తొమ్మిది రోజులు సాగిన అసెంబ్లీ.. 65 గంటల 33 నిమిషాలు

  • మొత్తం జరిగన సభ 65 గంటల 33 నిమిషాలు
  • సీఎం రేవంత్​ స్పీచ్​4 గంటల 54 నిమిషాలు
  • అక్బరుద్దీన్​ 5 గంటల 41 నిమిషాలు, కేటీఆర్​ 2 గంటల 56 నిమిషాలు 
  • బడ్జెట్ ​రోజు మాత్రమే ప్రతిపక్ష నేత కేసీఆర్​ హాజరు

హైదరాబాద్, వెలుగు : తొమ్మిది రోజుల పాటు సాగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. పలు కీలక అంశాలపై సభలో చర్చ జరిగింది. ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయి. జులై 23న ప్రారంభమైన సమావేశాలు 65 గంటల 33 నిమిషాల పాటు జరిగాయి. సభా నాయకుడైన సీఎం రేవంత్ రెడ్డి మొత్తం 9 రోజుల్లో 4 గంటల 54 నిమిషాల పాటు మాట్లాడారు. 

సభలో ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ మాత్రం ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు. ఆయన వచ్చింది బడ్జెట్​ రోజు మాత్రమే. అంతకుముందు ఆ తర్వాత కూడా ఆయన రాలేదు. సభా నాయకుడు సీఎం రేవంత్​రెడ్డి కన్నా ఎక్కువసేపు మజ్లిస్​ ఫ్లోర్​ లీడర్  అక్బరుద్దీన్​ ఒవైసీ 5 గంటల 41 నిమిషాల పాటు సభలో మాట్లాడారు. సీఎం తర్వాత బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే  కేటీఆర్ 2 గంటల 56 నిమిషాలు ప్రసంగించారు. సీఎం, మంత్రులంతా కలిసి 23 గంటల 47 నిమిషాల పాటు మాట్లాడారు. మొత్తం 32 ప్రశ్నలపై సభలో చర్చ జరిగింది. ఇందులో రెండు స్వల్పకాలిక  చర్చలు ఉన్నాయి.

బీఆర్​ఎస్​ సభ్యులకే ఎక్కువ టైమ్​!

సీఎం, మంత్రులను మినహాయిస్తే కాంగ్రెస్ సభ్యులు 12 గంటల 45 నిమిషాల పాటు అసెంబ్లీలో మాట్లాడగా.. బీఆర్ఎస్  సభ్యులు 12 గంటల 57 నిమిషాల పాటు మాట్లాడారు. బీజేపీ సభ్యులు 5 గంటల 55 నిమిషాలు, మజ్లిస్ సభ్యులు 7 గంటల 34 నిమిషాలు, సీపీఐ ఫ్లోర్​ లీడర్ ​కూనంనేని సాంబశివరావు 2 గంటల 35 నిమిషాలు ప్రసంగించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గంట 26 నిమిషాల పాటు సభలో మాట్లాడారు.

 బీఆర్ఎస్ సభ్యుల్లో కేటీఆర్  తర్వాత హరీశ్​ రావు 2 గంటల 16 నిమిషాల పాటు, జగదీశ్ రెడ్డి ఒక గంట 10 నిమిషాలు, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక గంట 7 నిమిషాలు మాట్లాడారు. మొత్తం సెషన్ లో కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ సభ్యులే 12 నిమిషాలు ఎక్కువగా మాట్లాడారు. గత నెల 29 సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు సాగడం సమావేశాల్లోనే అత్యధిక సమయం సభ నడిచిన రోజుగా చెప్పుకోవచ్చు. ఇక, శాసన మండలి ఆరు రోజులు కొనసాగగా..20 గంటల పాటు పని చేసింది. ఇందులో ఐదు బిల్లులు ఆమోదం పొందాయి. 45 మంది మాట్లాడారు.