అసెంబ్లీకి ఓడినా.. పార్లమెంట్​ బరిలోకి..

  •     మూడు పార్టీల క్యాండిడేట్లు వాళ్లే 
  •     అందరూ హేమాహేమీలే
  •     నిజామాబాద్ లో రసవత్తర పోరు 

​నిజామాబాద్, వెలుగు : డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని మూడు సెగ్మెంట్లలో ఓడిపోయిన క్యాండిడేట్లే లోక్​సభ బరిలో దిగుతున్నారు. మూడు ప్రధాన పార్టీలు అనూహ్యంగా మొన్న ఓటమిపాలైన వారికే టికెట్లివ్వడం ఆసక్తికరంగా మారింది. కోరుట్లలో ఓడిపోయిన సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బీజేపీ అభ్యర్థిగా, జగిత్యాలలో ఓడిపోయిన ఎమ్మెల్సీ టి. జీవన్​రెడ్డి కాంగ్రెస్​ అభ్యర్థిగా, నిజామాబాద్​ రూరల్​ సెగ్మెంట్​లో ఓడిపోయిన బాజిరెడ్డి గోవర్ధన్​ బీఆర్ఎస్​ నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారు. అర్వింద్ ప్రస్తుతం నిజామాబాద్​ఎంపీగా ఉండగా, జీవన్​రెడ్డి, గోవర్ధన్ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన సీనియర్​ లీడర్లు. 

ముచ్చటగా మూడోసారి 

సీనియర్​ కాంగ్రెస్​ నేత జీవన్​రెడ్డి ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1983లో మొదటిసారి జగిత్యాల నుంచి గెలిచారు. ఆయన ఎన్టీఆర్​, నాదెండ్ల భాస్కర రావు, వైఎస్​ రాజశేఖరరెడ్డి కేబినెట్​లలో మంత్రిగా పని చేశారు. 2006, 2009 లో కరీంనగర్​ పార్లమెంట్​ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2006 ఉప ఎన్నికల్లో ఆయన కేసీఆర్​ మీద పోటీ చేశారు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న జీవన్​రెడ్డిని కాంగ్రెస్​ నిజామాబాద్​ నుంచి బరిలోకి దింపింది. 

సిట్టింగ్​ స్థానం నుంచే.. 

మాజీ మంత్రి డి.శ్రీనివాస్​ రాజకీయ వారసుడు ధర్మపురి అర్వింద్​ 2019 పార్లమెంట్​ ఎన్నికల్లో నిజామాబాద్​నుంచి విజయం సాధించారు. ఆయన బీజేపీలో జాతీయ నాయకులతో సన్నిహితంగా ఉంటూ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్​బ్రాండ్​ ఇమేజ్​ పొందారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్​నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన ఆర్వింద్​ అనూహ్యంగా కోరుట్ల నుంచి పోటీ చేశారు. అక్కడ ఓడిపోయిన ఆయన తన సిట్టింగ్​ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. 

పార్లమెంట్​ కు ఫస్ట్​ టైమ్​ 

 ఉమ్మడి జిల్లాలోని మూడు చోట్ల నుంచి అసెంబ్లీకి ఎన్నికై రికార్డ్​ నెలకొల్పిన బాజిరెడ్డి గోవర్ధన్ మొదటిసారి పార్లమెంట్​ బరిలో నిలిచారు. 1994లో ఆర్మూరు నుంచి ఇండిపెండెంట్​ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన ఓడిపోయినా తన రాజకీయ గురువు , మాజీ మంత్రి సంతోష్​రెడ్డి కన్నా ఎక్కువ ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో గోవర్ధన్​ తరఫున వైఎస్​రాజశేఖర్​రెడ్డి తండ్రి రాజారెడ్డి ప్రచారం చేయడం విశేషం. 1999లో మొదటిసారి ఆర్మూరు నుంచే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా, 2014, 2018లో నిజామాబాద్​రూరల్​ నుంచి బీఆర్ఎస్​ అభ్యర్థిగా గెలిచారు. 2014లో ఆయన మాజీ మంత్రి డి. శ్రీనివాస్​ మీద గెలిచారు.