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్ లో భారీ కేటాయింపులు చూపినప్పటికీ.. ఖర్చు మాత్రం 50 శాతం మించలేదు. అందులోనూ సంక్షేమ పథకాల కంటే.. వాటి  నిర్వహణ ఖర్చులే ఎక్కువగా ఉన్నాయి.  పదేండ్ల పాలనలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఇదే రిపీట్​అవుతూ వచ్చింది. ఫలితంగా ఆయా సంక్షేమ శాఖల కింద అమలవుతున్న పథకాలు అటకెక్కాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో లక్షల మంది అర్హులు లబ్ధిదారులు కాకుండాపోయారు. ఆర్భాటంగా ప్రకటించిన దళితబంధు సైతం అదే దారిలో వెళ్లింది.  రెండేండ్లలో దాదాపు 35 వేల కోట్ల మేర కేటాయింపులు చేసినట్లు పద్దుల్లో చూపినప్పటికీ.. చిల్లిగవ్వ కూడా రిలీజ్​ చేయలేదు.

 దీంతో ఈ మొత్తం ఫండ్స్​ కూడా నిర్వీర్యం అయిపోయాయి. దళితబంధుతోపాటు బీసీ సంక్షేమంలో సబ్సిడీ లోన్లు, ఎస్టీల వృద్ధి కోసం చేపట్టిన పథకాలు నిలిచిపోయాయి. అరకొరగాకొందరికి శాంక్షన్లు ఇచ్చినా.. వారికి సబ్సిడీలు పెండింగ్​లో పెట్టింది. పైగా ఎన్నికల ఏడాది 2023లో బీసీలకు రూ.లక్ష సాయం, దళితబంధు కోసం పేర్లు రాసుకుని వదిలేశారు. ఇప్పుడు ఇదే సంక్షేమ శాఖల్లో  మొన్న బడ్జెట్​లో చేసిన కేటాయింపులపై బీఆర్ఎస్​ పెద్దలు విమర్శలు చేస్తుండడంతో .. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పాత లెక్కలన్నీ తీయిస్తున్నది. ఈ సందర్భంగా అధికారులు సైతం అప్పుడు చేసిన ఖర్చులపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ స్పెషల్​ డెవలప్​మెంట్​ఫండ్స్​అయితే లెక్కా పత్రం లేకుండాపోయాయి.  2021–22 వరకు రూ.5.23 లక్షల కోట్లు కేటాయింపులు చూపిస్తే.. రూ.1.20 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్టు తేలింది. 


బీఆర్ఎస్​ సర్కారు హయాంలో ఎస్సీ, ఎస్టీ,  బీసీ, మైనార్టీ సంక్షేమానికి బడ్జెట్​లో కేటాయించిన నిధులు.. వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తం వివరాలు పరిశీలిస్తే అసలు సంగతి అర్థమవుతుంది. సంక్షేమంపై చేసిన ఖర్చు వివరాలు చూస్తే  3 వెల్ఫేర్ డిపార్ట్​మెంట్లలో దేంట్లోనూ ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.5 వేల కోట్లు దాటి ఖర్చు పెట్టలేదు. ఒక్క ఏడాది  మాత్రమే 2021–22లో  అది కూడా దళిత బంధు కొంతమేర అమలు చేసినందుకు ఎస్సీ వెల్ఫేర్ ఏడాది ఖర్చు మొత్తం కాస్త పెరిగినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. 2014–15 నుంచి 2023–24 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్​కు మొత్తం రూ.1,50,186 కోట్ల మేర బడ్జెట్ కేటాయింపులు చేసింది. అయితే ఇందులో రిలీజ్​చేసిన నిధులు సగం మాత్రమే. మొత్తం రూ.79 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంటే ప్రతి ఏడాది యావరేజ్​గా మూడు సంక్షేమ డిపార్ట్​మెంట్లలో రూ.8 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 

