నిజాయితీగా బతకాలనుకున్నారు కానీ
టైటిల్ : కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్
డైరెక్షన్ : బాలాజి భువనగిరి
కాస్ట్ : సాయి సూరేపల్లి, అమన్, అనిరుధ్, గోపాల్ మదన్, మహేష్ రావుల్, తేజ
లాంగ్వేజి : తెలుగు
ప్లాట్ ఫాం : ఆహా
ఎపిసోడ్స్ : 6 (సీజన్1)
ఇది ఓ నలుగురు ప్రాణ స్నేహితుల కథ. గని (సాయి సూరేపల్లి), బిట్టు (అనిరుధ్), టింకు (అమన్), సత్తి (గోపాల్ మదన్ ) – మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఈ నలుగురు కలిసి బ్యాంకు లోన్ తీసుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి అనుకుంటారు. లోను రాదు. దాంతో రికవరీ ఏజెంట్స్‌గా పనిచేస్తుంటారు. ఆ పని వాళ్లకి అంతగా నచ్చదు. నిజాయితీగా జీవితాన్ని గడపాలనే ఆలోచనతో ఒక ల్యాండ్ కొని, దాని ద్వారా వచ్చే డబ్బుతో సెటిల్ కావాలని అనుకుంటారు. తల్లిదండ్రులు తమ కోసం కూడబెట్టిన డబ్బు మొత్తం ఆ భూమికి పెట్టుబడిగా పెట్టాలి అనుకుంటారు. అయితే భూమి రిజిస్ట్రేషన్ ముందు రోజు ప్రభుత్వం పెద్ద కరెన్సీనోట్లు రద్దు చేస్తుంది. తమ దగ్గర ఉన్న రద్దయిన నోట్లను కొత్త కరెన్సీలోకి ఓ బ్యాంకు మేనేజర్ ద్వారా మార్చాలని గని, బిట్టు, టింకు, సత్తి ప్లాన్ చేస్తారు. కానీ, ఐదు కోట్ల స్కామ్‌లో చిక్కుకొని జైలు పాలవుతారు. జైల్లో గట్టు శీను అనే కరడుగట్టిన నేరస్తుడు ఈ నలుగురిని టార్గెట్ చేస్తాడు.
జైలు నుంచి బయటకు వచ్చాక ఆ నలుగురు కరీంనగర్‌లో రౌడీ లీడర్స్‌గా ఎలా ఎదిగారు? వాళ్లని స్కామ్‌లో ఇరికించింది ఎవరు? లోకల్ ఎమ్మెల్యే పురుషోత్తంతో ఉన్న గొడవ ఆ నలుగురి జీవితాలని ఎలాంటి మలుపులు తిప్పింది? అడ్డదారుల్లో ఎదగాలి అనుకున్న వాళ్ల జీవితాలు చివరకు ఎలా ముగిశాయి? అన్నదే కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ సిరీస్. పూర్తి స్థాయి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన వెబ్‌సిరీస్ ఇది. ఈ సిరీస్‌కు కరీంనగర్ నేటివిటీ, తెలంగాణ యాస, భాషలు ప్లస్ పాయింట్స్.
ఫ్రెడ్డీ దొరికాడా?
టైటిల్ : ఫీనిక్స్
డైరెక్షన్ : విష్ణు భరతన్
కాస్ట్ : అజూ వర్గీస్, నీల్జ కె బేబీ, చందునాథ్, అనూప్ మేనన్, అభిరామి బోస్
లాంగ్వేజ్ : మలయాళం
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైం వీడియో
అడ్వకేట్‌గా పనిచేసే జాన్ విలియమ్స్(అజు వర్గీస్) , అతని భార్య డైసీ (నీల్జ కె బేబీ), ముగ్గురు పిల్లలతో కొత్తగా ఒక బంగ్లాలోకి దిగుతాడు. ఆ బంగ్లా బీచ్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ ఇంట్లో దిగిన దగ్గర నుంచి అసాధారణమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఆ ఇంటివైపు పోస్ట్‌మెన్ రాకుండానే ‘ఫ్రెడ్డీ’ అనే వ్యక్తి పేరు మీద రోజుకి ఒక లెటర్ చొప్పున వస్తుంటుంది. ఇదిలా ఉంటే పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుంది. అదే పనిగా ఒక పిట్ట ఇంటి దగ్గరకు వచ్చి కూస్తుంటుంది.
