- లడ్డూ ప్రసాదం, శేష వస్త్రం అందించిన ఆలయ ఈవో
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని బుధవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. అంతకుముందే ఆలయానికి వచ్చిన సీఎస్ శాంతి కుమారి స్వామివారిని దర్శించుకుని ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.
తర్వాత రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించి తొలిసారి ఆలయానికి వచ్చిన రాధాకృష్ణన్ కు సీఎస్ స్వాగతం పలికారు. మొదట క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని గవర్నర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు ఇచ్చారు. ఆలయ ఈవో భాస్కర్ రావు ఆయనకు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు.
సంతోషంగా ఉంది : గవర్నర్ రాధాకృష్ణన్
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. ఆలయాన్ని పూర్తిగా కృష్ణశిలతో పునర్నిర్మించారు. మరో వెయ్యేండ్ల పాటు చెక్కుచెదరకుండా ఆలయం ఉండేలా నిర్మాణం జరిగింది. రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించాను.