World Tourism Day 2024 : తెలంగాణ పర్యాటక రంగం.. టూరిస్ట్​ప్రాంతాలు ఇవే..

World Tourism Day 2024 : ప్రపంచవ్యాప్తంగా పర్యాటకరంగం ఎంతో అభివృద్ది చెందింది.   తెలంగాణలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, ప్రతి యాత్రికుడు పచ్చని తోటలు మరియు అద్భుతమైన తీరాలను ఆస్వాదించే అవకాశాన్ని అందిస్తుంది. రాష్ట్రం అందమైన ప్రకృతి అందాలు మరియు ఉత్కంఠభరితమైన ప్రశాంతతను కలిగి ఉంది.  గొప్ప చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నగరాలు ఉన్నాయి. సెప్టెంబర్ 27  ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ప్రసిద్ది గాంచిన టూరిస్ట్​ ప్లేస్​ల గురించి తెలుసుకుందాం.. ..

గిరిజనులకు వరం... పులిగుండాల

వేల ఎకరాల అటవీ ప్రాంతంలో గిరిజన రైతుల వ్యవసాయానికి కావాల్సిన నీళ్లు పులిగుండాల ప్రాజెక్ట్ నుంచి అందుతున్నాయి. గిరిజనుల పాలిట వరమైన ఈ ప్రాజెక్టు ఖమ్మం  నుంచి 75 కిలోమీటర్ల దూరంలో, పెనుబల్లి మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇప్పుడిప్పుడే పర్యాటకులను  ఆకర్షిస్తున్న పులిగుండాల మంచి టూరిస్ట్ ప్లేస్.  పులిగుండాల ప్రాజెక్టు వద్ద వీకెండ్స్ సరదాగా గడపడానికి వెళ్తున్న టూరిస్ట్ సంఖ్య  పెరిగింది. పిల్లలు, పెద్దలు ఉదయం నుంచిసాయంత్రం వరకు సరదాగా గడుపుతున్నారు.పులిగుండాల ప్రాజెక్ట్ అటవీ ప్రాంతంలో 'సన్య ప్రాణుల పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.  ఈ ప్రాంతంలో వన్యప్రాణుల పార్కు ఏర్పాటుచేస్తే వన్యప్రాణులకు వేటగాళ్ళ నుండి ప్రమాదం వుండదు. ఈ పార్క్ వల్ల ఆ ప్రాంతంలో ఉండే గిరిజనులకు   ఉపాధి లభిస్తుంది.

పోచారం అభయారణ్యం..

కామారెడ్డి, మెదక్ జిల్లాల సరిహద్దుల్లో ... నాగిరెడ్డిపేట మండలం పోచారం సమీపంలో అభయారణ్యం ఉంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి 50కిలో మీటర్లు.. మెదక్​కు  పది కిలోమీటర్ల దూరంలో ఈ అభయారణ్యం ఉంది.నిజాం పాలన కాలంలో నవాబు ఆయా ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సేదతీరడంతో పాటు, వేటాడేందుకు గాను దీన్ని ఏర్పాటు చేశారు. 1952లో దీన్ని అభయారణ్యంగా గుర్తించారు. రెండు జిల్లాల పరిధిలో 13వేల హెక్టార్లలో అభయారణ్యం విస్తరించి ఉంది. 164 హెక్టార్లలో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జింకలతో పాటు నెమళ్లు, కొండ గొర్రెలు, నీలుగాయిలు, ఏదులు సంచరిస్తుంటాయి. అభయారణ్యం విస్తరించి ఉన్న ఏరియాలో చిరుతలు కూడా సంచరిస్తుంటాయి.

