‘లా నినా’ బలపడుతోందా!

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమైన ‘సూపర్‌‌ ఎల్‌‌  నినో’ ప్రభావం క్రమంగా బలహీనపడుతూ చల్లదనానికి కారణమయ్యే ‘లా నినా’ ప్రభావం క్రమంగా బలపడుతోందనే  వార్తను తాజాగా ‘జాతీయ మహాసముద్ర వాతావరణ పరిపాలన’  లేదా ‘నేషనల్‌‌ ఓసియానిక్‌‌ అట్మాస్పియరిక్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ (ఎన్‌‌ఓఏఏ)’కు సంబంధించిన ‘వాతావరణ అంచనా కేంద్రం’ స్పష్టం చేసింది.  జూన్‌‌ 2023లో  ప్రారంభమైన ‘ఎల్‌‌  నినో’ ప్రభావం  మే 2024 వరకు గత ఏడాది కాలంగా  ప్రపంచ దేశాలకు ఎన్నడూ చూడనంత అతి వేడిని పరిచయం చేసింది.

 ‘ఎల్‌‌  నినో’  ప్రభావంతో  ఒకవైపు  యూఎస్‌‌లో  తీవ్ర ఉష్ణోగ్రతలతో  కరువు, కాటకాలు,  మరోవైపు  ఆఫ్రికా  ప్రాంతాల్లో అతి, అకాల వర్షాలతో  వరదలు కూడా రావడం చూశాం.  పసిఫిక్‌‌   మహాసముద్రంపై  వాతావరణం  వేడెక్కడానికి  కారణమైన ‘ఎల్‌‌ నినో ’  సహజ ప్రక్రియ,  మానవ  ప్రమేయ  కాలుష్యాలతో  గత  కొన్ని మాసాలుగా గతంలో  ఎన్నడూ చూడనివిధంగా భూగ్రహం ‌‌రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమయింది.  నేడు ‘ఎల్‌‌  నినో’ ప్రభావం క్రమంగా బలహీనపడుతూ ‘లా  నినా’ ప్రభావం చూపడం ప్రారంభమవుతున్నదని ఎన్‌‌ఓఏఏ సంస్థ అధ్యయనాలు వివరిస్తున్నాయి.

‘లా నినా’ ప్రభావంతో సుడిగాలులు

ప్రస్తుతం ‘ఎల్‌‌ నినో’,  ‘లా నినా’ ప్రభావాలు లేని  ‘ఎన్‌‌సో-న్యూట్రల్‌‌’ తటస్థ స్థితి ఉందని  తెలుపుతూ  రాబోయే మాసాల్లో  సెప్టెంబర్‌‌ 2024 వరకు యూఎస్‌‌, అట్లాంటిక్‌‌ ప్రాంతం,  కరేబియన్‌‌ సముద్రం,  గల్ఫ్‌‌ ఆఫ్  మెక్సికో లాంటి  ప్రాంతాలు ‘లా  నినా’ బలపడుతూ ‘అతి తీవ్ర  సుడిగాలి  లేదా హైపర్‌‌ ఆక్టివ్  హరికేన్స్‌‌‌‌’  సీజన్‌‌ రావచ్చని తెలుస్తు న్నది.  ప్రతి ఏటా సగటున 14 వరకు  వచ్చే  హరికేన్స్‌‌కు  బదులుగా  రానున్న  ఏడాదిలా ‘లా  నినా’  ప్రభావంతో 33 వరకు  సుడిగాలులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ‘ఎల్‌‌  నినో’  ప్రభావిత  వేడి ప్రాంతాలు  రానున్న  నెలల్లో  ‘లా నినా’  రాకతో  చల్లబడేందుకు 65 శాతం వరకు అవకాశం ఉందని,  అదేవిధంగా ‘లా నినా’ ప్రభావం 2024–- 25 శీతాకాలంలో  చూపడానికి  85 శాతం వరకు అవకాశం ఉందంటూ అంచనా వేస్తున్నారు.     ‘ఎల్‌‌  నినో’  ప్రభావం బలహీనపడడంతో ‘అతి చురుకైన  సుడిగాలులు (హైపర్‌‌ ఆక్టివ్‌‌  హరికేన్స్‌‌)’ రావచ్చని అంచనా వేయడం జరుగుతోంది.  వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడానికి 90 శాతం వరకు కారణం విచ్చలవిడి, విచక్షణా రహిత శిలాజ ఇంధనాల వాడకమే కారణమని, ఈ ఉష్ణోగ్రతలు తగ్గడం అంత సులభం కాదని స్పష్టం చేస్తున్నారు. 

‘ఎల్‌‌ నినో’, ‘లా నినా’ అంటే..

‘ఎల్‌‌ నినో’  అనే  స్పానిష్‌‌  పదానికి  ‘లిటిల్‌‌ బాయ్‌‌  లేదా  క్రీస్ట్‌‌ చైల్డ్‌‌’ అని అర్థం. ఉష్ణమండల  పసిఫిక్‌‌  మహాసముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు అతిగా ఉండడాన్ని ఎల్‌‌ నినో ప్రభావమని అంటారు. ఎల్‌‌ నినో ప్రభావం 2 నుంచి 7 ఏండ్లలో ఒకసారి బయటపడవచ్చు. ‘లా నినా’ అంటే స్పానిష్‌‌లో ‘లిటిల్‌‌ గర్ల్‌‌’ అని అర్థం.  సముద్ర ఉపరితలాలు  సగటు కన్న చల్లగా ఉండడాన్ని ‘లా నినా’ అని వ్యవహరిస్తాం. ‘లా నినా’ను  ‘వ్యతిరేక ఎల్‌‌ నినో’ లేదా ‘చల్లని సంఘటన’ గా అర్థం చేసుకోవాలి.  ప్రతికూల వాతావరణ మార్పులకు కారణమైన శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడంతో,  2070 నాటికి భారత్‌‌తో పాటు ప్రపంచ దేశాలు‌‌ ‘శూన్య ఉద్గార’ లక్ష్య స్థాయికి చేరడం వల్ల అతి ఉష్ణోగ్రతల ‘ఎల్‌‌ నినో’ ప్రభావం తగ్గుతుందని తెలుసుకుంటూ, మన చల్లని ‘లా నినా’  భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. 

- డా. బుర్ర మధుసూదన్‌‌ రెడ్డి, ఎన్విరాన్​మెంట్​ ఎనలిస్ట్​