టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం

 శ్రీకాంత్ 1998 డీఎస్సీ ద్వారా సెకండరీ గ్రేడ్ టీచరుగా సర్వీసులో చేరి 24 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకుని ప్రస్తుతం పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న సమయం ఇది.  ఒక్క శ్రీకాంతే కాదు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది టీచర్ల పరిస్థితి ఇది.  సర్వీసు మూడేళ్లు పొడిగించిన అనంతరం మార్చి నుంచి ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి. సర్వీసులో ఒక్క ప్రమోషన్ అయినా పొందాలనుకున్న శ్రీకాంత్ లాంటి  ఉపాధ్యాయుల ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు.

పార్లమెంటు ఎన్నికల అనంతరం ప్రభుత్వం ప్రమోషన్లు  కల్పిస్తుందని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు టెట్ గండంగా మారింది.  నేషనల్  కౌన్సిల్ ఫర్  టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనలను అనుసరించి టెట్​లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధిస్తేనే  ప్రమోషన్లకు అర్హులు అన్న నిబంధన ఉపాధ్యాయుల పదోన్నతుల ఆశలపై నీళ్లు చల్లిందనడంలో అతిశయోక్తి లేదు. టీచర్ల పదోన్నతి, బదిలీల వ్యవహారం.

ఉపాధ్యాయేతర ఉద్యోగులు క్రమంగా పదోన్నతులు పొందుతూ ఉన్నత స్థానాలకు చేరుతుంటే టీచర్లు మాత్రం కోర్టు కేసుల నేపథ్యంలో, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సుదీర్ఘకాలం ఎటువంటి పదోన్నతి లేక ఉన్న కేడర్​లోనే  పదవీ విరమణ చేస్తుండడం విచారకరం. పై కేడర్ ప్రమోషన్​కు సంబంధించిన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ దశాబ్దంపైగా  జూనియర్  లెక్చరర్,  డైట్ లెక్చరర్,  ఎంఈఓ, డిప్యూటీ ఈవో వంటి తదితర పోస్టులతో పాటు పాఠశాల స్థాయి హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా ప్రమోషన్లు పొందలేకపోవడం శోచనీయం.

హెడ్మాస్టర్ల పోస్టులు ఖాళీ

ఉన్నత పాఠశాలల్లో చాలాచోట్ల హెడ్మాస్టర్ల  పోస్టులు ఖాళీగా ఉండి ఇంచార్జీల పాలనలో స్కూల్స్ నడవడం, సబ్జెక్టు టీచర్ల కొరత ఉండడం వల్ల పిల్లలు ఆయా సబ్జెక్టులలో బోధన అందకపోవడం వంటి బోధనాపరమైన సమస్యలతో పాఠశాల విద్య సతమతమవుతున్నది. ఈ తరుణంలో టీచర్లకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, బదిలీలు నిర్వహించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ అప్పటి ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది,

ధర్నాలు నిర్వహించింది. ఉద్యమ స్వభావం గల సోదర సంఘాలతో కలిసి ఉద్యమించింది.  ఫలితంగా హైస్కూల్ స్థాయి  పోస్టుల వరకు  మేనేజ్ మెంట్ వారీగా పదోన్నతులు ఇవ్వడానికి,  బదిలీలు నిర్వహించడానికి ప్రభుత్వం అంగీకరించి ప్రక్రియ ప్రారంభించింది. ఎనిమిది సంవత్సరాల తరువాత గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వం పదోన్నతులకు షెడ్యూల్ విడుదల చేసింది.  జోన్–-1లో ప్రధానోపాధ్యాయులు,  స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ వరకు పదోన్నతులు కల్పించిన ప్రభుత్వం కోర్టు కేసుల మూలంగా జోన్-–2లో  పదోన్నతుల ప్రక్రియను నిలిపివేసింది.  