అభయారణ్యంలోనికి  వెళ్లేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. ప్రవేశ ద్వారం వద్ద పార్క్ ఉంటుంది. ఇక్కడ చెట్లు, పూల మొక్కల మధ్య తాళ్లతో నడిచే ఊయలలు ఏర్పాటుచేశారు. ఇక్కడున్న . టవర్​ పైకి ఎక్కి పరిసరాలను చూడొచ్చు. రోడ్డుపై ఉన్న ప్రధాన ద్వారం నుంచి లోపలికి వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నడుచుకుంటూ వెళ్లే వారికి అనుమతి లేదు. జంతువులు దాడి చేస్తాయనే ఉద్దేశంతో వాహనంలో వెళ్లేవారికి మాత్రమే అనుమతినిస్తారు. అభయారణ్యానికి దగ్గర్లోనే పోచారం ప్రాజెక్ట్ కూడా ఉంది.ఎలా వెళ్లాలంటే.. హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్లాలి. అక్కడ్నుంచి అభయారణ్యానికి ఉన్నరోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

ఉమా మహేశ్వరం

నల్లమలకు వెళ్తే అద్భుతమైన ప్రకృతి సోయగాన్ని, అడవి అందాన్ని చూడొచ్చు. శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్లే దారిలో.. తెలంగాణ రాష్ట్రంలో  ఉమా మహేశ్వర క్షేత్రం ఉంది. 11వ శతాబ్దంలో ఉన మహేశ్వరాన్ని నిర్మించారని చెప్తారు. ఈ క్షేత్రానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్నాటక, మహారాష్ట్ర నుంచి కూడా నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. పచ్చటి అడవుల మధ్యన, కొండపైన ఉన్న ఆలయంలో ఉమా మహేశ్వరుడు కొలువై ఉన్న ఈ క్షేత్రం ఏ కాలంలో అయినా చల్లగానే ఉంటుంది.  ఈ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించాలంటే..  హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారి మధ్యలో ...హైదరాబాద్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉమా మహేశ్వరాలయం ఉంది. కొండపైకి వాహనాలు వెళ్లే అవకాశం కూడా ఉంది. 

భీముని జలపాతం

దట్టమైన అటవీ ప్రాంతం.. . చుట్టూ ఎత్తైన కొండలు, పక్షుల కిలకిలలు. సాయంత్రం వేళ అడవి జంతువుల అరుపులు, వర్షాకాలంలో ఎత్తైన గుట్ట మీది నుంచి పాదం మధ్యలో జాలువారే వాటర్ ఫాల్స్.. ఇలా ప్రకృతిని అస్వాదించాలంటే భీమునిపాదం జలపాతం దగ్గరికి పోవాల్సిందే. మానుకోట జిల్లాలో ఏకైక పర్యాటక ప్రాంతంగా దీన్ని చెప్పుకుంటారు. వర్షాకాలం వచ్చిందంటే పర్యాటకులకు గొప్ప ఎక్సపీరియెన్స్ ఇస్తుంది. 

చరిత్రకు నిలయం ... పానగల్

నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్ కి వెళ్తే.. ప్రకృతిని ఆస్వాదిస్తూ చరిత్రను చదువుతున్నట్టే ఉంటుందంటే.. అవి ఉత్త మాటలు కావు. ప్రాచీన చరిత్ర, కాకతీయుల కళా వైభవానికి ప్రతిరూపంగా నిలుస్తున్నాయి.  పానగల్ లోని ఆలయాలు, క్రీస్తుశకం 12వ శతాబ్దంలో కాకతీయుల సామంత రాజులైన కందూరి చోళులు పానగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటికాలంలో పానగల్లులో పచ్చల సోమేశ్వర ఆలయం. ఛాయా సోమేశ్వర ఆలయాలు నిర్మించారు. అవి నేటికీ చెక్కు చెదరకుండా అద్భుత శిల్పకళా సంపదతో ఉన్నాయి. నల్ల శానపు రాళ్లతో సుందరంగా నిలిచిన శిల్పాలు, ఆలయాలు, బొమ్మలు నాటి మధ్యయుగ శిల్ప సంప్రదాయాలకు అద్దం పడుతున్నాయి.

