తెలంగాణకు 71 వేల 744 కోట్ల గ్రాంట్​ కావాలి: ఆర్థిక సంఘానికి రాష్ట్రప్రభుత్వం వినతి

  • 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి
  • ఫోర్త్​ సిటీకి  రూ.12,972  కోట్లు
  • మిషన్​ భగీరథకు రూ.11,996  కోట్లు   
  • మూసీ రివర్​ ఫ్రంట్​కు రూ.7 వేల కోట్లు
  • మున్సిపాలిటీల్లో అండర్​ గ్రౌండ్​ సీవరేజీ 
  • సిస్టమ్​కు రూ. 7,200 కోట్లు
  • స్కూల్స్​ అప్​గ్రేడేషన్​, గురుకుల విద్యాలయాల నిర్మాణానికి రూ. 4,500 కోట్లు
  • ప్రతిపాదనలను పనగరియా టీమ్​ ముందుంచిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు : తెలంగాణకు గ్రాంట్​ ఇన్​ ఎయిడ్​ కింద రూ.71,744 కోట్లు ఇప్పించాలని 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టేది, వాటికి గ్రాంట్​ కింద ఎంత మొత్తంలో కావాలో ఆర్థిక సంఘం చైర్మన్​ అర్వింద్​ పనగరియా టీమ్​కు వివరించింది. ఈ నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇందులో ప్రధానంగా ముచ్చర్లలో ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్​ సిటీ (ఫోర్త్​ సిటీ) గురించి ప్రస్తావించింది. ఈ నెట్​ జీరో సిటీకి రూ.12,972 కోట్లు కావాలని  ప్రతిపాదించింది.

దీంతో పాటు మిషన్ భగీరథ మంచినీటి పంపిణీ కోసం కూడా గ్రాంట్ ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. గతంలోనూ ఈ ప్రతిపాదన చేసినట్లు గుర్తుచేసింది. ఇంకా చాలా ఇండ్లకు మిషన్​ భగీరథ నీళ్లు అందడంలేదని, అదే సమయంలో నిర్వహణ కూడా చేయాల్సి ఉన్నందున ఇందుకు అవసరమైన మొత్తం రూ.11,996.77 కోట్ల కోసం కేంద్రానికి సిఫార్సు చేయాలని కోరింది. హైదరాబాద్​ సిటీ ఇన్నోవేటివ్​ అండ్​ ట్రాన్స్​ఫార్మేటివ్​ ఇన్​ఫ్రాస్ర్టక్చర్​ (హెచ్– సిటీ) కోసం రూ.7,800 కోట్ల గ్రాంట్​ను కోరుతూ ప్రతిపాదించింది. ఇక మున్సిపాలిటీల్లో అండర్​ గ్రౌండ్​ సీవరేజీ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్​ను కోరింది.

Also Read:-తెలంగాణలో 4 మెడికల్ కాలేజీలకు గ్రీన్​సిగ్నల్

రాష్ట్రవ్యాప్తంగా 142 యూఎల్​బీలలో కొత్తగా అండర్​ గ్రౌండ్​ సీవరేజీ సిస్టమ్​ నిర్మాణానికి రూ.7,200 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. రూ. లక్షన్నర కోట్లతో మూసీ రివర్​ ఫ్రంట్​ పేరుతో ప్రభుత్వం భారీ ప్రాజెక్ట్​ను టేకప్​ చేసిందని.. తెలంగాణ దశ దిశను మార్చడంతో పాటు ఎకానమికల్​గా ప్రపంచస్థాయిలో హైదరాబాద్​ను ప్రధాన నగరంగా గుర్తించేలా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని ఆర్థిక సంఘానికి వివరించింది. ఇందుకు గాను రూ.7 వేల కోట్లు కావాలని కోరింది.

వారసత్వ కట్టడాలు, చెరువుల సంరక్షణ కోసం రూ.1,000 కోట్లు అడిగింది. గురుకులాల నిర్మాణాల కోసం దాదాపు రూ.2 వేల కోట్లు,  వాటర్​ సప్లయ్​ ఇన్​ఫ్రాస్ర్టక్చర్​ క్రియేషన్​ కోసం రూ.2 వేల కోట్లు, ఇతర ప్రతిపాదనల కింద ఇంకో రూ.12,043 కోట్లు సిఫార్సు చేయాలని  కేంద్ర ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.