హైదరాబాద్, వెలుగు: చెన్నమనేని రమేశ్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్ కు చెంపపెట్టు లాంటిదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చెన్నమనేని రమేశ్ భారత పౌరుడు కాదని తెలిసినా, అతడు జర్మన్ పాస్ పోర్ట్ తో తిరుగుతున్నా.. ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ ఆయనకు టికెట్ ఇచ్చారని విమర్శించారు. ఈ కేసులో రమేశ్ తో పాటు కేసీఆర్ కు కూడా తగిన శిక్ష పడాలన్నారు. వేములవాడ ప్రజలకు కేసీఆర్, చెన్నమనేని, బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మంగళవారం సీఎల్పీలో ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ‘‘భారత పౌరుడు కాని వ్యక్తికి బీఆర్ఎస్ ఎలా టికెట్ ఇచ్చింది? రోజూ అన్ని విషయాలపై స్పందించే కేటీఆర్ ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదు”అని ఆయన ప్రశ్నించారు. దేశపౌరుడు కాని వ్యక్తిని చట్టసభ్యుడిగా చేసిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. కోర్టు తీర్పు తర్వాత కూడా రమేశ్ అబద్ధాలు ఆడుతున్నారని, ఆయన దేశానికి వస్తే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెన్నమనేని ఓటు హక్కును రద్దు చేసిందని, ఆయన భారత పౌరసత్వాన్ని కేంద్రం మూడు సార్లు రద్దు చేసిందని గుర్తుచేశారు. జర్మనీ పాస్ ఫోర్ట్ పై ఆయన 45 సార్లు ప్రయాణం చేశారని, అయినా బుకాయిస్తున్నారన్నారు. ఓసీఐ కార్డ్ హోల్డర్ అయిన చెన్నమనేనికి అసలు ఓటు వేసే హక్కు లేదన్నారు.
చెన్నమనేని జర్మనీ దేశాన్ని కూడా మోసం చేశారని ఆరోపించారు. కోర్టును తప్పుదోవ పట్టించడంతోనే చెన్నమనేనికి రూ.30 లక్షల జరిమానా విధించిందన్నారు. బలహీన వర్గాలకు చెందిన తనను అణగదొక్కడానికి ప్రయత్నం చేశారని ఆరోపించారు. 15 ఏండ్లు న్యాయపోరాటంలో గెలిచానని, చెన్నమనేనికి చట్టప్రకారం శిక్ష పడాలన్నారు. ఆయన అప్పీల్ కు వెళ్తే పైకోర్టు లో కూడా న్యాయపోరాటం చేస్తానని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.