డిగ్రీ స్టూడెంట్లకు ఫీజుల టెన్షన్​ .. భారంగా మారుతుందంటున్న డిగ్రీ స్టూడెంట్స్

  • త్వరలో రీయింబర్స్​మెంట్​ వస్తుందంటున్న ఆఫీసర్లు

నాగర్​కర్నూల్, వెలుగు: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజు చెల్లింపుల ​​టెన్షన్  పట్టుకుంది.​ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల సమయంలో ఎలాంటి ఫీజులు ఉండవని చెప్పి, కాలేజీలో చేరిన తరువాత కోర్సుకు ఏడాదికి రూ.2.350 నుంచి రూ.5 వేల వరకు ఫీజు కట్టాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్​ డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో చేరిన తమను ‘ఆక్టోపాడ్’ ఆన్​లైన్​ సైట్​లో అడ్మిషన్, బయోమెట్రిక్​ ఫీజు చెల్లించి కాలేజీలో రిసిప్ట్​ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు అంటున్నారు. 

పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన తమకు ఫీజులు భారంగా మారాయని అంటున్నారు. ఇదిలాఉంటే రీయింబర్స్​మెంట్​ డబ్బులు త్వరలో రిలీజ్​ అవుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రైవేట్​ డిగ్రీ కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఆర్టీఎఫ్​ కింద రీయింబర్స్​మెంట్​ డబ్బును కాలేజీ అకౌంట్​లో జమ చేస్తూ, మెస్​ చార్జీలను విద్యార్థులకు చెల్లిస్తున్నారు. తాము కాలేజీ ఫీజు కట్టాలని ఇంట్లో చెబితే తమ పేరెంట్స్​ నమ్మడం లేదని, పనులు మానుకుని కాలేజీకి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారని వాపోతున్నారు. 15 రోజుల కింద కల్వకుర్తి మోడల్​ డిగ్రీ కాలేజీని విజిట్​ చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి విద్యార్థులు ఫీజు గోడును వివరించారు. ఫీజు భారం తప్పించాలని వేడుకున్నారు.

మూడేండ్లుగా రీయింబర్స్​మెంట్​ ఇయ్యట్లే..

నాగర్​ కర్నూల్​ జిల్లాలో 7 గవర్నమెంట్, 8 ప్రైవేట్​ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్​ కాలేజీల్లో చదివే వారికి ఫీజు రీయింబర్స్​మెంట్​ స్కీం అమలులో ఉంది. గత ప్రభుత్వం రెండేళ్లు ఫీజు రీయింబర్స్​మెంట్​ చెల్లింపులు చేయలేదు. ఈ విద్యా సంవత్సరంతో కలిపి  మూడేండ్ల నుంచి రీయింబర్స్​మెంట్  రావడం లేదు. బీఏ(సీబీసీఎస్​) రూ.2,350, బీఏ(కంప్యూటర్స్) రూ.5350, బీకాం(కంప్యూటర్స్​) రూ.5,450, బీఎస్సీ(సీబీసీఎస్​), బీజడ్సీ, ఎంపీసీ రూ.3,550, బీఎస్సీ (సీబీసీఎస్) డైరీ సైన్స్​ రూ.5,550, బీఎస్సీ(కంప్యూటర్​ సైన్స్, కంప్యూటర్​ అప్లికేషన్స్) రూ.5,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

ఆన్​లైన్​లో ఫీజు చెల్లించాల్సిన ఆక్టోపాడ్​ లింక్​ను ఇప్పటికే స్టూడెంట్స్​ మొబైల్​ వాట్సాప్​లకు పంపించారు. ఇదిలాఉంటే అడ్మిషన్, ఎగ్జామ్​ ఫీజు చెల్లించడానికి సిద్దమే అంటున్న స్టూడెంట్స్​ వేలల్లో ఫీజులు ఫిక్స్​ చేసి కట్టాలనడం ఎంత వరకు సమంజసమని అంటున్నారు. లక్షల్లో ఫీజులు కట్టి ప్రైవేట్​ ఇంజనీరింగ్, టెక్నికల్​ కోర్సుల్లో చేరే ఆర్థిక స్థోమత లేని పేద, మధ్య తరగతి విద్యార్థులే డిగ్రీ కాలేజీల్లో చేరుతున్నారు. అప్పర్​ ప్లాట్  ఏరియాలోని గవర్నమెంట్​ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్​ ఫీజులు కట్టలేమని అంటున్నారు.​ 

మూతపడుతున్న ప్రైవేట్​ కాలేజీలు..

పట్టణాలు, మండల కేంద్రాల్లో ఏర్పాటైన ప్రైవేట్​ జూనియర్, డిగ్రీ కాలేజీలు ప్రభుత్వం నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్​మెంట్  మీద ఆధారపడి నడిచాయి. గత ప్రభుత్వం ఏండ్ల తరబడి రీయింబర్స్​మెంట్  ఫండ్స్​ పెండింగ్​లో పెట్టడంతో ప్రైవేట్​ కాలేజీలు మూతపడ్డాయి. ఒక్క నాగర్​కర్నూల్​ జిల్లాలోనే పదుల సంఖ్యలో ఇంటర్, డిగ్రీ కాలేజీలు క్లోజ్​ చేసుకున్నారు.

 ప్రైవేట్​ కాలేజీలు మూతపడడంతో గవర్నమెంట్​ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో స్టూడెంట్స్​ సంఖ్య పెరిగింది. కల్వకుర్తిలోని మోడల్​ డిగ్రీ కాలేజీలో ఫస్ట్​ ఇయర్​ నుంచి థర్డ్​ ఇయర్​ వరకు 900 మంది స్టూడెంట్స్​ చదువుతున్నారు. జిల్లా కేంద్రంలోని కాలేజీలోనూ దాదాపు ఇదే సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. అమ్రాబాద్​ డిగ్రీ కాలేజీలో 160 మంది స్టూడెంట్స్​ చదువుతున్నారు.

ఇట్లైతే చదవడం కష్టం

మమ్మల్ని కాలేజీలకు పంపించడమే కష్టం. మా అమ్మనాయనను ఒప్పించి కాలేజీలో చేరిన. ఇప్పుడు సార్లు ఫీజు కట్టాలంటున్నారు. ఇదే విషయం ఇంట్లో చెబితే కాలేజీ బంద్​ చేయమంటారని భయంగా ఉంది. ప్రభుత్వం ఈ ఫీజుల భారం తొలగించాలి.

స్పూర్తి, బీఏ ఫస్ట్​ ఇయర్, కుప్పగండ్ల

త్వరలో రీయింబర్స్ మెంట్​​వస్తుంది..

డిగ్రీ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్​మెంట్​ విడతల వారీగా విడుదల చేస్తున్నారు.త్వరలో అందరికి వస్తుంది.విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

శ్రావణి, ప్రిన్సిపాల్, మోడల్​ డిగ్రీ కాలేజీ, కల్వకుర్తి