జైశ్రీరాం..అయోధ్య దర్శనం మోక్షదాయకం .. సప్తపురాల్లో ఇదే ఫస్ట్ క్షేత్రం

మోక్షం లభిస్తే మరుజన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి.  మోక్షం కోసం ఏడు పుణ్య నగరాలను సందర్శించాలని హిందూ పురాణాలు చెబుతున్నాయి.  అందులో అయోధ్య మొదటిదని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. మన దేశంలో అతి పురాతన, అత్యంత ప్రాచీనమైన 7 క్షేత్రాలున్నాయి. వీటినే సప్త మోక్షదాయక క్షేత్రాలంటారు అందులో మొదటిది శ్రీరాముడు జన్మించిన అయోధ్య అని పండితులు చెబుతున్నారు. ప్రతి హిందువులు వీటిని జీవిత కాలంలో ఒక్కసారి దర్శించుకున్నా మరుజన్మ ఉండదని భావిస్తారు


"అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ
అవంతికాపురీ ద్వారావతీ చైవ సప్తైతే మోక్షదాయికా"

 
అని పిండ ప్రదాన సమయంలో కూడా చదువుతారు. 
  

భూమ్మీద పుట్టినందుకు కన్నుమూసేలోగా హిందువులు తప్పనిసరిగా సందర్శించాల్సిన ఆలయాలు ముఖ్యంగా ఏడు. వీటినే సప్త మోక్షదాయక క్షేత్రాలు అంటారు. ఈ ఏడు క్షేత్రాలను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని చెబుతారు. పాండవులు కూడా మహాభారత యుద్ధం తర్వాత బ్రహ్మణ, గురువు, బంధు పరివారం హత్యదోష నివారణార్థం ఏడు పుణ్యక్షేత్రాలను సందర్శించిన తర్వాతే స్వర్గానికి ప్రయాణమయ్యారని చెబుతారు. ఈ ఏడు క్షేత్రాల్లో  వైష్ణవ, శైవ క్షేత్రాలు రెండూ ఉన్నాయి. అంత మహిమాన్వితమైన సప్తపురి క్షేత్రాల్లో మొదటిది అయోధ్య...

అయోధ్య ( Ayodhya Ram Mandir)

శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం అయోధ్య. ఉత్తర ప్రదేశ్ ఫైజాబాద్ జిల్లాలో  ఉన్న ఈ క్షేత్రానికి రామజన్మ భూమి అని ప్రసిద్ధి.  రామాయణ కాలం కన్నా ముందే సాకేత పురం అనే పేరుతో  ప్రసిద్ధి చెందింది. స్కంధ పురాణంలో అయోధ్యను ఏడు పవిత్ర నగరాల్లో ఒకటిగా పేర్కొన్నారు. అధర్వణ వేదంలో కూడా అయోధ్యను సాక్షాత్తు ఆ భగవంతుడు నిర్మించిన నగరంగా ప్రస్తావించారు. దేవుడు నిర్మించిన నగరం  అయినందునే ధార్మికంగా  అత్యంత ప్రాధాన్యత కలిగిఉందని  భక్తుల విశ్వాసం. అందుకే సప్త మోక్షదాయక నగరాల్లో అయోధ్యతో మొదటి స్థానం.

ద్వారక (Dwarka)

సప్తపురి క్షేత్రాల్లో ద్వారక ఒకటి. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీ కృష్ణుడు మధురను విడిచి దాదాపు వందేళ్లు నివశించిన ప్రాంతం  ద్వారక.  గుజరాత్ గోమతి నదీ తీరంలో ఉన్న ఈ క్షేత్రంలో ద్వారకాదీశ దేవాలయం, రుక్మిణి దేవాలయం, శారదాపీఠం లాంటి ఎన్నో ముఖ్యమైన ధార్మిక క్షేత్రాలున్నాయి. ఎనిమిదో శతాబ్దంలో ఆది శంకరాచార్యలు స్థాపించిన నాలుగు శారద పీఠాల్లో ద్వారకలో కూడా ఒకటి  పశ్చిమ శారదా పీఠం ద్వారకలో ఉండటం వల్ల ఈ క్షేత్రానికి అత్యంత శక్తి ఉందని నమ్ముతారు. సంస్కతంలో ద్వార అంటే ప్రవేశం అని, కా అంటే పరబ్రహ్మ సన్నిధి అని అర్థం. అందువల్లే పురాణ కాలం నుంచి ద్వారకా...అంటే మోక్షానికి ప్రవేశ ద్వారమని అంటారు. 