ఎక్కువ శాతం ఉన్న బీసీలను పట్టించుకోలే

రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న బీసీలకు గత బీఆర్ఎస్​సర్కార్​ ఏటా బడ్జెట్​లో చేస్తున్న కేటాయింపులు 4 శాతం మించలేదు. ఇక కేటాయించిన మొత్తంలో ఖర్చు చేసింది 3 శాతమే కావడం గమనార్హం. తెలంగాణ వచ్చినప్పటినుంచి 2023–24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 10 బడ్జెట్​లలో బీసీ సంక్షేమానికి మొత్తంగా రూ.44,091 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలో ఖర్చు చేసింది రూ.27 వేల  కోట్లు మాత్రమే. అంటే దాదాపు 17 వేల కోట్ల రూపాయలు కోతపెట్టింది. బీసీలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోలేదు. ఆర్థిక స్వావలంబన కోసం అమలు చేయాల్సిన సబ్సిడీ స్కీమ్స్​ అటకెక్కాయి. కల్యాణ లక్ష్మి, ఫీజు రీయింబర్స్​మెంట్​కు తూతూమంత్రంగా నిధులు విడుదల చేసి, చేతులు దులుపుకున్నది. దీంతో కల్యాణలక్ష్మి చెక్కులకు కనీసం ఏడాది.. స్కాలర్​షిప్​ల కోసం రెండు మూడేండ్ల పాటు నిధులు పెండింగ్​లో పడ్డాయి.   ప్రత్యేక స్కీమ్స్​ అటుంచి.. కనీసం ఉన్నవాటిని కూడా అమలు చేయలేదు.  కేవలం ఒకటి, రెండు పథకాలకే పరిమితమైపోయింది.

దళిత, గిరిజన సంక్షేమం ఉత్తిమాటే 

దళితుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం పెద్దగా ఖర్చు చేసిందేమి లేదని లెక్కల్లో స్పష్టమవుతున్నది. దళితబంధు అని ప్రకటించినా.. ఆ స్కీమ్​ను ఆదిలోనే అటకెక్కించారు. ఇక  మూడెకరాల భూమి, సబ్సిడీ లోన్లు, డెవలప్​మెంట్ నిధులు, కొలువులు.. ఇట్లా గత బీఆర్ఎస్​ సర్కార్​ పెద్దలు ఇచ్చిన హామీలన్నీ అమలు కాకుండానే నిధులు నిర్వీర్యం అయిపోయాయి.   స్కీమ్స్​ ప్రకటించడం, బడ్జెట్​లో నిధులు కేటాయించడం తప్ప.. ఫండ్స్​రిలీజ్​చేసి వాటిని అమలు చేయలేదని ప్రస్తుత ప్రభుత్వం తీస్తున్న లెక్కల్లో తేలింది.  ఇంటర్ క్యాస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యారేజ్‌‌‌‌‌‌‌‌ఇన్సెంటివ్స్‌‌‌‌‌‌‌‌ కూడా ఇవ్వలేదని గుర్తించారు. 2014–15 నుంచి 2023–24 వరకు బడ్జెట్​లో ఎస్సీ  డెవలప్​మెంట్ కింద రూ.76,677 కోట్లు కేటాయించారు. ఇందులో ఖర్చు చేసిన మొత్తం రూ.33,060 కోట్లు మాత్రమే. ఎస్టీ సంక్షేమానికి గత ప్రభుత్వం చేసిన ఖర్చు నామమాత్రంగా ఉన్నది. ప్రతి ఏటా యావరేజ్ ఖర్చు రూ.2 వేల కోట్లు దాటలేదు . ఎస్టీలకు గడిచిన పదేండ్లలో  రూ.29,418 కోట్లు కేటాయించారు. ఖర్చు మాత్రం రూ.18 వేల కోట్లు  మాత్రమే చేశారు. ఎస్టీ నివాస ప్రాంతాల్లో గృహ అవసరాలకు నెలకు వంద యూనిట్ల కరెంట్​ను ఉచితంగా ఇస్తామని ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు చేయలేదు. గిరిజన బంధు ఇస్తామని చెప్పి వదిలేశారు.  ఎస్టీ వెల్ఫేర్​లో డ్రైవర్ ఎంపవర్​మెంట్ స్కీమ్​ను పక్కకుపెట్టారు. ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్​నూ పట్టించుకోలేదు.  తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడమే తప్ప వాటికి కనీస సౌలతులను కల్పించలేదు.