ఆటలు అదిరేలా..జేఎన్​ఎస్​ కు కొత్త హంగులు..!

  • ఇన్నాళ్లూ పట్టించుకోక అస్తవ్యస్తం
  • తాజాగా రూ.14.2 కోట్లతో డెవలప్ మెంట్ కు ప్రపోజల్స్​
  • తొందర్లోనే మారనున్న స్టేడియం రూపురేఖలు

హనుమకొండ, వెలుగు : రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంతోమంది క్రీడాకారులను అందించిన హనుమకొండలోని జవహార్ లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్​ఎస్) ఇన్నాళ్లూ నిర్లక్ష్యానికి గురైంది. సత్తా చాటే క్రీడాకారులున్నా సరైన ఫెసిలిటీస్ లేక నిర్వీర్యమైంది. పదేండ్లుగా పట్టించుకోక సమస్యలతో కునారిల్లిపోగా, డెవలప్ మెంట్ కోసం అధికారులు పంపించిన ప్రపోజల్స్ ను కూడా గత ప్రభుత్వం పక్కన పెట్టేసింది. తాజాగా స్పోర్ట్స్ కు ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జేఎన్ఎస్ ను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది.

ఇందులో భాగంగానే వివిధ అభివృద్ధి పనులు చేపట్టి క్రీడాకారులు, కోచ్ లు, ఇతర సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆఫీసర్ల నుంచి ప్రతిపాదనలు కోరగా, డీవైఎస్ వో ఆధ్వర్యంలో దాదాపు రూ.14.2 కోట్లతో స్టేడియం డెవలప్ మెంట్​కు ప్రపోజల్స్ పంపించారు.

10 పనులు.., రూ.14.2 కోట్లు.. 

రాష్ట్రంలో త్వరలోనే క్రీడా పాలసీని తీసుకొస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు అధికారులు కూడా క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఇందులో భాగంగానే జేఎన్​ఎస్ స్టేడియాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కొద్దిరోజుల కిందట తెలంగాణ స్పోర్ట్స్, యువజన, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ఏ.వాణీప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డైరెక్టర్​ డా.లక్ష్మీ, ఇతర అధికారులు స్టేడియాన్ని పరిశీలించగా, హనుమకొండ డీవైఎస్​వో అశోక్ కుమార్, శాట్ చైర్మన్​ శివసేనా రెడ్డి కలిసి ఇక్కడి సమస్యల గురించి వివరించారు.

అనంతరం వారి సూచనల మేరకు జవహార్ లాల్ నెహ్రూ స్టేడియాన్ని డెవలప్ చేసేందుకు ప్రపోజల్స్ రెడీ చేశారు. మొత్తంగా జేఎన్ఎస్ లో 10 పనులు చేపట్టేందుకు ప్రతిపాదించగా, దాదాపు రూ.14.26 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేశారు. ఆయా ప్రతిపాదనలకు తొందర్లోనే ఆమోదం లభించే సంకేతాలు కనిపిస్తుండగా, వర్షాకాలం తర్వాత పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది.

మారనున్న స్టేడియం రూపురేఖలు

రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న వరంగల్ లోని జేఎన్ స్టేడియంలో మూడేండ్ల కిందట కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన సింథటిక్ ట్రాక్ తప్ప చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ లేదు. గత ప్రభుత్వానికి ఇక్కడి అధికారులు ప్రతిపాదనలు పంపించినా, స్పందన లేకపోవడంతో అభివృద్ధికి నోచుకోలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపాదనలు కోరడంతో తొందర్లోనే స్టేడియంలో అభివృద్ధి పనులకు అడుగులు పడనున్నవి. ప్రధానంగా రూ.6.25 కోట్లతో రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్ అండ్ ఆఫీస్ బిల్డింగ్, రూ.2.05 కోట్లతో ఇండోర్ స్టేడియం జిమ్నాస్టిక్స్ హాల్​ రూఫ్ మార్పు

రూ.2.12 కోట్లతో కబడ్డీ, రెజ్లింగ్ కు స్పెషల్ హాల్స్, రూ.1.35 కోట్లతో జేఎన్​ఎస్ లోపల సీసీ పాత్ వే, రూ.61 లక్షలతో స్విమ్మింగ్ పూల్ చుట్టూ స్కేటింగ్ రింక్​, రూ.1.65 కోట్లతో వివిధ చోట్ల సీసీ రోడ్లు వేయనున్నారు. దీంతో జవహార్ లాల్ నెహ్రూ స్టేడియం రూపురేఖలే మారిపోనున్నాయి. కాగా, సంబంధిత పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపి, పనులు తొందరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు చేపడతాం

ప్రభుత్వ సూచనల మేరకు కలెక్టర్ ఆదేశాలతో జేఎన్​ఎస్​ డెవలప్ మెంట్ పనులకు ప్రతిపాదనలు పంపించాం. తొందర్లోనే ఆమోదం లభించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్​ రాగానే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. జవహార్​లాల్​ నెహ్రూ స్టేడియంను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం.

- గుగులోతు అశోక్ కుమార్, డీవైఎస్​వో, హనుమకొండ