ఆరోగ్య మిత్రల సమ్మె బాట

  • ఈ నెల 20లోగా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​
  • పదహారేళ్లుగా  ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులుగా సేవలు
  • బీఆర్​ఎస్​ సర్కారు తమ గోడు వినలేదని ఆవేదన   

నిర్మల్, వెలుగు : ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పని చేస్తున్న ‘ఆరోగ్యమిత్ర’ లు సమ్మెబాట పట్టనున్నారు. గత 16 ఏండ్లుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విన్నపాలు చేసుకున్నా.. ఆందోళనలు చేపట్టినా సర్కారు ఖాతరు చేయకపోవడంతో వారు సమ్మెకు సిద్దమయ్యారు.  ఈనెల 20లోపు తమ డిమాండ్లను నెరవేర్చాలని .. లేకపోతే సమ్మె తప్పదని స్పష్టం చేస్తున్నారు.  ఆరోగ్య మిత్రల సంఘం రాష్ట్ర  నేతలు  ఈ నెల 6న సమ్మె నోటీసు ఇచ్చారు.  

చాలని జీతాలు..భద్రత లేని  బతుకులు

ఆరోగ్యశ్రీ స్కీమ్​ను 2007లో  అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 900 మంది ఆరోగ్య మిత్రలను నియమించింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వీరికి   నెలకు రూ. 18 వేల  వేతనాన్ని ఇస్తున్నారు.  తమ వేతనాలు పెంచాలని, ఉద్యోగభద్రత కల్పించాలని చాలాకాలం నుంచి ఆరోగ్యమిత్రలు కోరుతున్నారు.  గతంలో వేతనాలు పెంచుతామని  ఆరోగ్యశ్రీ ట్రస్ట్ యాజమాన్యం హామీ ఇచ్చినా  అప్పటి బీఆర్​ఎస్​ సర్కారు నుంచి సానుకూలమైన స్పందన రాలేదు. దాంతో చాలీచాలని వేతనాలతోనే ఆరోగ్యమిత్రలు పని చేస్తున్నారు.

ప్రభుత్వం పట్టించుకోకపోయినా  కరోనా సమయంలో  ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ డ్యూటీ చేశారు.   బీఆర్ఎస్ సర్కారు దిగిపోయి ..   కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ సమస్యలు తీరుతాయని వారంతా ఆశలు పెట్టుకున్నారు.  డిసెంబర్ 8న సీఎం  రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించారు.  డిప్యూటీ సీఎం,  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి,  ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ సీఈవో కు కూడా వినతిపత్రాలు ఇచ్చారు.   పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా తమ గోడు ఎవరూ పట్టించుకోవడంలేదంటూ వారు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమయ్యారు.   

‘ఆరోగ్య మిత్ర’ల డిమాండ్లు ఇవే...

ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న   ఆరోగ్య మిత్రలను  రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని, తమకు  డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పించాలని వారు కోరుతున్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం వారి వేతనాన్ని  రూ. 22,750కు  పెంచాలని,  రాబోయే పీఆర్సీలో  కనీస వేతనాన్ని రూ. 35 వేలుగా  నిర్ణయించి, టీఏ,డీఏ ఇవ్వాలని,  వేతనాలను ఏజన్సీ ద్వారా కాకుండా  నేరుగా ట్రస్టు ద్వారా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఔట్  సోర్సింగ్ సిబ్బందిగాకాకుండా కనీసం  కాంట్రాక్ట్ ఎంప్లాయ్స్​గానైనా  ప్రకటించాలని,  మొదటినుంచి  పీహెచ్సీలలో పని చేస్తున్న వారిని ఇతర ఆసుపత్రులకు మార్చకుండా సంబంధిత  

పీహెచ్ సీల్లోనే కొనసాగించాలని కోరుతున్నారు. ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని,  విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి  ప్రభుత్వ కొలువు  ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లకు మద్దతు ఇవ్వాలని వారు  బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి  వినతిపత్రం ఇచ్చారు. నిర్మల్​లో ఆయనను కలిసి తమ  సమస్యలు పరిష్కారం అయ్యేలా  ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.  బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నేతలను కూడా  కలిసి మద్దతు  కోరతామని చెప్పారు.