- బ్లాక్ బెర్రీ ఐలాండ్‌కు టీమ్‌లను పంపిన కలెక్టర్
భద్రాచలం, వెలుగు : భద్రాచలం వచ్చే భక్తులు, టూరిస్టులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించేందుకు గోదావరి తీరంలో గుడారాలను నిర్మిస్తున్నారు. ఇటీవల ముక్కోటి ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ జితేశ్ వి పాటిల్ గోదావరి-కరకట్టకు మధ్యలో ఉన్న ప్రదేశాన్ని చూశారు. ఆ ప్రదేశంలో 10 గుడారాలు నిర్మించాలని ఆదేశించారు. గురువారం పంచాయతీ ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఆ ఖాళీ ప్రదేశాన్ని చదును చేయించారు. రాత్రి పూట గోదావరి పై నుంచి వచ్చే పిల్ల గాలులను ఆస్వాదిస్తూ, నదీ అందాలను తిలకిస్తూ ఆదివాసీ వంటలను ఆరగిస్తూ టూరిస్టులు మధురానుభూతులు పొందేలా ఇక్కడ ఏర్పాట్లు చేయనున్నారు.
బ్లాక్ బెర్రీ ఐలాండ్‌కు జిల్లా నుంచి టీమ్‌లు
ములుగు జిల్లా తాడ్వాయి-పస్రా మధ్య అటవీ ప్రాంతంలో ఎకోటూరిజం ఇటీవల ప్రారంభమైంది. ఈ ఐలాండ్‌లో ఏర్పాటు చేసిన సదుపాయాలు, సోలార్ లైట్ సిస్టమ్, గుడారాలు అన్నింటిని పరిశీలించేందుకు జిల్లా నుంచి టీమ్‌లను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ గురువారం పంపించారు. ఐకేపీ, డీఆర్డీఏ ఉద్యోగులతో పాటు దుమ్ముగూడెం మండలంలోని బొజ్జిగుప్ప, నారాయణరావుపేట, చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు, భద్రాచలం ట్రైబల్ మ్యూజియం నుంచి సిబ్బందిని టీమ్‌లుగా ఏర్పాటు చేశారు.
వీరంతా బ్లాక్‌బెర్రీ ఐలాండ్ ను పరిశీలిస్తారు. అధ్యయనం చేస్తారు. అదే తరహాలో జిల్లాలో టూరిజం స్పాట్లను డెవలప్ చేయాలనేది కలెక్టర్ సంకల్పం. ఖర్చు ఎంతైనా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లాకు టూరిస్టులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.