న్యాయస్థానం నుంచి పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ప్రభుత్వం ఎన్నికల తదుపరి పదోన్నతులు కల్పిస్తుంది అనుకుంటే ఇప్పుడు టెట్ అడ్డంకిగా మారింది.  ఇప్పుడు రిటైర్మెంట్ కు దగ్గరగా ఉండి ఈ వయస్సులో టెట్​కు సంసిద్ధులు కావడం సీనియర్లకు అసాధ్యం. పైగా ఇన్నేళ్లుగా ఏదో ఒక సబ్జెక్టుకు పరిమితమై ఆ సబ్జెక్టును బోధిస్తున్నవారు ఇప్పుడు అన్ని సబ్జెక్టులు అధ్యయనం చేయడం వాటిలో జ్ఞాన సముపార్జన చేయడం సాధ్యంకాని పని.   ఇప్పుడు అకస్మాత్తుగా ఇంగ్లీషు,  సైన్సు, గణితం, సోషల్ సబ్జెక్టులపై అవగాహన పెంచుకొని వాటిలో పరీక్ష రాయడం ఉత్తీర్ణత చెందడం గగన కుసుమమేనని చెప్పక తప్పదు.

సర్వీస్ టీచర్లకు తిప్పలు

నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించే ప్రతివారు టెట్ అర్హత సాధించాలని నిబంధనను 2010లో విధించింది. ఈ నిబంధనను కేవలం ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించేవారికే గాక ఇన్ సర్వీసు టీచర్లకు కూడా వర్తింపజేయడంతో  సర్వీస్ టీచర్లకు తిప్పలు తప్పడం లేదు. అయితే అప్పటి మన రాష్ట్ర ప్రభుత్వం 2015లో ఉత్తర్వుల సంఖ్య.36 ను విడుదల చేస్తూ 2010 కంటే ముందు నియామకం పొందిన టీచర్లకు టెట్ మినహాయింపు ఇస్తున్నట్టు ఆ ఉత్తర్వులలో పేర్కొన్నది.

2015 నుంచి 2023 వరకు విడుదలైన ప్రతి టెట్ నోటిఫికేషన్​లో 2010 కంటే ముందు నియామకం పొందిన టీచర్లకు టెట్ మినహాయింపు విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. దానితో  సీనియర్ టీచర్లు ఎవరు కూడా టెట్ గురించి ఆలోచించలేదు. ఇటీవల హైకోర్టు టెట్ అర్హతను తప్పనిసరి చేస్తూ ఇచ్చిన తీర్పును అనుసరించి ప్రభుత్వ విద్యాశాఖ 2024లో విడుదల చేసిన టెట్ నోటిఫికేషన్​లో మినహాయింపు విషయాన్ని తొలగించింది.

అయితే 2010కి ముందు నియామకమైన టీచర్లకు ప్రమోషన్ల కొరకు టెట్ అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం కోసంమెరుపు. ఆ తీర్పు నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్.సి.టి.ఈ నుండి అనుమతి తీసుకుని ఇన్ సర్వీస్ టీచర్లలో 2010 కంటే ముందు నియామకం పొందినవారికి టెట్ నుండి మినహాయింపు ఇచ్చి వెంటనే పదోన్నతులు బదిలీలు చేపట్టాలి.

ప్రమోషన్​కు టెట్ అవసరం

ఎస్జీటీ,  ఎల్.ఎఫ్.ఎల్ హెచ్ఎం రెండు కూడా ఒకే లెవెల్ పోస్టులు కాబట్టి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ప్రమోషన్ కు టెట్ అవసరం ఉండదని,  అలాగే భాషా పండితులుగా నియామకం పొందిన టీచర్లు పనిచేస్తున్న లెవెల్ హై స్కూల్ స్థాయి కాబట్టి వారికి కూడా టెట్ అవసరం లేదని, స్కూల్ అసిస్టెంట్ లు పనిచేసేది కూడా
 హై స్కూల్ స్థాయే  కాబట్టి వారికి టెట్ ఉత్తీర్ణత అవసరం లేదన్న వాదనలు వినిపిస్తున్నా నేటికీ ప్రభుత్వం నుంచి  స్పష్టత రాకపోవడంతో టీచర్లు ఆందోళనకు గురవుతున్నారు.

ఈ విషయమై ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. 2010 కంటే ముందు నియామకం పొంది,  సీనియారిటీ ఉండి పదవీ విరమణకు చేరువగా ఉన్న టీచర్ల పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం వారికి టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి. ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి చొరవ తీసుకుని పదోన్నతులకు ఆటంకాలను తొలగిస్తారని ఉపాధ్యాయ లోకం ఆశగా ఎదురు చూస్తున్నది.

సుధాకర్. ఏ.వి, 
రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, 
స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