పోస్ట్‌మెన్ రాకుండా లెటర్స్ ఎలా వస్తున్నాయనే అనుమానంతో జాన్ విలియమ్స్ ఆ లెటర్స్‌ను తన ఫ్రెండ్ అమీర్ (భగత్ మాన్యుయేల్)తో కలిసి చదువుతాడు. ఆ ఉత్తరాల చివరన రోజ్(అన్నా రోజ్) అనే సంతకం గమనిస్తారు. ఆమె ఫ్రెడ్డీ రాక కోసం ఎదురుచూస్తున్నట్టు ఉంటుంది. దాంతో ఏదో కథ ఆ ఇంటికి ఉందనే విషయం అర్థమవుతుంది. ఎలాగైనా అది తెలుసుకోవాలని ఆ ఇంటి గురించి, ఫ్రెడ్డీ గురించి చుట్టుపక్కల వాళ్లని వాకబు చేస్తాడు. కానీ లాభం లేకుండా పోతుంది. ఏవేవో సంఘటనలు జరుగుతుంటాయి. దాంతో రోజ్ ఆత్మ వాటన్నింటికీ కారణం అనే నిర్ధారణకు వస్తాడు. రోజ్ ఆత్మ ఆ కుటుంబాన్ని రకరకాల పద్ధతుల్లో ‘నన్ను కలవడానికి ఫ్రెడ్డీ ఎప్పుడు వస్తాడు?’ అని అడుగుతుంటుంది. ఆ ప్రశ్నకు వాళ్ల దగ్గర సమాధానం ఉండదు. మరయితే ఫ్రెడ్డీ, అన్నా ఎవరు? ఫ్రెడ్డీకి ఏం జరిగింది? అన్నా ఎందుకు చనిపోయింది? తెలియాలంటే ఫీనిక్స్ చూడాల్సిందే.
కంటెంట్‌తో కట్టిపడేస్తుంది
టైటిల్ : టోబీ
డైరెక్షన్ : బసిల్ అల్చలక్కల్
కాస్ట్ : రాజ్ బి శెట్టి, సంయుక్త హోర్నాడ్, చైత్ర జె ఆచార్, రాజ్ దీపక్ శెట్టి, గోపాల్ క్రిష్ణ, యోగి బంకేశ్వర్
లాంగ్వేజి : కన్నడ
ప్లాట్ ఫాం : సోనీలివ్
టోబి(రాజ్ బి. శెట్టి) టీనేజ్‌లో బాలనేరస్తుల జైలులో శిక్ష అనుభవిస్తుంటాడు. అతని మానసిక స్థితి సరిగా లేదనే విషయం జైలుకి వచ్చిన చర్చి ఫాదర్ (యోగి)కి అర్థమవుతుంది. అతని వివరాలు అడిగితే... ‘‘ఏ ఊరి వాడు, తల్లిదండ్రులు ఉన్నారో లేదో మాకు తెలియదు. జైల్లో జరిగిన ఒక సంఘటన వల్ల ఓకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయి. మాట్లాడలేడు” అని చెప్తారు జైలు స్టాఫ్. అప్పటివరకు అతనికి పేరు కూడా లేదని తెలుసుకున్న ఫాదర్ .. ‘టోబి’ అనే పేరు పెడతాడు. చేతిపై ఆ పేరు రాసి ‘ఇక నుంచి ఇదే నీ పేరు’ అని చెప్తాడు. అప్పటి నుంచి అతనికి ఫాదర్ అంటే ఇష్టం ఏర్పడుతుంది. టోబి ఆవేశం వల్ల జైల్లో శిక్షలు పెరిగిపోతాయి. అనేక జైళ్లకు మారి, నడి వయసులో జైలునుంచి విడుదలవుతాడు. శవాల గదికి కాపలా ఉంటూ, చేపలు పడుతూ జీవితాన్ని కొనసాగిస్తుంటాడు టోబి.
