స్పోర్ట్స్​ వర్సిటీలో 13 కోర్సులు

  • గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభించాలి
  • అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశం
  • స్కిల్  వర్సిటీ బోర్డు తరహాలో స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు
  • 2036  ఒలింపిక్స్​లో పతకాలే లక్ష్యంగా కొత్త స్పోర్ట్స్ పాలసీ 
  • క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలపై స్టడీ చేసి రిపోర్టు ఇవ్వాలని సూచన
  • స్పోర్ట్స్​ పాలసీ ముసాయిదాపై రివ్యూ

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ మోడల్​లో నిర్వహించాలన్నారు. ఇందుకోసం కూడా ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి చైర్మన్​ను నియమించాలని, యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండేలా బాధ్యతలు అప్పగించాలని సూచించారు. అధికారులు తయారు చేసిన కొత్త స్పోర్ట్స్​ పాలసీ ముసాయిదాపై శుక్రవారం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్ సమీక్షించారు. 

స్పోర్ట్స్ యూనివర్సిటీలో దాదాపు 13 కోర్సులు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రధానంగా చర్చించారు.వివిధ ఆటల్లో ప్రతిభ ఉన్న యువతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంగా ఎంచుకుందని సీఎం తెలిపారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అనుసరించాల్సిన అత్యుత్తమ విధానాలను క్రీడా పాలసీలో పొందుపరచాలని అధికారులకు సూచించారు. 

అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దటంతో పాటు అంతర్జాతీయస్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త స్పోర్ట్స్ పాలసీని తయారు చేయాలన్నారు. 2036 ఒలింపిక్స్ లో పతకాలే లక్ష్యంగా కొత్త పాలసీలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన సూచించారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలని ఆదేశించారు. కాగా.. క్రికెట్, హాకీ, ఫుట్​బాల్, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్

 జిమ్నాస్టిక్స్, అక్వాటిక్స్ లాంటి 14 క్రీడలను స్పోర్ట్స్ హబ్ లో పొందుపరిచారు. దాదాపు 7‌‌‌‌0 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గచ్చిబౌలి స్పోర్ట్స్​ స్టేడియంలో ఇప్పటికే వివిధ క్రీడలకు రెడీమేడ్ సదుపాయాలు ఉన్నందున.. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు వాటిని అప్ గ్రేడ్ చేసుకోనున్నారు.

ఒకే గొడుగు కిందికి స్పోర్ట్స్​ స్టేడియంలు

హైదరాబాద్​లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రముఖ క్రీడా మైదానాలు, స్టేడియంలు అన్నింటినీ స్పోర్ట్స్​ హబ్ పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. ఎల్బీ స్టేడియం, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్, కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్డేడియం, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం,  యూనివర్సిటీ సైక్లింగ్ వెలోడ్రమ్ లాంటివన్నింటినీ గుర్తించి.. ఒకే గొడుగు కిందికి తేవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ క్రీడల్లో ప్రతిభావంతులను గుర్తించటం నుంచి వారికి చదువులకు ఆటంకం లేకుండా..  

జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీలకు అవసరమైన ప్రావీణ్యం నేర్పించే క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లన్నీ పరిష్కరించేలా కొత్త పాలసీ ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. మన ప్రాంతంలో ఉన్న భౌగోళిక పరిస్థితులతోపాటు మన ప్రాంత యువతకు ఆసక్తి ఉన్న క్రీడలకే ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. దేశ విదేశాల్లో ఉన్న కోచ్​లను రప్పించాలని, అక్కడున్న యూనివర్సిటీల సహకారం తీసుకునేలా ఎంవోయూలు చేసుకోవాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలకు స్పష్టమైన విధానాన్ని అనుసరించాలని ఆయన తెలిపారు. 

ఏ స్థాయి పోటీల్లో విజయం సాధించిన వారికి ఎంత ప్రోత్సాహకం అందించాలి, ఎవరికి ఉద్యోగం ఇవ్వాలి.. అనే మార్గదర్శకాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ముసాయిదాకు సంబంధించి  పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి.. పలు మార్పులు చేర్పులను సూచించారు. సమీక్షా సమవేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, జితేందర్ రెడ్డి

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్  శివసేనారెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్​ రంజన్, క్రీడలు, యువజన అభ్యున్నతి శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీం పాల్గొన్నారు.  
6న ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి!

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 6న ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిసింది. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి మరోసారి సమగ్ర నివేదిక అందించి.. వరద సాయం ఇవ్వాలని కోరనున్నారు. దీంతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన రాష్ట్ర హోం మంత్రుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి రేవంత్ హాజరయ్యే అవకాశం ఉంది. అనంతరం కాంగ్రెస్ పెద్దలను కూడా సీఎం కలిసే చాన్స్ ఉన్నట్లు తెలిసింది.