ఆర్థికం అధ్వానం.. 63 వేల కోట్లు ఖర్చే పెట్టలే

  • గత బీఆర్ఎస్ సర్కార్ 2022-23లో పెట్టిన బడ్జెట్​పై కాగ్ 
  • కేటాయింపులు రూ.2.77 లక్షల కోట్లు ..ఖర్చు మాత్రం రూ.2.14 లక్షల కోట్లు 
  • దళితబంధు, డబుల్ ఇండ్లు, గొర్రెల పంపిణీకి పైసా ఇయ్యలే
  • కాళేశ్వరం, మిషన్ భగీరథ కోసమే ఎక్కువ అప్పులు 
  • అప్పుల కిస్తీలు, వడ్డీల కింద పదేండ్లలో కట్టాల్సిన మొత్తమే రూ.2.67 లక్షల కోట్లు అని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ అధ్వానంగా చేసిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పేర్కొంది. సరైన అంచనాలు లేకుండా 2022–23 బడ్జెట్​ను ప్రవేశపెట్టిందని.. అందులో చెప్పిన మేరకు ఖర్చు చేయలేదని తెలిపింది. కేవలం బడ్జెట్​ను ఎక్కువగా చూపేందుకు అంకెల గారడీ చేసిందని చెప్పింది. 

ఎంత ఆదాయం వస్తుంది? ఎంత ఖర్చు చేయాలి? అనే దానిపై ఓ లెక్కాపత్రం లేకుండా.. బడ్జెట్​లో భారీ కేటాయింపులు చేసి, చివరకు ఖర్చు చేసింది కొంతేనని పేర్కొంది. 202-2–---23 ఆర్థిక సంవత్సరంలో రూ.2.77 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి, ఖర్చు చేసింది రూ.2.14 లక్షల కోట్లు మాత్రమేనని వెల్లడించింది. ఓవైపు బడ్జెట్​లో కేటాయింపులు చేసి, ఖర్చు చేయలేదని.. మరోవైపు అసెంబ్లీ ఆమోదం లేకుండానే దాదాపు రూ. 9 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపింది. గత ప్రభుత్వ తీరుతో అప్పుల కిస్తీలు, వడ్డీలకు కలిపి పదేండ్లలో (2023–24  నుంచి 2032–33 వరకు) ఏకంగా రూ.2.67 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పింది.