టోబి ఉంటున్న ఊరి వాళ్లంతా గ్రామదేవతను కొలుస్తుంటారు. అమ్మవారి ముక్కుకి అలంకరించే ‘అడ్డ బేసర’కి ప్రాముఖ్యత ఉంటుంది. ఒక రోజు రాత్రి చేపలు పట్టడానికి వెళ్లిన ‘టోబి’కి అమ్మవారి ‘అడ్డ బేసర’ దొరుకుతుంది. దానిని జాగ్రత్తగా దాస్తాడు. కాలువ పక్కన పసి బిడ్డను వదిలేసి వెళ్లిపోతారు. ఆ పాపను ఏం చేయాలా అని అందరూ ఆలోచిస్తుంటే... తను ఉండే శవాల గదికి తీసుకెళ్తాడు టోబి. ఆ పాపకి ‘జెన్నీ’ (చరిత్ర ఆచార్) అని పేరు పెట్టి పెంచుకుంటాడు. ఇదిలా ఉండగానే ‘సావిత్రి' (సంయుక్త) అనే వేశ్యను ఇష్టపడతాడు టోబి. ఆమె కూడా అతని తోడును కోరుకుంటుంది. టీనేజికి వచ్చిన జెన్నీ సేఫ్‌గా ఉండాలంటే ఒక ఇల్లు కావాలని టోబితో చెప్తుంది సావిత్రి. ఇల్లు కట్టడం ఎలా? అనే ఆలోచనలో ఉన్న టోబీని ఆ ఊళ్లో మటన్ షాప్ నడిపే ఆనంద్ (రాజ్ దీపక్ శెట్టి) కలుస్తాడు. ‘నా వ్యాపారానికి అడ్డుపడుతున్న సంతోష్‌ని చంపేస్తే ఇల్లు కట్టిస్తా’ అంటాడు. సంతోష్ ఆ ఊళ్లో పెద్ద రౌడీ లీడర్. తన దారికి అడ్డొచ్చిన వారిని ఎందరినో హత్య చేసిన చరిత్ర అతనిది. అతని వలన ‘టోబి’ ఫ్యామిలీకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేది మిగతా కథ.
ఆ ఆరుగురి హత్యల వెనక?
టైటిల్ : కర్రీ అండ్ సైనైడ్ ది జాలీ జోసెఫ్
డైరెక్షన్ : క్రిస్టో టోమీ
లాంగ్వేజ్ : మలయాళం
ప్లాట్ ఫాం : నెట్‌ఫ్లిక్స్
వార్తలను క్రమం తప్పకుండా ఫాలో అయ్యే వాళ్లకు... అదికూడా క్రైమ్ న్యూస్ గమనించే వాళ్లకి కేరళకి చెందిన ‘జాలీ జోసఫ్’ కేసు గుర్తుండే ఉంటుంది. 2022లో వెలుగులోకి వచ్చిన ఈ కేసు అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2002 నుంచి 2016 మధ్య కాలంలో కుటుంబ ఆస్తుల కోసం జాలీ జోసఫ్ అనే మహిళ ఆరు హత్యలు చేసింది. కూడతై సీరియల్ కిల్లింగ్స్ ఆధారంగా ఈ డాక్యుమెంటరీ తీశారు.
