పాక్​లో టెర్రర్ అటాక్.. 50 మంది మృతి

పెషావర్: పాకిస్తాన్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ గిరిజన ప్రాంతంలో ప్రయాణికుల వాహనాలపై మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అఫ్గానిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని ఖైబర్‌‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ కుర్రం జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. కుర్రం జిల్లాలో సున్నీ, షియా వర్గాల మధ్య తరచుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. 

ఈ క్రమంలోనే ఈ దాడి జరిగినట్టు అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. పరాచినార్ నుంచి పెషావర్ కు 200 వాహనాలు కాన్వాయ్ గా వెళ్తుండగా టెర్రరిస్టులు మెరుపుదాడికి దిగారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా మొత్తంగా 50 మంది మృతి చెందారు. బాధితుల్లో ఎక్కువ మంది షియా వర్గానికి చెందినవారే ఉన్నారు. ఈ ఘటనపై ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్ సీఎం అలీ అమీన్ ఖాన్ గండాపూర్ విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిపై రిపోర్ట్ ను సమర్పించాలని ఆదేశాలిచ్చారు.