ఇంకా 11 శాతం  సీఎంఆర్ పెండింగ్..కామారెడ్డి జిల్లాలో నేటితో ముగియనున్న గడువు

  • టార్గెట్​ రీచ్​ కాని 37 రైస్​ మిల్లులు
  • ప్రభుత్వానికి చేరని 34,350 మెట్రిక్​ టన్నుల బియ్యం
  • జుక్కల్ పరిధిలోని మిల్లుల నుంచే ఎక్కువగా రావాల్సి ఉంది
  • మిల్లుల్లో గింజ వడ్లు లేవ్.. మరి అడ్జస్ట్ మెంట్​ ఎలా?

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని రైస్​మిల్లులకు ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 163 రైస్ మిల్లులు ఉండగా, 37 మిల్లులు సీఎంఆర్ టార్గెట్​ను రీచ్​కాలేదు. ఇంకా ప్రభుత్వానికి 34,350 మెట్రిక్​టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. వీటిలో ఎక్కువ మిల్లులు జుక్కల్ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి.

2022–23 వానకాలం సీజన్ లో ప్రభుత్వం రైతుల నుంచి 4లక్షల75 వేల మెట్రిక్​టన్నుల వడ్లను కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించింది. వాటిని మరాడించి సీఎంఆర్​కింద 3లక్షల48 వేల మెట్రిక్​టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఎన్ని గడువులు ఇచ్చినా మిల్లర్లు సీఎంఆర్ టార్గెట్​రీచ్​కాకపోవడంతో, కాంగ్రెస్​ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

జనవరి నెలాఖరులోగా ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే ఈ నెల 29 వరకు 3లక్షల13వేల600 మెట్రిక్​ టన్నుల(89శాతం) సీఎంఆర్​ను మిల్లర్లు అప్పగించారు. ఇంకా 34వేల350 మెట్రిక్​టన్నులు(11శాతం) రావాల్సి ఉంది. కొందరు బయట నుంచి తెచ్చి ఇస్తుండగా, చాలా మిల్లుల్లో వడ్ల గింజ కూడా లేదు. లీజుకు తీసుకుని నడిపిస్తున్న మిల్లులే టార్గెట్​రీచ్​కాలేదని తెలుస్తోంది. 

గతంలోనూ ఇంతే..

కామారెడ్డి జిల్లాలోని163 రైస్​మిల్లులకు ఆయా సీజన్లలో ప్రభుత్వం వడ్లు అప్పగించింది. ప్రస్తుతం వీటిలో 37 రైస్​మిల్లులు సీఎంఆర్​టార్గెట్​రీచ్​కాలేదు. ఇందులో జుక్కల్​నియోజకవర్గంలో లీజుకు తీసుకుని నడిపిస్తున్నవే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. గతంలో సీఎంఆర్​టార్గెట్​పూర్తిచేయని రైస్​మిల్లులకే సివిల్​సప్లయ్​అధికారులు తిరిగి సీఎంఆర్​వడ్లను కేటాయించారు. అప్పుడే చర్యలు తీసుకొని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్లకు కేటాయించకుండా ఉంటే ఈపాటికి టార్గెట్​పూర్తయ్యేదని జనం అభిప్రాయపడుతున్నారు.

కానీ సంబంధిత అధికారులు ఇష్టానుసారంగా వడ్లు అప్పగించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం కేటాయించిన వడ్లు పక్కదారి పట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. రేషన్​బియ్యం పాలిష్​పట్టి సీఎంఆర్ అడ్జస్ట్​మెంట్​చేసే ప్రయత్నంలో కొందరు మిల్లర్లు ఉన్నట్లు సమాచారం. ఇటీవల అధికారులు జరిపిన తనిఖీల్లో మిల్లులు ఖాళీగా ఉన్నాయని, గింజ వడ్లు కూడా లేవని తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తే మిల్లర్ల అక్రమాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి

నిజామాబాద్​లో 2.44లక్షల క్వింటాళ్లు మాయం 

నిజామాబాద్ జిల్లాలోని 9 రైస్​మిల్లుల్లో 2లక్షల44వేల553 క్వింటాళ్ల సీఎంఆర్ వడ్లు గాయబ్​ అయినట్లు గుర్తించామని కలెక్టర్ రాజీవ్​గాంధీ హన్మంతు చెప్పారు. వాటి విలువ రూ.52.88 కోట్లని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వర్ని మండలంలోని ఎంఎస్ఆర్​ ఆగ్రో ఇండస్ట్రీస్, మెసర్స్​సర్ ట్రేడర్స్, గంగా రైస్​మిల్, రాయల్​ట్రేడింగ్ ​కంపెనీ, నిజామాబాద్​ మండలంలోని వెంకటలక్ష్మీ ఆగ్రో ఇండస్ట్రీస్, లక్ష్మీశ్రీదేవి ఇండస్ట్రీస్, శేషాద్రి ఆగ్రో ఇండస్ట్రీస్

లక్ష్మీగణపతి నరసింహ ఆగ్రో ఇండస్ట్రీస్, బోధన్​లోని దాదాబాయ్​ ఇండ్రస్ట్రీస్​ ప్రభుత్వ వడ్లను పక్కదారి పట్టించినట్లు తేలిందన్నారు. 9 మిల్లులపై ఆర్ఆర్ ​యాక్ట్​ కింద రికవరీ చర్యలు చేపట్టాలని తహసీల్దార్లను ఆదేశించామన్నారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లు వడ్ల విలువ డబ్బును ప్రభుత్వ ఖాతాలో జమ చేయడానికి ఆఖరు అవకాశం ఇస్తున్నామన్నారు.

టార్గెట్​ రీచ్​ కాకపోతే చర్యలుంటయ్

సీఎంఆర్​ టార్గెట్​ రీచ్​ కాని మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటాం. గడువులోగా 100 శాతం పూర్తిచేయాలి. లేకుంటే 25 శాతం అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. పెండింగ్​ఉన్న మిల్లులకు వచ్చే సీజన్లలో కేటాయింపులు ఉండవ్. 

చంద్రమోహన్, కామారెడ్డి అడిషనల్ కలెక్టర్