వానొస్తే నగరం మునుగుడే

  • కాలనీలు విస్తరిస్తున్నాపెరగని వసతులు
  •  ఓల్డ్​ సిటీ డ్రైనేజీ వ్యవస్థఅస్తవ్యస్థం

నిజామాబాద్​, వెలుగు : నిజామాబాద్ లో  డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా మారడంతో పెద్ద వాన పడితే చాలు నగరం నీట మునుగుతుంది. మురుగుకాలువలు పొంగిపోయి..   రోడ్లు  చెరువులను తలపిస్తున్నాయి.  లోతట్టు ప్రాంతాల్లోని  ఇండ్లలోకి వరద నీరు చేరుతోంది. మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో ఏటా కొత్తగా అనేక  కాలనీలు ఏర్పడుతున్నాయి.  దానికి తగ్గట్టు కార్పొరేషన్​అధికారులు సౌలతులు కల్పించలేకపోతున్నారు. ఏటా  పన్నుల రూపంలో ప్రజలు రూ.84 కోట్లు కడుతున్నా వారికి కనీస  సేవలు అందించడంతో బల్దియా విఫలమవుతోంది.

 నాలుగు రోజుల కింద కంఠేశ్వర్ రైల్వే కమాన్​ కింద  ఐదడుగుల మేర  నిలిచిన వర్షం నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకొంది. స్థానికులు, పోలీసులు వచ్చి సురక్షితంగా బయట కు తెచ్చేవరకు  బస్సులో ఉన్న  8మంది చిన్నారులతో సహా 22 మంది ప్రయాణీకులు  ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు.  బుధవారం రెండేండ్ల చిన్నారి అనన్య డ్రైనేజీలో   కొట్టుకుపోయి చనిపోయింది.  ఈ  ఘటనలతో భారీ వర్షం పడితే జనాలు భయపడే పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ 1937లో మున్సిపాలిటీగా ఏర్పడగా  అంచెలంచెలుగా హోదా పెరుగుతోంది. 

సెకెండ్​ గ్రేడ్​, ఫస్ట్​ గ్రేడ్​తర్వాత  1987 నాటికి  స్పెషల్​ గ్రేడ్​మున్సిపాలిటీగా మారింది.  2005 నుంచి కార్పొరేషన్​గా కొనసాగుతోంది.  తొమ్మిది శివారు గ్రామాలు కార్పొరేషన్​లో విలీనమయ్యాయి.  ప్రస్తుతం  60 డివిజన్లున్న   సిటీ జనాభా 4.40 లక్షలకు చేరింది.   నిజామాబాద్​ నుంచి వివిధ ప్రాతాలకు 570 బస్సులు, 30 ట్రైన్​లు నడుస్తున్నాయి. జిల్లా కేంద్రం కావడం వల్ల  రకరకాల పనులమీద  రోజూ వేలాది మంది వచ్చిపోతుంటారు.  నగరంలో   81,604 భవనాలున్నట్టు అధికారికంగా చెప్తుండగా అందుకు అనుగుణంగా  డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడలేదు. 

వర్షాకాలం నరకప్రాయం

ఏటా నగరం విస్తరిస్తోంది.    విలీన గ్రామాల్లో  కొత్త కాలనీలు వందల సంఖ్యలో ఏర్పడుతున్నాయి.  ఆ కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలం వచ్చిదంటే  కాలనీల చుట్టూ నీరు చేరుతోంది. నటరాజ్​ థియేటర్​ వెనుక ప్రాంతం నుంచి మాలపల్లి, అర్సాపల్లి, అంబేడ్కర్​ కాలనీల్లో పరిస్థితి దారుణంగా ఉంటోంది.  ఈ ప్రాంతంలోని ఇండ్లన్నీ నీట మునుగుతున్నాయి.  -బోధన్​ రోడ్​ ఎడమ వైపు  నాలుగు ఫీట్ల వరకు  వర్షపు నీళ్లు  ప్రవహిస్తుండడంతో  వ్యాపారులు, కాలనీవాసులు  ఇబ్బంది పడుతున్నారు.  

వర్షాకాలానికి  ముందు డ్రైనేజీల్లో  పూడిక తీయిస్తున్నా వరద ఉధృతిని డ్రైనేజీలు  తట్టుకోలేకపోతున్నాయి.   రెండేండ్ల చిన్నారి అనన్య  కొట్టుకుపోయిన ఘటన  డ్రైనేజీ  సిస్టం ఎంత దారుణంగా ఉందో   ఎత్తిచూపుతోంది. రూ.160 కోట్లతో  నిర్మించిన అండర్​గ్రౌండ్​ డ్రైనేజీ  ఎప్పుడు అందుబాటులో తెస్తారో తెలియడంలేదు. భారీ వర్షాలకుతగ్గట్టు డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరిచే దిశగా బల్దియా ప్లాన్​ చేయాల్సిన అవసరం ఉంది.