గత బీఆర్ఎస్ సర్కార్ అక్రమాలపై ఎంక్వైరీలు కొలిక్కి.!

  • పెద్దల పాత్రను బయటపెడ్తున్న ఆఫీసర్లు
  • రాష్ట్ర ప్రభుత్వం చేతికివిద్యుత్​ కమిషన్​ రిపోర్ట్​
  • కాళేశ్వరం కమిషన్​ విచారణ 80 % పూర్తి
  • ఫోన్​ ట్యాపింగ్ కేసులోనూకీలక పరిణామాలు 
  • ఫార్మూలా ఈ –రేస్​లోస్పీడ్ ​పెంచిన ఏసీబీ​
  • ధరణి, భూదందాలపైనాపూర్తయిన విచారణ

హైదరాబాద్​, వెలుగు: గత బీఆర్ఎస్​  హయాంలో జరిగిన విద్యుత్​ కొనుగోలు ఒప్పందాలు, కాళేశ్వరం అవకతవకలు, ఫోన్​ట్యాపింగ్​, గొర్రెల స్కామ్​, ధరణి భూదందా, ఫార్మూలా ఈ రేస్ అక్రమాలపై రాష్ట్ర  ప్రభుత్వం చేపట్టిన విచారణలు ఒక్కొక్కటే కొలిక్కి వస్తున్నాయి. ఇప్పటికే విద్యుత్​ కొనుగోలు ఒప్పందాలపై  జస్టిస్​ మదన్​ భీంరావు లోకూర్​ కమిషన్  రిపోర్ట్​ అందజేసింది. ఇక కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్​ ఘోష్ కమిషన్ ​చేపట్టిన విచారణ కూడా దాదాపు 80 శాతం పూర్తయింది. ఈ నెలాఖరులోగా మరికొందరిని ఓపెన్​ కోర్టులో విచారించి, తుది నివేదిక ఇచ్చేందుకు కమిషన్​ సిద్ధమవుతున్నది. అటు ఫోన్​ ట్యాపింగ్ ​కేసులో కీలకంగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్​రావు పాస్​పోర్టు రద్దయింది. దీంతో అనివార్యంగా ఆయన స్వదేశానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభాకర్​రావు ఎయిర్​పోర్ట్​లో దిగినవెంటనే కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ప్రభాకర్​రావు స్టేట్​మెంట్​రికార్డు చేయడమే మిగిలి ఉంది. ఇది కూడా ఈ నెలాఖరులో, లేదంటే డిసెంబర్​లో పూర్తయ్యే చాన్స్​ ఉంది. ఇక ధరణి భూ అక్రమాలపై ఐఏఎస్​ అమోయ్​ కుమార్​పై ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేయగా.. ఎంక్వైరీ స్పీడ్​ అందుకుంది. మరోవైపు ధరణిని అడ్డుపెట్టుకొని గత బీఆర్ఎస్​ హయాంలో సాగిన భూదందాపై ప్రస్తుత ప్రభుత్వం విజిలెన్స్​ ఎంక్వైరీ చేయిస్తున్నది.


ఇప్పటికే చాలా వివరాలను సేకరించిన విజిలెన్స్.. వాటి ఆధారంగా బాధ్యులపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఫార్ములా ఈ– రేస్​కు సంబంధించి ఏసీబీ కూడా ఎంక్వైరీని వేగవంతం చేసింది. సర్కారు నుంచి గ్రీన్​సిగ్నల్​ రాగానే అరెస్టులకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గొర్రెల స్కామ్​కు సంబంధించి కూడా ఇప్పటికే పలువురు అధికారులను అరెస్ట్​ చేసిన ఏసీబీ.. ఎంక్వైరీలో భాగంగా నాటి ప్రభుత్వంలోని కొందరు ప్రజాప్రతినిధులను ప్రశ్నించనున్నట్టు తెలిసింది.