ఛాయా సోమేశ్వర ఆలయం

పానగల్లు రాజధానిగా కుందూరు చోళులు క్రీస్తుశకం 1040 నుంచి 1290 వరకు నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న రాజ్యాన్ని పరిపాలించారు. వారి కాలంలోనే ఛాయా సోమేశ్వరాలయాన్ని నిర్మించారు. ఆలయంలో లభించిన ఒక శాసనం క్రీస్తుశకం 1290 నాటి కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుని పేరున ఉంది. అది త్రికూటాలయంగా మూడు గర్భగుళ్లతో ఉంటుంది. తూర్పు ముఖం ఉన్న గర్భగుడి మధ్యలో శివలింగంపై ఎప్పుడూ ఒక నీడ పడుతూ ఉంటుంది. దీన్ని ఇప్పటికీ ఆర్కిటెక్​ లు, భక్తులు ఒక అద్భుతంలా చూస్తారు. ఈ ప్రత్యేకత వల్లనే దీనికి ఛాయా సోమేశ్వర ఆలయం అన్న పేరు వచ్చింది

పచ్చల సోమేశ్వర ఆలయం

పానగల్లులో చూడాల్సిన మరో అద్భుతం పచ్చల సోమేశ్వర ఆలయం. తూర్పు వైపు ఒక ఆలయం, పశ్చిమ వైపు మూడు ఆలయాలు, 70 స్తంభాలతో మహా మండపం ఉన్న అద్భుతమైన కట్టడం ఈ ఆలయం. ఆలయం గోడలపైన, స్తంభాల పైన చెక్కిన శివ, అష్టదిక్పాలక, భారత రామాయణ గాథలు, సమకాలీన జీవన విధానాన్ని తెలిపే శిల్పాలు చూపరులను ఎంతో ఆకర్షిస్తాయి. ఆలయాల బయటి గోడలపైన వినాయక, కుమారస్వామి, మహిషాసుర మర్దిని వంటి శిల్పాలు ఆనాటి శిల్పుల పనితనాన్ని తెలియజేస్తాయి.ఆలయానికి ఉత్తరం వైపున ఉదయ సముద్రం చెరువు ఉంది. క్రీ.శ. 1124లో ఉదయన చోడుడు అనే రాజు ఈ చెరువును తవ్వించాడు. ఇప్పటికీ  నల్లగొండ పట్టణానికి మంచి నీళ్లు, వేలాది ఎకరాల పంట పొలాలకు సాగు నీరు ఈ చెరువు నుంచే అందుతున్నాయి. పచ్చల సోమేశ్వర ఆలయం వెనుక భాగంలోనే ఉన్న మ్యూజియంలోకి వెళితే ఒక్కసారి చరిత్రను చుట్టేసి రావొచ్చు,

రాయకల్ జలపాతం

అడవులు, కొండలు, గుట్టలు, జలపాతాలు ఉన్న ప్లేసులకి వెళ్తే ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఎన్ని వేశాలు తిరిగినా టూరిజం అంటే ఎప్పుడైనా గుర్తొచ్చేది ప్రకృతి అందాలే. అలాంటి ప్రకృతి అందం రాయకల్ జలపాతం దగ్గరికెళ్తే కనిపిస్తుంది. ఆ ప్రకృతి అందాన్ని అస్వాదించడానికి ఎంతో దూరం వెళ్లక్కర్లేదు కూడా. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయకల్ ఊరి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో పెద్ద గట్లు, రాయకల్ జలపాతం ఉన్నాయి. ఈ దారంతా ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణించొచ్చు. మోహిన్ చెరువుని అనుకుని ఉండే  కొండ, పక్కనే నమిల్ల కొండ, గొలుసుకట్టు గుట్టల అందాలు ఈ దార్లో చూసి తీరాల్సిందే. రాయకల్ దగ్గరికెళ్తే.. కొండమీది నుంచి పోస్తున్నట్టు తెల్లగా కిందపడే నీళ్లు చూస్తూ ఉండిపోవచ్చు. కిందపడుతున్నప్పుడు మధ్యలో బండలను తాకుతూ కింద పడే ఆ నీళ్లను తాగితే ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తారు. వర్షాకాలంలో నాలుగు నెలల పాటు ఈ జలపాతం కొండ మీది నుంచి దూకుతూ కనువిందు చేస్తుంది. ప్రకృతి అందాలను ఎంతలా తనలో దాచుకున్నా ఈ జలపాతానికి రావాల్సిన పేరైతే ఇంకా రాలేదు. ఇప్పుడిప్పుడే టూరిస్టుల రాక మాత్రం కనిపిస్తోంది. వరంగల్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల నుంచి జనం పెద్దసంఖ్యలో ఈ జలపాతాన్ని చూడటానికి వస్తున్నారు. 

