పదేండ్లలో లిఫ్ట్ స్కీంల కరెంటు బిల్లులు రూ.14,284 కోట్లు

  • గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్లులు చెల్లించండి
  • ఇరిగేషన్ డిపార్ట్​మెంటును కోరిన ట్రాన్స్ కో

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వివిధ లిఫ్ట్ స్కీములకు సంబంధించి గత సర్కారు పెండింగ్ పెట్టిన కరెంట్ బిల్లులను చెల్లించాలని ఇరిగేషన్ శాఖను ట్రాన్స్​కో విజ్ఞప్తి చేసింది. పదేండ్లుగా బిల్లులు పెండింగ్ ఉన్నాయని ట్రాన్స్​కో నష్టాల్లో కూరుకుపోతున్నదని పేర్కొంది. దీని వల్ల డెవలప్​మెంట్ వర్క్స్ ఆగిపోతున్నాయని, కొత్త పనులను చేపట్టలేకపోతున్నామని తెలిసింది. అక్టోబర్ 26న జలసౌధలో కొత్త ఏఈఈలకు అపాయింట్ మెంట్ లెటర్లను అందజేసిన సందర్భంగా ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా లిఫ్ట్ స్కీంల పెండింగ్ కరెంట్ బిల్లుల అంశం చర్చకు వచ్చింది. దీనిపై విద్యుత్ అధికారులతో సమావేశాలు నిర్వహించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ట్రాన్స్​కో, ఇరిగేషన్ అధికారులు విద్యుత్ సౌధలో సమావేశమయ్యారు. 15 సీఈల సర్కిళ్ల పరిధిలలో పెండింగ్ ఉన్న కరెంట్ బిల్లులపై ట్రాన్స్​కో అధికారులు ఇరిగేషన్ అధికారులకు వివరాలిచ్చినట్టు తెలిసింది. కాగా, ఇప్పటికే పలుమార్లు ఇరిగేషన్ మంత్రి వద్ద పెండింగ్ బిల్లుల గురించి ప్రస్తావించినట్టు ఇరిగేషన్ అధికారులు వివరించినట్టు సమాచారం. పైస్థాయిలో నిర్ణయాలు జరిగితే బిల్లులు రిలీజ్ అవుతాయని చెప్పినట్టు తెలిసింది.

14,284 కోట్లు పెండింగ్​..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు సంబంధించి మొత్తం రూ.14,284 కోట్ల మేర కరెంట్ బిల్లులు పెండింగ్ ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అందులో ఎనర్జీ చార్జెస్​ రూ.5,877 కోట్లు, ఎనర్జీ చార్జీలు కాకుండా అదనపు చార్జీలు మరో రూ.8,407 కోట్లు పెండింగ్​లో ఉన్నాయంటున్నారు. వాస్తవానికి రూ.14,957 కోట్ల మేర ఎనర్జీ చార్జీలు పెండింగ్ ఉండగా.. అందులో రూ.9,080 కోట్లు తిరిగి చెల్లించినట్టు తెలిసింది. మరో రూ.5,877 కోట్లకు.. లేట్ పేమెంట్ చార్జీలు, డిమాండ్ చార్జీలు, సర్ చార్జీలు సహా రూ.8,407 కోట్లు పెండింగ్ ఉన్నాయని సమాచారం. ఇందులో లేట్ పేమెంట్ చార్జీల మొత్తమే రూ.4,557 కోట్లు పెండింగ్ ఉన్నట్టు తెలిసింది. కాగా, అత్యధికంగా సీఈ రామగుండం పరిధిలో రూ.4,268 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నట్టు సమాచారం. ఇందులో ఎనర్జీ చార్జీలు రూ.878 కోట్లు పెండింగ్ ఉండగా.. మిగతా మొత్తం డిమాండ్ చార్జీలు, లేట్​పేమెంట్ చార్జీలే ఉండడం గమనార్హం. ఆ తర్వాత నాగర్​కర్నూల్ పరిధిలో రూ.2,939 కోట్లు, గజ్వేల్ పరిధిలో రూ.1,985 కోట్ల మేర పెండింగ్ ఉన్నట్టు తెలిసింది.