కీలకం కానున్న నోట్​ఫైల్స్​ 

ఇప్పటివరకు ఆయా కేసుల్లో విచారణ ఎదుర్కొన్న అధికారులంతా ఎంక్వైరీలో గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలోని పెద్దల వైపే వేలెత్తి చూపించారు. అప్పటి సీఎం, మంత్రులు చెప్పినట్లు చేశామే తప్ప అవేవీ తమ సొంత నిర్ణయాలు కావని స్టేట్​మెంట్లు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయాలన్నీ నాటి సీఎం కేసీఆర్​, ఇరిగేషన్​ మంత్రిగా పనిచేసిన హరీశ్​రావు తీసుకున్నారని, తాము కేవలం పాత్రధారులమేనని ప్రాజెక్టు అధికారులు, ఇంజినీర్లు.. జస్టిస్​ పీసీ ఘోష్​కమిషన్ ముందు స్పష్టంచేశారు. ముందుజాగ్రత్తగా అందరి నుంచి అఫిడవిట్ల రూపంలో వివరాలు తీసుకున్న కమిషన్​ వాటి ఆధారంగా ఓపెన్​ కోర్డులో విచారించి, కీలక నిర్ణయాల వెనుక సూత్రధారుల వివరాలను అధికారులతో చెప్పించింది. విచారణలో వారి స్టేట్​మెంట్లే కీలకం కానున్నాయి. మరో విడత ఐఏఎస్​ల ఎంక్వైరీకి కమిషన్ ​ఏర్పాట్లు చేస్తున్నది. 

ఆ తర్వాత  గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇచ్చి.. క్రాస్​ ఎగ్జామినేషన్​ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఆ వెంటనే రిపోర్ట్​ను ప్రభుత్వానికి అందజేసే అవకాశముంది. ఇందుకు మరో నెల పట్టవచ్చని సమాచారం. ఇక, నాటి సీఎం కేసీఆర్​తో పాటు నాటి మంత్రి  జగదీశ్​రెడ్డి ఆదేశాలతోనే విద్యుత్​ కొనుగోలు ఒప్పందాలు జరిగినట్లు లోకూర్​ కమిషన్​ తన ఎంక్వైరీలో తేల్చినట్లు తెలిసింది. అటు కాళేశ్వరంలోనూ, ఇటు విద్యుత్​ ఒప్పందాల్లోనూ ఆఫీసర్లను పావులుగా వాడుకుని.. అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు తాజా ఎంక్వైరీలను బట్టి స్పష్టమవుతున్నది. కమిషన్లు, విజిలెన్స్​ ఇచ్చే నివేదికలోని ఆధారాలతోపాటు గత ప్రభుత్వం టైంలో అధికారులు  ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకున్నారనే నోట్​ఫైల్స్​ కీలకం కానున్నాయి. వీటిని బట్టే బాధ్యులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. 

