కేంద్ర మంత్రులను కలిసిన ట్రిపుల్ ఆర్ బాధితులు 

చౌటుప్పల్, వెలుగు : ఉత్తరభాగంలోని ట్రిపుల్ ఆర్ అలైన్​మెంట్ మార్చాలని చౌటుప్పల్, భువనగిరి, వలిగొండ, గజ్వేల్ భూ నిర్వాసితులు గురువారం వేర్వేరుగా ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిశారు.  కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను కలిశారు.  అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ట్రిపుల్​ఆర్​బాధితులు కలిశారు. ట్రిపుల్ ఆర్ అలైన్​మెంట్​ను మార్చాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

ఉత్తర భాగం ఆలైన్​మెంట్​ను 28 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లకు మార్చాలని కోరారు. కేంద్ర మంత్రులను కలిసినవారిలో భూ నిర్వాసితుల సంఘం కన్వీనర్ చింతల దామోదర్ రెడ్డి, బాధితులు గుజ్జుల సురేందర్ రెడ్డి, మారుపాక లింగంగౌడ్, దబ్బటి రాములుగౌడ్, జాల వెంకటేశ్​యాదవ్, బోరం ప్రకాశ్ రెడ్డి, కొడారి నర్సింగరావు, అనిల్ రెడ్డి ఉన్నారు.