న్యూ ఢిల్లీ: సిరియాలో అంతర్యుద్ధం తీవ్రరూపం దాలుస్తున్నది. ప్రెసిడెంట్ బషర్అల్అసద్కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్న అక్కడి వేర్పాటువాదులు, తిరుగుబాటుదారులు (రెబెల్స్) తాజాగా రాజధాని డమాస్కస్‌కు 20 కిలోమీటర్ల దూరానికి చేరుకున్నారు. శనివారం రెబెల్స్ దారా సిటీని ఆక్రమించుకున్నట్టు వెల్లడించారు. ‘‘మేం డమాస్కస్దక్షిణ గేట్‌కు 20 కిలోమీటర్ల దూరంలోపే ఉన్నాం.” అని రెబెల్ కమాండర్హస్సన్అబ్దెల్ ఘనీ ప్రకటించారు.
దశాబ్దకాలంపాటు అంతర్యుద్ధంతో తల్లడిల్లిన సిరియాలో.. గత కొంతకాలంగా పరిస్థితి సాధారణంగానే ఉన్నది. అయితే, తాజాగా రెబెల్స్ మళ్లీ రెచ్చిపోయారు. ఒకప్పటి అల్‌ఖైదా అనుబంధ సంస్థ హయాత్ తహ్‌రీర్ అల్- షమ్ తిరుగుబాటు జెండా ఎగురవేసింది. అలాగే, టర్కీ మద్దతుతో మిలీషియా గ్రూపులు, ఇస్లామిస్ట్ తిరుగుబాటుదారులు చెలరేగిపోతున్నారు.
బషర్అల్అసద్నేతృత్వంలోని ప్రభుత్వ దళాలను వెనక్కి నెడుతూ నగరాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే అలెప్పా, సనా, హోమ్స్నగరాలు రెబెల్స్ చేతిలోకి వెళ్లిపోగా.. తాజాగా దారా సిటీపై అస్సద్ సర్కారు నియంత్రణ కోల్పోయింది. తూర్పు సిరియాలో టర్కీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కుర్దులు క్రియాశీలకంగా మారడం.. దక్షిణ ప్రాంతంలో డ్రూజ్ తిరుగుబాటుదారులు రెచ్చిపోతుండడంతో అసద్ బలగాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
తక్షణమే సిరియాను వీడండి..భారత్ అడ్వైజరీ
సిరియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. సిరియాలోని భారతీయులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా మార్గాల ద్వారా ఆ దేశంనుంచి బయటపడాలని తెలిపింది. ఈ మేరకు భారత విదేశాంగ శాక అడ్వైజరీ జారీచేసింది.