సమర్థుడి కోసం అన్వేషణ..టీయూ వీసీ పోస్ట్​భర్తీకి కసరత్తు

  • మొత్తం 133 మంది దరఖాస్తు 
  • జల్లెడ పట్టిన సెర్చ్​ కమిటీ
  • ముగ్గురు పేర్లతో ఫైల్​ రెడీ
  • నేతల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణ   

నిజామాబాద్, వెలుగు : తెలంగాణ వర్సిటీ వీసీ పోస్టు నియామకం ఫైనల్​ స్టేజ్​కు చేరింది.  ఈ పదవి కోసం మొత్తం 133 మంది దరఖాస్తు చేయగా వారిలో అర్హుల ఎంపిక కోసం సెర్చ్​ కమిటీ తీవ్రంగా శ్రమించింది. ఫైనల్​గా ముగ్గురి పేర్లతో ఫైల్​ను సెర్చ్​కమిటీ గవర్నమెంట్​కు పంపిది.15 రోజులలో స్టేట్​లో ఖాళీగా ఉన్న వర్సిటీలకు వీసీలను నియమిస్తామని సీఎం రేవంత్​రెడ్డి కూడా ప్రకటించడంతో టీయూలో వాతావరణం ఉత్కంఠగా మారింది.  వీసీ పోస్టును ఆశిస్తూ వర్సిటీకి చెందిన ఆరుగురు ప్రొఫెసర్లు దరఖాస్తు చేశారు.  ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న వారు లీడర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.  ​

పలు దఫాలు ఇంటెలిజెన్స్​ విజిట్

ప్రొఫెసర్​గా పదేండ్ల అనుభవం ఉండి 70 ఏండ్లలోపు వయస్సు గల వారినే వీసీలుగా అపాయింట్​ చేస్తారు. ఈ రెండు అంశాల ప్రాతిపాదికన ఎంత మంది చేసుకున్నా అకడమిక్​, అడ్మినిస్ట్రేషన్​ రంగాల్లో పదవిని ఆశిస్తున్నవారి సమర్థతను సెర్చ్​కమిటీ పరిశీలిస్తుంది. వర్సీటీ నుంచి రిజిస్ట్రార్​ యాదగిరి, ప్రొఫెసర్​ విద్యావర్థిని, ప్రొఫెసర్​ అరుణ, ప్రొఫెసర్​ నసీం, ప్రొఫెసర్​ అత్తర్​సుల్తానా, ప్రొఫెసర్​ కనకయ్య దరఖాస్తు చేసుకున్నారు. వీరి అర్హతలను సెర్చ్​ కమిటీ పరిశీలించింది. అనుమానాల నివృత్తికి ఇంటెలిజెన్స్​ నివేదికలు తెప్పించుకుంది. ఓయూలో పనిచేస్తున్న ఒక ప్రొఫెసర్​ విషయంలో వివరాల సేకరణ కోసం జిల్లాకు మూడు సార్లు ఇంటెలిజెన్స్​ ఆఫీసర్లు హైదరాబాద్​ నుంచి వచ్చి వెళ్లారు.

 కామారెడ్డి జిల్లాకు చెందిన జేఎన్టీయూలో మెకానికల్ ప్రొఫెసర్, జర్నలిజం అండ్​ మాస్​ కమ్యూనికేషన్స్​ ఆచార్యుడి పేర్లు ఫైనల్​ పరిశీలనలో సెర్చ్​ కమిటీ చేర్చినట్లు తెలుస్తోంది. పొలిటికల్​ సైన్స్​ విభాగంలో రిటైర్డ్​ ప్రొఫెసర్​తో పాటు వర్కింగ్​ ప్రొఫెసర్​ ఒకరు వీసీ పోస్ట్​ కోసం తమ వర్గం నేతతో పైరవీలు చేస్తున్నారు. మరో వర్గం నేతను పట్టుకొని కోరుట్లకు చెందిన కాకతీయ ప్రొఫెసర్ ఒకరు, కెమిస్ట్రీ డిపార్ట్​మెంట్​లో రిటైరైన  మరో ప్రొఫెసర్​ ప్రయత్నాలు ​చేస్తున్నారు.   గవర్నమెంట్​ మాత్రం సమర్ధుడిని అపాయింట్​ చేయాలని డిసైడైంది. 

21 పోస్టులు ఖాళీ

ఆర్టీయూకేటీ, తెలంగాణ మహిళా వర్సిటీ మినహా స్టేట్​లోని పది వర్సిటీలకు మే 21న వీసీ పోస్టులు ఖాళీ అయ్యాయి.  ఈ పోస్టులను భర్తీ చేయడానికి కాంగ్రెస్​ గవర్నమెంట్​ ఏర్పడిన వెంటనే జనవరిలో నోటిఫికేషన్​ జారీ అయింది.  ఇంతలో పార్లమెంట్​ ఎలక్షన్​ కోడ్​ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఈసీ పర్మిషన్​ పొందాక ఫిబ్రవరి 17న గవర్నమెంట్​ ముగ్గురు సభ్యులతో కూడిన సెర్చ్​ కమిటీని అపాయింట్​ చేసింది. ఇందులో టీయూ తరపున ప్రొఫెసర్​ సులేమాన్​సిద్ధిఖీ, యూజీసీ నుంచి రాజేశ్వర్​ సింగ్​ ఛందేల్​, గవర్నమెంట్​ చీఫ్​ సెక్రటరీ శాంతికుమారి  ఉన్నారు.  

టీయూ వీసీ పదవికి మొత్తం 133 మంది దరఖాస్తులు చేయగా సెర్చ్​ కమిటీ వడపోత షురూ చేసింది. వీసీ హోదాలో రవీందర్​గుప్తా అవినీతి వ్యవహారాలు స్టేట్​ లెవల్​లో వర్సిటీకి మచ్చతెచ్చాయి. జిల్లాలోని ఓ కాలేజీ మేనేజ్​మెంట్​ నుంచి లంచం తీసుకుంటూ గత యాడాది జూన్​ 17న ఆయన ఏసీబీకి పట్టుబడి జైలుకు వెళ్లారు. అప్పటి నుంచి ఇన్​చార్జ్​ వీసీలు కొనసాగుతున్నారు. తెలంగాణ పేరుతో స్థాపించిన వర్సిటీ ఖ్యాతిని విస్తరించే పాలనాదక్షుడి వేటలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఎవరు ఎన్ని  పైరవీలు చేసినా సమర్థుడినే సెలెక్ట్​ చేయాలనే నిర్ణయంలో గవర్నమెంట్​ ఉంది. ఈ క్రమంలో భారీ కసరత్తు చేసినట్లు స్పష్టమవుతోంది.