ధరణి గాయాలకు శాశ్వత మందు

ధరణి పేరుతో ఉత్పన్నమైన అనేక భూసమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సర్కారు కార్యాచరణ మొదలుపెట్టింది. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆర్వోఆర్‌‌‌‌-2020 చట్టం, ధరణి పోర్టల్‌‌‌‌తో ఏర్పడిన సమస్యలన్నింటికీ పరిష్కారం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌‌‌‌ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువస్తున్నది.  బీఆర్ఎస్​ నాయకులు ధరణి పేరుతో  చేసిన గాయానికి మందు వేసేందుకు ప్రజా ప్రభుత్వం భూ వ్యవహారాల నిపుణులు, రెవెన్యూ ఎక్స్​పర్ట్స్,  అఖిలపక్ష నాయకులు,  రైతులు,  ప్రజలు ఇలా.. అందరి అభిప్రాయాలతో  కొత్త చట్టం రూపకల్పన చేస్తున్నది.  సీఎం రేవంత్​ రెడ్డి నేతృత్వంలోని  ప్రజాప్రభుత్వం అందరి అభిప్రాయాలతో కొత్త చట్టం తెస్తున్నది.  

కొత్తచట్టం రూపకల్పనలో నిష్ణాతులు

గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్​.. భూరికార్డుల ప్రక్షాళన, డిజిటలైజేషన్​ పేరుతో భూముల హక్కులు, రూపురేఖలే మార్చేశారు. సగటు రైతు భూమి హక్కులను ధరణి పోర్టల్ పేరుతో విదేశీ కంపెనీ చేతిలో పెట్టేశారు. చట్టం అనేది ప్రజలకు మేలు చేసేలా, వారి హక్కులకు రక్షణ కల్పించేలా, అందరి అభిప్రాయాలను తీసుకురావాలి. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం తీసుకురాబోయే కొత్త చట్టంకోసం లోతైన అధ్యయనం చేస్తున్నది. భూమి చట్టాల విషయంలో నిపుణుడిగా అనుభవం ఉన్న.. భూమి సునీల్‌‌‌‌కుమార్‌‌‌‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. ఆయనతోపాటు సీసీఎల్‌‌‌‌ఏ నవీన్‌‌‌‌ మిత్తల్, సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్‌‌‌‌ వి.లచ్చిరెడ్డి కొత్త చట్టం రూపకల్పనలో భాగస్వాములయ్యారు. 18 రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఆర్వోఆర్‌‌‌‌ చట్టాలను అధ్యయనం చేసి.. వాటిలో తెలంగాణకు మేలు చేకూర్చే అంశాలపై వీరు దృష్టి పెట్టి.. 23 పేజీలతో ముసాయిదా చట్టాన్ని రూపొందించారు. ఇందులో అనేక అంశాలను జోడించారు. తెలంగాణకు1936,1948,1971, 2020లలో చేసిన ఆర్వోఆర్‌‌‌‌ చట్టాలు ఉన్నాయి. వాటి అమలులో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొత్త చట్టం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలాల సర్వేకు సంబంధించిన కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నియమావళి రూపొందిస్తోంది. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చే మార్పులకు అనుగుణంగా చట్టసవరణలు చేయాల్సిన అవసరం లేకుండా అమలుచేసే వెసులుబాటు కల్పించారు. 

రైతులకు ఇబ్బంది లేకుండా..

రైతులతోపాటు ప్రభుత్వ అవసరాలు తీరాలన్నా, సమస్యలు పరిష్కారం కావాలన్నా భూమి హక్కుల రికార్డులు పక్కాగా ఉండాలి. అయితే బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఆర్వోఆర్‌‌‌‌-2020 చట్టం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి.  ఏ ఆర్వోఆర్‌‌‌‌ చట్టంలోనైనా మూడు కీలకాంశాలు ఉంటాయి. 1) హక్కుల రికార్డును తయారు చేయడం. 2) ఎవరికి ఏవిధంగా హక్కులు సంక్రమించినా రికార్డుల్లో నిక్షిప్తం చేయడం. 
3) తప్పులు ఉంటే సవరించడం లాంటివి ఉంటాయి. 2020 చట్టంలో వీటిలో అలాంటివి లేవు. దీంతో భూ యజమానులకు అనేక సమస్యలు ఏర్పడ్డాయి. కాబట్టి, ఇకపై ఇలాంటి అంశాలపై రైతులు, భూ యజమానులు కోర్టులకు వెళ్లాల్సిన అవసరం ఉండకుండా రికార్డుల తయారీలో వెసులుబాటు కల్పిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువస్తున్నది. ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోయే కొత్త చట్టానికి సంబంధించిన ముసాయిదా బిల్లుపై ప్రజల నుంచి రెవెన్యూశాఖ సలహాలు, సూచనలు కోరింది. ఇందు కోసం సీసీఎల్‌‌‌‌ఏ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌తోపాటు ఒక ఈ-మెయిల్‌‌‌‌ను అందుబాటులో ఉంచింది. చాలామంది వారి వారి అభిప్రాయాలు మెయిల్​ చేశారు.  ప్రభుత్వం ప్రస్తుతం  వాటిని నిశితంగా పరిశీలిస్తున్నది.  త్వరలో రాబోయే కొత్త చట్టం ద్వారా గత భూఅక్రమాలపై కూడా ప్రభుత్వం పారదర్శకత, చిత్తశుద్ధితో విచారణ జరిపిస్తుంది. 

- కమల్​ మేడగోని, టీపీసీసీ మీడియా కన్వీనర్