సాగర తీరాన.. వైజాగ్ కాలనీ

నల్లగొండ  నుంచి 65 కిలోమీటర్ల దూరంలో వైజాగ్ కాలనీ ఉంది. దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలంలో కృష్ణా నది బ్యాక్ వాటర్ ను  అనుకుని ఉన్న కుగ్రామం ఇది. బ్యాక్ వాటర్ కావడంతో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదరకరంగా ఉంటుంది. నలువైపులా నల్లమల అడువులు.... గుట్టలతో కప్పేసినట్టుగా ఈ ప్రాంతం  కనిపిస్తుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కడుతున్నప్పుడు వైజాగ్​కు  చెందిన కొన్ని కుటుంబాలు ఇక్కడ స్థిరపడ్డాయి. దీంతో ఈ కాలనీకి వైజాగ్ కాలనీగా పేరొచ్చింది. వేసవి కాలంలో, చలికాలంలో టూరిస్టుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీకెండ్​ లో  టూరిస్టు ఎక్కువగా ఇక్కడికి వచ్చి పోతుంటారు. వాళ్ల కోసం కాలనీ వాసులే అన్ని ఏర్పాట్లుచేస్తుంటారు. కృష్ణా నదిలో బోటింగ్ కి వెళ్లే ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది.కృష్ణా నదిలో వేటాడిన చేపలతో చేసిన వంటకాలు ఇక్కడ ఫేమస్. తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ ప్లేస్ గా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఎకో టూరిజం ప్రాజెక్టు నిర్మించారు. 

ఏడు బావుల జలపాతాలు

బయ్యారం, గంగారం మండల సరిహద్దుల్లోని మిర్యాలపెంట గ్రామ సమీపంలో ఏడుబావుల జలపాతాలు ఉన్నాయి. చుట్టూ కొండలు, పచ్చటి అడవిలోని ఈ జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. పాండవుల గుట్టపై సహజసిద్ధంగా ఏర్పడ్డ ఏడుబావుల దగ్గర ఒక బావి నుంచి ఇంకో బావిలోకి నీళ్లు ప్రవహిస్తుంటాయి. ఈ ఏడుబావుల్లోకి నీళ్లు ఎలా వచ్చి చేరతాయన్నది ఇప్పటికీ రహస్యమే. ఇక్కడే ఇంకో అద్భుతం ఏంటంటే.. జలపాతం నుంచి కిందికి పడే నీళ్లు కొద్ది దూరం ప్రవహించి తరువాత కనిపించకపోవడం. పాలు ఉన్నట్టే ఎప్పుడూ తెల్లగా ఉండే నీళ్లు 50 అడుగుల ఎత్తు నుంచి పడుతుంటే చూసేందుకు కనులవిందుగా ఉంటుంది.

–వెలుగు, ప్రపంచ పర్యాటక దినోత్సవం స్పెషల్​‌‌–