కేరళ, కోయికోడ్‌లోని కూడతైకి చెందిన జాలీ జోసఫ్, అదే ప్రాంతానికి చెందిన రాయ్ థామస్ 1997లో ప్రేమించి, పెండ్లి చేసుకుంటారు. జాలీ.. మామ టామ్ థామస్, అత్త అన్నమ్మ... ఇద్దరూ రిటైర్డ్ టీచర్లు. ఆ కుటుంబంలో మిగతా వాళ్లు కూడా ఉద్యోగస్తులే. దాంతో జూలీని కూడా ఉద్యోగం చేయమని అత్త పట్టుబడుతుంది. అత్త పోరు పడలేక జూలీ ‘ఎన్‌ఐటీ కోయికోడ్’లో పని చేస్తున్నట్లు నమ్మిస్తుంది. ప్రతీ రోజూ కారులో ఉద్యోగానికి వెళ్లి వస్తున్నట్లు నటించేది. జూలీకి భర్త రాయ్ కుటుంబ ఆస్తిపై కన్ను పడి, ఎలాగైనా ఆస్తి సొంతం చేసుకోవాలి అనుకుంది. అందుకు సైనేడ్ హత్యల ప్లాన్ వేసింది. 2002లో మంచి నీళ్లలో సైనేడ్ కలిపి అన్నమ్మను హత్య చేసింది. 2008లో టామ్ థామస్ తినే ఆహారంలో సైనేడ్ పెట్టి చంపేసింది. 2010లో భర్త రాయ్ థామస్, ఆ తర్వాత అన్నమ్మ థామస్ సోదరుడు మ్యాథ్యూను, 2016లో జూలీ రెండో పెండ్లి చేసుకోవాలి అనుకున్న షాజు జచారయ్య భార్య, ఏడాదిన్నర వయసు గల బిడ్డను కూడా చంపేసింది. ఆ తర్వాతే షాజు, జూలీలు పెండ్లి చేసుకున్నారు. రాయ్ థామస్ తమ్ముడు కి అనుమానం వచ్చి పోలీసులకు కంప్లయింట్ చేస్తాడు. అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 2019లో జూలీని అరెస్ట్ చేశారు.
కేసుకు సంబంధించిన వివరాలన్నీ బయటకు చెప్పాలంటే లీగల్ చిక్కులు ఉండటంతో.. ఆ చిక్కులు లేని వివరాలను మాత్రమే ఈ డాక్యుమెంటరీలో చూపించారు. డాక్యుమెంటరీ మొత్తం జాలీ జోసఫ్ కుటుంబం వైపు నుంచే నడుస్తుంది. కేసును ఇన్వెస్టిగేట్ చేసిన అధికారి కేటీ సిమోన్‌తో పాటు.. స్టోరీ మొత్తాన్ని జాలీ పెద్ద కుమారుడు రెమో, మరదలు రెంజీ విల్సన్, మరిది రోజో థామస్‌లు చెప్తారు.
20 ఏండ్ల కాలంలో జరిగిన నేరాలను విపులంగా వివరించే ప్రయత్నం జరగలేదు అనిపిస్తుంది. హత్యలకు సంబంధించిన డాక్యుమెంటరీలు తీస్తున్నపుడు.. హత్యలు చేసిన వ్యక్తి గురించి, వాళ్ల మానసిక పరిస్థితి గురించి వివరిస్తారు. కానీ, ఇందులో జాలీ మానసిక పరిస్థితి గురించి చెప్పలేదు. డబ్బున్న కుటుంబానికి చెందిన జాలీ ఆస్తి కోసం హత్యలు ఎందుకు చేసిందనేది ప్రశ్నార్ధకంగా నిలుస్తుంది ఈ డాక్యుమెంటరీ చూసిన వాళ్లకి. జాలీ జైలుకు వెళ్లిన తర్వాత జాలీ కుటుంబం ఎలా ఉందన్న విషయం మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది.
