ఎక్స్​పోర్టుకు అన్ని వసతులు కల్పిస్తాం : కలెక్టర్ ప్రావీణ్య

హనుమకొండ, వెలుగు : జిల్లాలోని పంటలు, ఇతర ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్ లో సోమవారం సాయంత్రం జిల్లా ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ రివ్యూ మీటింగ్​నిర్వహించారు. డీజీఎఫ్​టీ శైలజ హైదరాబాద్​నుంచి వర్చువల్​గా ఈ మీటింగ్​లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్​ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో ఎగుమతి చేసే ఉత్పత్తుల వివరాలను అందజేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.

ముఖ్యంగా జిల్లా నుంచి బియ్యం, మిర్చి, గ్రానైట్, టెక్స్​టైల్​ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని, ముందుగా ఎగుమతిదారుల సమస్యలను తెలియజేయాల్సిందిగా సూచించారు. ఎక్స్​పోర్టుకు వీలున్న అన్ని ఉత్పత్తుల వివరాలతో నివేదిక తయారు చేయాలని, రైతులకు అవగాహన కల్పించి నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ప్రోత్సహించాలన్నారు.

సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, ఎల్​డీఎం శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడు చక్రధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా, ప్రజల నుంచి 140 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్​ ప్రావీణ్య తెలిపారు. 

ఉపాధిహామీ పనులను పూర్తి చేయాలి

హనుమకొండ సిటీ : ఉపాధి హామీ పథకం కింద ఇచ్చిన టార్గెట్ ప్రకారం మార్చి 2025 కి ఉపాధి హామీ పనులను పూర్తి చేసి కూలీలకు పని కల్పించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య కోరారు. కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పని ప్రగతిపై సమీక్ష చేశారు. జిల్లాలో ఉపాధిహామి పథకం కింద 14 గ్రామ పంచాయతీల నిర్మాణం, 10 అంగన్ వాడీ భవనాల నిర్మాణం, 12 కిలో మీటర్ల మేర రోడ్డునిర్మాణ పనులనుపూర్తి చేయాలని కోరారు.