మధుర (Mathura)

ఉత్తర ప్రదేశ్ లో ఉన్న మధుర శ్రీకృష్ణుడి జన్మస్థానం. ద్వాపర యుగం నుంచి ఇప్పటి వరకూ మధుర ఓ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. దీనిని ల్యాండ్ ఆఫ్ ఎటర్నల్ లవ్ అని పిలుస్తారు. బాల్యంలో కృష్ణుడు గోపికలతో గడిపన స్థలం ఇదే కావడంతో ఈ ప్రాంతం అంతా ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇక్కడ చాలా వైభవంగా జరుపుకుంటారు.

ఉజ్జయిని (Ujjaini)

మధ్యప్రదేశ్ ఉజ్జయినీ కూడా సప్తపురి క్షేత్రాల్లో ఒకటి. క్షిప్రా నదీ తీరంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రం వైష్ణవులకు, శైవులకు కూడా అత్యంత పవిత్రమైన నగరం. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి. మహాకాళేశ్వర, కాలభైరవ, చింతామణి గణేశ, గోపాల మందిరంలో నిత్యం భక్తుల సందడి ఉంటుంది. మహాకాళేశ్వర దేవాలయం దేశంలో ఉన్న పరమ పవిత్రమైన శివలింగం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి.

హరిద్వార్ (Haridwar)

ఉత్తరాఖండ్ లో ఉన్న హరిద్వార్ సప్తగిరి క్షేత్రాల్లో విశిష్టమైన పుణ్యక్షేత్రం. గరుడ పురాణంలో ఈ క్షేత్రాన్ని మాయానగరమని పిలుస్తారు. గరుడుడు అమృతాన్ని తీసుకెళుతుండగా ఇక్కడ ఓ చుక్క పడిపోయిందని చెబుతారు. అందుకే ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే మోక్షం తథ్యం అంటారు. కుంభమేళ జరిగే సమయంలో లక్షల మంది హరిద్వార్ ను చేరుకుని పవిత్ర స్నానాలు చేస్తారు. గంగోత్రి వద్ద జన్మించి దాదాపు 2543 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత హరిద్వార్ లోనే ఉధృతంగా ప్రవహించడం మొదలుపెడుతుంది. అందుకే హరిద్వార్ ను గంగా ద్వారమని కూడా పిలుస్తారు.  

వారణాసి(Varanasi)

వరుణ, అసి అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున 'వారణాసి' అనే పేరువచ్చింది. వారణాసి పేరును పాళీభాషలో బారణాసిగా రాసేవారు. అది తర్వాత బనారాస్ గా మారింది. వారణాసి నగరాన్ని పురాణ ఇతిహాసాల్లో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే ఎన్నో పేర్లతో ప్రస్తావించారు. సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథ. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి. ఇక్కడ శివుడు నివసిస్తాడని భక్తుల విశ్వాసం.  అందుకే ఈ పుణ్యక్షేత్రానికి హిందూ ధార్మిక పర్యటనలో విశిష్ట స్థానం ఉంది.  పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీవిశ్వేరుడు కొలువైన వారణాసిలో చనిపోయినా,  అంత్య క్రియలు జరిగినా నేరుగా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల నమ్మకం.

కాంచిపురం (Kanchipuram)

సప్తపురి క్షేత్రాల్లో  దక్షిణ భారత దేశంలో ఉన్న  ఒకే ఒక పుణ్యక్షేత్రం కాంచిపురం. ఇక్కడ దేవాలయాల్లో ప్రమఖమైనది కామాక్షి అమ్మవారి దేవాలయం. ఇది ఒక శక్తిపీఠం. ఇక్కడ శివుడు కూడా కొలువై ఉండడంతో  శైవులకు  అత్యంత పవిత్రమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రాన్ని కాంచి అని కూడా పిలుస్తారు.