కామెడీ పండలేదు
టైటిల్ : ఎయిటీస్ బిల్డప్
డైరెక్షన్ : కల్యాణ్
కాస్ట్ : సంతానం, ఆర్ రాధిక ప్రీతి, సుందరరాజన్, కె.ఎస్. రవికుమార్, ఆనందరాజ్, ఆడుకలమ్ నరేన్
లాంగ్వేజ్ : తమిళం
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
కోలీవుడ్ లో కమెడియన్ సంతానం తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. కామెడీ ప్రధానంగా సాగే కంటెంట్ తో ఈ సినిమా తీశారు. ఈ కథ1980 కాలంలో నడుస్తుంటుంది. జమిందారీ ఫ్యామిలీకి చెందిన కల్యాణ్ (సంతానం)కమల్ హాసన్‌కి వీరాభిమాని. ఆయన సినిమా వచ్చిందంటే చాలు ఆ ఊళ్లో ఉన్న థియేటర్‌కి వెళ్లి, అక్కడ స్నేహితులతో కలిసి హడావిడి చేస్తుంటాడు. ఇదిలా ఉంటే కల్యాణ్‌కి, అతని చెల్లెలు పంకజానికి అస్సలు పడదు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు పందాలు కట్టుకుంటుంటారు. ఎవరికి వాళ్లు ‘నేనే గెలవాలి’ అని పోటీ పడుతుంటారు. తల్లిలేని ఈ ఇద్దరూ తాతనానమ్మల దగ్గర పెరుగుతారు.
కల్యాణ్ - పంకజం తండ్రి ( ఆడుకలమ్ నరేన్) ఎప్పుడూ తాగిన మైకంలోనే ఉంటాడు. తాత నాదముని (సుందరరాజన్) పూర్వీకులు బ్రిటిష్ వాళ్లకి చిక్కకుండా తమ దగ్గరున్న బంగారాన్ని, వజ్రాలను సీక్రెట్‌గా ఒకదగ్గర దాస్తారు. దానికి సంబంధించిన మ్యాప్‌ను ఒక కత్తి ‘పిడి’లో దాచిపెడతారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. కానీ ఒక ముఠాకు తెలుస్తుంది. ఆ ముఠాలో మన్సూర్ అలీఖాన్, మనోబాల, రాజేంద్రన్ సభ్యులు. ఈ ముగ్గురూ ఒకరోజు జమిందారు బంగ్లాకు వస్తారు. ‘మీ ఇంట్లో ఉన్న తాతల కాలం నాటి కత్తి ఇస్తే, వజ్రాలు ఇస్తామ’ని నాదమునికి ఆశ పెడతారు. కత్తిని చూపిస్తానని చెప్పిన నాదముని ఆ వజ్రాలను మింగుతాడు. కానీ అదే టైంలో కరెంట్ షాక్ కొట్టి చనిపోతాడు. యముడు (కేఎస్ రవికుమార్) చిత్రగుప్తుడు (మునీశ్ కాంత్) నాదముని ఆత్మను తీసుకెళ్లేందుకు వస్తారు.
దూరపు బంధువు అయిన దేవి (రాధిక ప్రీతి) నాదమునిని చూడటానికి వస్తుంది. తొలిచూపులోనే ఆమెపై మనసు పడతాడు కల్యాణ్. సాయంత్రంలోగా ఆమెతో ‘ఐ లవ్ యూ’ చెప్పించుకోమని అతనితో చెల్లెలు పందెం కాస్తుంది. ఈ అన్నాచెల్లెళ్ల పందెంలో ఎవరు గెలుస్తారు? ఆంటోని ముఠా ప్లాన్ పారుతుందా? దేవితో కల్యాణ్ పెళ్లి జరుగుతుందా? అనేది మిగతా కథ.
కామెడీ కథను ఒక బంగ్లా చుట్టూ తిప్పొచ్చని దర్శకుడు కల్యాణ్ నిరూపించాడు. కాకపోతే ఆ బంగ్లాలోకి ఎక్కువ పాత్రలను ప్రవేశపెట్టడం వల్ల అక్కడ గందరగోళ వాతావరణం ఉంటుంది. తమిళంలో కామెడీని తెలుగు డైలాగ్స్‌తో పండించడం కష్టం.