మరీ ఇంత దుర్మార్గమా ?.. కేంద్ర బడ్జెట్​లో తెలంగాణ ఊసేది?: సీఎం రేవంత్​రెడ్డి

  • సబ్​ కా వికాస్​ ఓ బోగస్​
  • రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఇవ్వలే
  • ఇది వివక్ష మాత్రమే కాదు.. ముమ్మాటికీ కక్షే: సీఎం రేవంత్​రెడ్డి
  • గుజరాత్​కు సబర్మతి రివర్ ఫ్రంట్, బుల్లెట్ ట్రైన్ ఉన్నప్పుడు తెలంగాణకు ఉండొద్దా?
  • మూసీ రివర్ ఫ్రంట్​, ట్రిపుల్ ఆర్ కోసం నిధులు ఎందుకు ఇవ్వరు?
  • తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇస్తే బీజేపీ ఇచ్చిందేంది? 
  • ప్రధాని పదవి కోసం ఏపీ, బిహార్​ పాలకులతో మోదీ క్విడ్​ ప్రో కో
  • తెలంగాణపై ఇదే వివక్ష కొనసాగితే మరో ఉద్యమం
  • కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రిజైన్​చేయాలని డిమాండ్​
  • రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నేడు అసెంబ్లీలో ప్రత్యేక చర్చ 
  • చర్చలో కేసీఆర్ పాల్గొని తన వైఖరేంటో చెప్పాలన్న సీఎం రేవంత్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్​లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు.  విభజన చట్టాన్ని చూపి ఆంధప్రదేశ్​కు వేల కోట్లు ఇచ్చిన ఎన్డీయే ప్రభుత్వం.. అదే విభజన చట్టంలో ఉన్న తెలంగాణకు ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు గానీ, ప్రత్యేక ఫండ్​గానీ ఇవ్వకపోవడం దుర్మార్గమని అన్నారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీని మేము పెద్దన్నగా గౌరవిస్తే.. ఆయన మాపై ఇంతలా  కక్ష చూపుతారా? ఇది పూర్తిగా కుర్చీ బచావో బడ్జెట్. మోదీ తన ప్రధాని పదవిని కాపాడుకునేందుకు ఏపీ, బిహార్​ పాలకులతో క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారు” అని విమర్శించారు.

సీఎం రేవంత్​ రెడ్డి మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను దోచి బిహార్, ఆంధ్రప్రదేశ్​కు నిధులు ఇచ్చారని.. ఇది ‘నాయుడు, నితీశ్​ డిపెండెడ్ అలయెన్స్​ (ఎన్డీయే)’ బడ్జెట్ అని ఫైర్​ అయ్యారు. కిషన్ రెడ్డి మౌనంతో, బానిస మనస్తత్వంతో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. 

పార్లమెంట్​లో నిరసన తప్పదు

తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్ లో మిగితా ఎంపీలను కలుపుకుపోయి కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలుపుతారని సీఎం రేవంత్​ చెప్పారు. ‘‘తెలంగాణపై మోదీ కక్షపూరిత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతున్నది. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుత. తెలంగాణపై కేంద్రం వివక్ష ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదు. 

కేంద్రం వివక్షపై అసెంబ్లీలో చర్చ

‘‘కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల అనంతరం ప్రత్యేక చర్చ పెడ్తం. అప్పుడు ఎవరు.. ఏమిటో తెలిసిపోతుంది. తెలంగాణ హక్కుల కోసం, న్యాయంగా రావాల్సిన నిధుల కోసం  శాసనసభలో  జరగనున్న ఈ చర్చలో మాజీ సీఎంగా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పాల్గొనాలని సూచన చేస్తున్నా.. ఆయన వస్తారో, లేదంటే కేసీఆర్ కూడా మోదీకి  మోకరిల్లుతారో తెలుస్తుంది..’’ అని రేవంత్​ అన్నారు. బుధవారం అసెంబ్లీలో తీర్మానం చేయించి మోదీకి పంపిస్తామని తెలిపారు.

