రైతును రాజు చేయడమే లక్ష్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు

భిక్కనూరు, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం బాగోలేక పోయినా రైతును రాజు చేయాలనే లక్ష్యంతో  రూ.2 లక్షల రుణమాఫీని పక్కాగా అమలు చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన రైతు రుణమాఫీ సంబరాల్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీతో కలిసి ఆయన ముఖ్య​అతిథిగా పాల్గొన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్​లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టులతో పేరుతో ప్రభుత్వ సోమ్మును కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని ఫైరయ్యారు. విద్య, వైద్య రంగాలను అధ్వాన్నంగా తయారు చేశారని దుయ్యబట్టారు. 

అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ..  కాంగ్రెస్ రైతుల పార్టీ అని, ఇచ్చిన మాట తప్పదని చెప్పారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్  సంగ్వాన్, డీఎఫ్​వో, పార్టీ మండలాధ్యక్షుడు భీమ్​రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్​ రెడ్డి, బద్దం ఇంద్రకరన్​ రెడ్డి, అందె దయాకర్​రెడ్డి, బాల్యల సుదర్శన్, లీడర్లు పాల్గొన్నారు.