విద్యుత్ కమిషన్​ రిపోర్ట్​ ఆధారంగా మొదటి చర్యలు 

గత బీఆర్ఎస్​ ప్రభుత్వం చత్తీస్​గఢ్​తో​ చేసుకున్న విద్యు త్​ఒప్పందంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అప్పుడున్న పరిస్థితుల్లో కాంపిటీటివ్​ బిడ్డింగ్​ పెడితే రూ.4కు యూనిట్​వచ్చే అవకాశమున్నా.. రూ.5.50 నుంచి రూ.6 దాకా పెట్టి కొనడంతో తెలంగాణపై వేలకోట్ల భారం పడింది. సదరన్​ డిస్కంతో వెయ్యి మెగావాట్లకు ఒప్పందం చేసుకున్నా 50 శాతం కూడా సరఫరా కాకపోవడం, ఇతర విద్యుత్​ సంస్థల నుంచి అధిక ధర కు కొనడం వల్ల రూ.2,600 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. ఇక కాలం చెల్లిన సబ్​ క్రిటికల్​ టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్​ నిర్మించడం వల్ల  భారీగా నష్టం జరిగిందనే వాదనలున్నాయి. ఇక పిట్​ హెడ్​(బొగ్గుగనుల ఏరియా)కు దూరంగా యాదాద్రి ప్లాంట్ నిర్మించడం వల్ల రవాణా నష్టం పెరిగి, యూనిట్​కాస్ట్​ రూ.6 నుంచి రూ.6.60 దాటనుంది. అదీగాక తొమ్మిదేండ్లయినా ఈ ప్లాంట్​ పూర్తికాకపోవడంతో  అప్పులు, వడ్డీల భారం తడిసిమోపడైంది. విద్యుత్​ ఒప్పందాలతోపాటు భద్రాద్రి, యాదాద్రి థర్మల్​ ప్లాంట్ల నిర్ణయాల్లో నాటి సీఎం కేసీఆర్​, నాటి మంత్రి మంత్రి జగదీశ్​రెడ్డితోపాటు ట్రాన్స్​కో జెన్​కో మాజీ సీఎండీ ప్రభాకర్​ రావులే కీలకంగా వ్యవహరించినట్లు జస్టిస్​ లోకూర్​ కమిషన్​ఎంక్వైరీలో తేలినట్లు సమాచారం. గతంలో జస్టిస్​ నరసింహారెడ్డి కమిషన్​ విచారించిన 36 మంది స్టేట్​మెం ట్లతోపాటు అప్పటి విద్యుత్​ శాఖ కార్యదర్శుల నోట్​ఫైల్స్​ను కూడా కమిషన్​ తన రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది. విద్యుత్ కమిషన్​ రిపోర్ట్​ ఆధారంగానే నాటి ప్రభుత్వ పెద్దలపై మొదట చర్యలు తీసుకునే అవకాశముందని అధికారవర్గాల్లో చర్చ జరుగుతున్నది. 

గొర్రెల స్కామ్​, ఫార్ములా ఈ-రేస్​పై  దూకుడు 

గొర్రెల కొనుగోలు స్కామ్​లో ఏసీబీ ఇప్పటికే కొందరు అధికారులను అరెస్ట్​ చేసింది. రూ.2.5 కోట్ల అక్రమాలు జరిగాయన్న ఆధారాలతో ఏసీబీ రంగంలోకి దిగగా.. ఈ వ్యవహారం వెనక రూ.700 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. అధికారుల స్టేట్​మెంట్ల ఆధారంగా గతంలో ఆ శాఖను చూసిన మంత్రికి కూడా నోటీసులు ఇచ్చే అంశాన్ని తాజాగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ–ఫార్ములా కార్ల రేస్​కోసం అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్‌ నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లను విదేశీ సంస్థకు చెల్లించినట్లు ఏసీబీ తేల్చింది. కనీసం జీవో కూడా లేకుండా నాటి మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​ మౌఖిక ఆదేశాల మేరకు నిధులు విడుదల చేసినట్లు అర్వింద్ ​కుమార్​ చెప్పడంతో త్వరలోనే కేటీఆర్‌కు కూడా నోటీసులు ఇస్తారనే చర్చ జరుగుతున్నది. 

భూదందాలపై ఆధారాలు

గత బీఆర్​ఎస్​ హయాంలో ధరణిని అడ్డుపెట్టు కొని నేతలు చేసిన భూదందాలపై ఇప్పటికే ప్రభుత్వం వివరాలు సేకరించింది. ఈ క్రమంలో ఐఏఎస్​ అమోయ్​ కుమార్​ను ఈడీ విచారిస్తున్న ది. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లాల్లో జరిగిన భూదందాలపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్​ ఎంక్వైరీ చేయిస్తున్నది. అదే సమయం లో 58,59 జీవోల కింద  కొందరు విలువైన ప్రభు త్వ భూములను అక్రమంగా కొట్టేసినట్లు ప్రభు త్వానికి ఆధారాలు అందాయి. వీటిలో కొన్ని భూములకు ఇచ్చిన పట్టాలను ఇప్పటికే క్యాన్సిల్​ చేయగా.. మరికొన్నింటిపై ఎంక్వైరీ చేయిస్తున్న ది. వీటిని కూడా నెల రోజుల్లోపు పూర్తి చేసి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలనుకుంటున్నది.