‘‘వికసిత్ భారత్ 2047 బడ్జెట్ లో తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించింది. స్వయంగా నేను 3 సార్లు ప్రధాని మోదీని కలిసి తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరాను. కేంద్రంతో ఎలాంటి వివాదాలు లేకుండా సత్సంబంధాలు కలిగి ఉంటూ తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశాను. నాతో పాటు డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రులు కూడా ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను, సంబంధిత అధికారులను కలిశాం. మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు పెద్దన్నలా వ్యవహరించాలని, తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరాను. కానీ ఆయన చివరికి రాష్ట్రానికి అన్యాయం చేశారు’’ అని సీఎం రేవంత్​ మండిపడ్డారు.  మోదీకి తెలంగాణపై  ఎంత కక్ష ఉందో తాజా బడ్జెట్​తో మరోసారి రుజువైందన్నారు. 

విభజన చట్టం మాకు వర్తించదా?

విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా ఏపీకి నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిందని, కానీ అదే చట్టం తెలంగాణకు వర్తిస్తుందనే విషయం ఎందుకు మరిచిపోయిందో చెప్పాలని సీఎం రేవంత్​ నిలదీశారు.  ఆ చట్టం ప్రకారమే తమకు నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్​చేశారు. ‘‘ఏపీకి నిధులు ఎందుకు ఇచ్చారని నేను అడగడం లేదు. కానీ.. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చినప్పుడు, తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నాం. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చినప్పుడు.. తెలంగాణలోని పాలమూరు స్కీమ్​కు నిధులు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాం. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి, రీజనల్ రింగ్ రోడ్డుకు, మెట్రో విస్తరణకు.. ఇలా ఏ విషయంలోనూ తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించలేదు. ఐటీఐఆర్ గురించి ప్రస్తావనే లేదు. 

తెలంగాణకు ఐఐఎం కావాలని కోరితే.. ఇవ్వబోమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాకు లేఖ రాశారు. ’’ అని రేవంత్​ అన్నారు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వబోమని కేంద్రం చెప్పినా... కిషన్ రెడ్డి ఇంకా కేంద్ర మంత్రివర్గంలో ఎందుకు కొనసాగాలని నిలదీశారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బానిస మనస్తత్వంతో కాకుండా తెలంగాణ పౌరులుగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేయాలని ఆయన అన్నారు. 

సబ్​కా వికాస్​ వట్టి బోగస్​

సబ్ కా సాత్ సబ్ కా వికాస్  అనేది బోగస్ నినాదంగా మార్చారని, వికసిత్ భారత్ లో తెలంగాణ భాగం కాదన్నట్లుగా ప్రధాని భావిస్తున్నారా? అని  సీఎం రేవంత్​ మండిపడ్డారు. ‘‘ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదు. బీజేపీకి తెలంగాణ నుంచి ఓట్లు, సీట్లు మాత్రమే కావాలి.. కానీ ఇక్కడి అభివృద్ధి మాత్రం పట్టదు. తెలంగాణ ప్రజలు మాత్రం బీజేపీపై ఎలాంటి వివక్ష చూపించకుండా 8 ఎంపీ సీట్లు, 35  శాతం ఓట్లు ఇస్తే.. బీజేపీ మాత్రం ఇక్కడి ప్రజలపై వివక్ష చూపించింది” అని అన్నారు. ఇప్పటికైనా సవరణ బడ్జెట్​లో తెలంగాణకు నిర్మలా సీతారామన్ న్యాయం చేయాలని, లేకపోతే బీజేపీకి  తెలంగాణలో నూకలు చెల్లినట్లేనని హెచ్చరించారు. 

కాగా, కేంద్రం నుంచి నిధులు రాకున్నా రాష్ట్రంలో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఆపకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని సీఎం చెప్పారు. వాటిని ఎలాగైనా పూర్తిచేసి తీరుతామని స్పష్టంచేశారు. 

తెలంగాణకు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ ఇవ్వలేదు. 

దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.  తెలంగాణపై మోదీ కక్షపూరిత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతున్నది. ఈ వివక్షపై తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుత. తెలంగాణపై కేంద్రం వివక్ష ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదు. ఇలాంటి వివక్ష గతంలో చూపడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ప్రజలు ఇలాంటి వివక్షలను, కక్షలను సహించరు.- సీఎం రేవంత్​ రెడ్డి