- మిల్లుల్లోనే 'టెండర్' వడ్లు
- మూడు నెలలు కావస్తున్నా తీసుకెళ్లని కాంట్రాక్టర్
- మిల్లుల్లో 1.88 లక్షల టన్నుల 'టెండర్' వడ్లు
- మీరే తీసుకోవాలని మిల్లర్లకు సంకేతాలు..?
యాదాద్రి, వెలుగు : మిల్లుల్లోనే 'టెండర్' వడ్లు మూలుగుతున్నాయి. మూడు నెలలు కావస్తున్నా వాటిని తీసుకెళ్లాల్సిన టెండర్ వేసిన సంస్థ చప్పుడు చేయడం లేదు. పైగా వడ్లు మీరే తీసుకోవాలని కొందరు మిల్లర్లకు సంస్థ నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని తెలుస్తోంది. యాసంగి 2022–-23 సీజన్లో యాదాద్రి జిల్లాలోని సీఎంఆర్మిల్లుకు 4,11,187 టన్నులవడ్లను సివిల్సప్లయ్డిపార్ట్మెంట్అప్పగించింది.
ఇందుకు 2,77,428 టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అప్పగించాల్సి ఉంది. అయితే, ఈ సీజన్లో 50 శాతానికి పైగా మిల్లర్లు బియ్యం అప్పగించారు. ఆ తర్వాత మిల్లుల్లో ఉన్న యాసంగి 2022–-23 సీజన్వడ్లను విక్రయించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. దీంతో జిల్లాలోని మిల్లుల్లో పెండింగ్‌లో ఉన్న 1.88 లక్షల టన్నుల వడ్లను క్వింటాల్‌కు రూ.2 వేల చొప్పున టెండర్ ద్వారా ఓ సంస్థ ఫిబ్రవరిలో దక్కించుకుంది.
మూడు నెలలైనా గింజ ఎత్తలే..
టెండర్సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం వడ్లు ఎలా ఉన్నాయో అలా మూడు నెలల్లోగా మిల్లుల నుంచి సదరు సంస్థ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ నెల 23 వరకు జిల్లాలోని మిల్లుల్లో ఉన్న 1.88 టన్నుల వడ్లను సదరు సంస్థ తీసుకెళ్లాలి. అయితే ఇప్పటివరకు ఒక్క వడ్ల గింజ కూడా మిల్లుల నుంచి కాంట్రాక్టర్లు తరలించలేదు.
మీరే తీసుకోండి..?
మిల్లుల నుంచి వడ్లను తీసుకెళ్లి మరో చోట అమ్మడమెందుకు అన్న అభిప్రాయానికి సదరు సంస్థ వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే ఆ సంస్థకు చెందిన పలువురు మిల్లర్లను కలిసి మీ మిల్లులో ఉన్న వడ్లను మీరే తీసుకోవాలని సూచించినట్టుగా తెలిసింది. క్వింటాల్‌కు రూ.2,200 చొప్పున తమకు చెల్లించాలని సదరు సంస్థ చెప్పినట్టుగా మిల్లర్లు చెబుతున్నారు. దీంతో తమకు అవసరం లేదని చెప్పామని, అయినా సదరు సంస్థ ఒత్తిడి తెస్తోందని మిల్లర్లు ఆరోపిస్తున్నారు.
సీఎంఆర్ మిల్లుల్లో 5.25 లక్షల టన్నుల స్టాక్..
టెండర్ దక్కించుకున్న సంస్థ వడ్లను తరలించకపోవడంతో మిల్లుల్లో స్థలాభావం సమస్య ఏర్పడింది. టెండర్‌కు సంబంధించిన 1.88 లక్షల టన్నుల వడ్లు ఉన్నాయి. అదేవిధంగా 2023 వానకాలం వడ్లు 1.60 లక్షల టన్నులు మిల్లుల్లో ఉన్నాయి. వీటికి తోడుగా ప్రస్తుత 2023–-24 యాసంగి సీజన్‌కు సంబంధించిన 1.77 లక్షల టన్నుల వడ్లను సీఎంఆర్‌కు సివిల్‌సప్లయ్ అప్పగించింది.
దీంతో మిల్లుల్లో 5.25 లక్షల టన్నుల వడ్ల స్టాక్నెలకొంది. వాస్తవానికి జిల్లాలోని మిల్లులు, గోదాముల్లో 3.50 లక్షల టన్నుల వడ్లను నిల్వ చేసుకునే సామర్థ్యమే ఉంది. ఇవిపోను మిగిలిన వడ్లను మిల్లర్లు ఆరు బయట నిల్వచేస్తున్నారు.